రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిందాల్ కంపెనీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానం ప్రోత్సాహకరంగా ఉందని కంపెనీ ప్రతినిధులు అన్నారు. గురువారం జిందాల్ లిమిటెడ్ సీఈఓ కమ్ డైరెక్టర్ నీరజ్ కుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మనీశ్‌కుమార్, వైస్ ప్రసిడెంట్ రాజీవ్ సింగ్ సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు.

-రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రోత్సాహకరంగా ఉంది.. -సీఎం కేసీఆర్‌తో సమావేశమైన జిందాల్ కంపెనీ ప్రతినిధులు -సెయిల్ విఫలమైతే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని సీఎం సూచన ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకునే అవకాశం కల్పించాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మంచినీటి పథకానికి అవసరమయ్యే పైపులను సరఫరా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. పైపుల తయారీ కేంద్రాన్ని కూడా తెలంగాణలోనే నెలకొల్పుతామని సీఎంకు తెలిపారు. ఉక్కు పరిశ్రమలో అపార అనుభవం ఉన్న తమకు రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ స్థాపించే అవకాశం ఇవ్వాలని కోరారు. వరంగల్-ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లోని బయ్యారం ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సెయిల్ ముందుకు వస్తున్నదని, ఏదైనా కారణాల వల్ల సెయిల్ సకాలంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పకపోతే.. పరిశ్రమ ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ జిందాల్ ప్రతినిధులకు సూచించారు.
రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, జిందాల్ కంపెనీలు అందులో భాగస్వాములు కావడానికి ముందుకు రావడం శుభపరిణామమని సీఎం అన్నారు. తెలంగాణ మంచినీటి పథకానికి సంబంధించి జిందాల్ కంపెనీ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామన్నారు. త్వరలోనే నూతన పారిశ్రామిక విధానం ప్రారంభమవుతుందని, అప్పుడు ఆయా కంపెనీల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. విద్యుత్ ఉత్పత్తికి చేస్తున్న ప్రయత్నాలు రెండేండ్లలో పూర్తిస్థాయిలో ఫలిస్తాయని సీఎం వెల్లడించారు.
హైదరాబాద్‌లో మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరణ జరుగుతుందని, నగరశివార్లలో ఫార్మాసిటి, ఫిల్మ్‌సిటీ ఏర్పాటు కాబోతున్నాయని సీఎం వారికి తెలిపారు. ఐటీ పరిశ్రమ బాగా విస్తరిస్తున్నదని, ఏరోస్పేస్ పరిశ్రమలు కూడా ప్రారంభమవుతున్నాయన్నారు. రాబోయే కొద్దినెలల్లోనే రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమల స్థాపన జరుగుతుందని, ఈ కార్యక్రమాల్లో జిందాల్ కంపెనీ భాగస్వామ్యం కావాలని సీఎం కోరారు. సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు పాల్గొన్నారు.