-కాళేశ్వరంతో అద్భుత జలదృశ్యం -ప్రాజెక్టులతో రెండో హరితవిప్లవం -మరికొందరికీ రైతుబంధు అమలు -కుందేళ్లను తిన్న నక్కలు కాంగ్రెసోళ్లు -సిరిసిల్ల జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్

‘యాభైఏండ్ల చరిత్రలో ఎన్నడూ చూడని జలదృశ్యం కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆవిష్కృతమైంది. ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తళ్లు దుంకుతున్నయి. ఏ తెలంగాణ అయితే కరువు నేల అన్నారో.. అన్నం తినే సంస్కారం కూడా లేదంటూ వెక్కిరించిండ్రో.. ఆ తెలంగాణే నేడు దేశానికి బువ్వ పెట్టే స్థాయికి ఎదిగింది’ అని మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామంలోని ఊరచెరువులోకి రంగనాయక్‌సాగర్ నుంచి వచ్చిన గోదావరి జలాలకు మంత్రి కేటీఆర్ బుధవారం హారతి ఇచ్చారు. పలు గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలలో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా మారిందని భారత ఆహార సంస్థ చెప్తుంటే ప్రతి తెలంగాణ వాసి, రైతు బిడ్డ గుండెలనిండా గర్వంతో సంతోషపడుతున్నాడన్నారు. గంగను భగీరథుడు శివుడి నెత్తి నుంచి కిందకు తెస్తే, అపరభగీరథుడైన కేసీఆర్ అదే గంగను కింది నుంచి 618మీటర్ల పైకి తెచ్చారని కొనియాడారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుతో రాష్ట్రంలో జలవిప్లవం రాబోతున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా నదులపైన నిర్మించిన ప్రాజెక్టులతో రెండో హరిత విప్లవం తెస్తున్నామని చెప్పారు. కరెంటుతో పనిలేకుండా కాలువల ద్వారా పంటలు పండించాలన్నదే సీఎం ఉద్దేశమని తెలిపారు.

అనుబంధ రంగాలను ఎంచుకోవాలి వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలను ఎంచుకుని అభివృద్ధి చెందాలని మంత్రి కేటీఆర్ యువతకు పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని కొత్తపుంతలు తొక్కించేందుకే నియంత్రిత పంటల విధానం తీసుకొచ్చామని, సర్కారు చేస్తున్న ఈ ఆలోచనకు కొందరు వక్రభాష్యం చెప్తున్నారని మండిపడ్డారు.
అందరికీ రైతుబంధు చెక్కులు గతంలో రైతుబంధు చెక్కులు వచ్చిన వారందరికి మళ్లీ ఇస్తామని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. అవసరమైతే మరికొందరికీ ఇస్తామని చెప్పారు. రైతులను రాబంధుల్లా పీక్కు తిన్నోళ్లు నేడు రైతుబంధు గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఎద్దేవాచేశారు. ఒకప్పుడు సిరిసిల్లలో వానలు పడితేనే తప్ప, మానేరు బ్రిడ్జి కింద నీళ్లు కనిపించేవి కాదని, నేడు 360 రోజులు నీటితో కోస్తాంధ్రలాగా వాగు కళకళలాడుతుండటం ఆనందంగా ఉన్నదన్నారు. జిల్లాలో ఆరుమీటర్ల ఎత్తుకు భూగర్భజలాలు పెరుగడం హర్షణీయ మన్నారు. ఐఏఎస్‌లకు ఇచ్చే శిక్షణలో రాజన్న సిరిసిల్ల జిల్లా భూగర్భ జలాలపై కేంద్ర ప్రభు త్వం పాఠాలు చెప్పడం తెలంగాణకే గర్వకారణమన్నారు. రూ. 1000 కోట్లతో మధ్యమానేరు నుంచి ఎత్తిపోతల ద్వారా, అలాగే మల్లన్నసాగర్ కాలువ ద్వారా ఎగువ మానేరు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
