Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

రాష్ట్రంలో వ్యవసాయ విప్లవానికి రైతువేదికలే నాంది

-నావంతు 5 రైతు వేదికలు -రాజన్నసిరిసిల్ల జిల్లాలో సొంతఖర్చులతో నిర్మాణం -రాష్ట్రంలో వ్యవసాయ విప్లవానికి రైతువేదికలే నాంది -రైతుబంధు పథకాన్ని తొలగించే ఆలోచనే లేదు -సంక్షోభంలోనూ రూ.1200 కోట్లు రుణమాఫీ -భూములకు నీళ్లు పారుతుంటే కాంగ్రెసోళ్ల కండ్లలో నీళ్లు -మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ -పలుచోట్ల రైతువేదికల నిర్మాణానికి శంకుస్థాపనలు

రాష్ట్రంలో రైతు వేదికలు వ్యవసాయ విప్లవానికి నాంది కావాలని మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. రైతువేదికల నిర్మాణానికి సహకారం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. మంగళవారం రాజన్నసిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన, తనవంతుగా ఐదు రైతువేదికలను సొంతఖర్చుతో నిర్మించనున్నట్టు తెలిపారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌, వీర్నపల్లి, తంగళ్లపల్లి, బోయినపల్లిలో రైతువేదికల నిర్మాణానికి సంబంధించిన పత్రాలను జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌కు అందించారు. జిల్లాలోని ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేట మండలాల్లో రైతువేదికల నిర్మాణానికి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎల్లారెడ్డిపేట, వేములవాడ, బోయినపల్లి మండలాల్లో నియంత్రిత సాగుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని ప్రసంగించారు. నియంత్రిత పంటల సాగు విజయానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని రైతులు, అధికారులకు పిలుపునిచ్చారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి రైతును రాజును చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్ప సాహసం చేస్తున్నారని పేర్కొన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల సంక్షేమంకోసం చేపట్టిన రైతుబంధు పథకం ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగుతుందని, దానిని తొలగించాలన్న ఆలోచన సీఎం కేసీఆర్‌కు లేదని మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. ప్రతిపక్షాలు పనిగట్టుకొని రైతుబంధు పథకాన్ని తొలగిస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కరోనా సంక్షోభంతో రాష్ట్ర ఆదాయం 95 శాతం తగ్గినా రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి 5.50 లక్షల మంది రైతులకు రూ.1200 కోట్లు రుణమాఫీ నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తుచేశారు. రైతుబంధు పథకానికి రూ.7వేల కోట్లు అందించినట్టు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కోసం గంటలతరబడి లైనులో నిలబడే దుస్థితి ఉండేదని, చివరికి విత్తనాలు కూడా పోలీస్‌స్టేషన్‌లో పెట్టి అమ్మారని చెప్పారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో ఎరువులు, విత్తనాలకోసం లైనులో నిలబడి ముగినె ఎల్లయ్య అనే రైతు మృతిచెందిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా రైతులకు 24గంటల కరెంటు ఇవ్వలేదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దానిని సాధ్యంచేసిందని తెలిపారు.

సిరిసిల్ల జిల్లాను కోనసీమగా మారుస్తా.. మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాను కోనసీమగా అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. గోదావరి జలాల రాకతో జిల్లాలో సాగు విస్తీర్ణం రెండున్నర లక్షలకు పెరిగిందన్నారు. యాసంగి సాగు వరకు జిల్లాలో మల్కపేట రిజర్వాయర్‌ పూర్తి చేసి ముఖ్య మంత్రి కేసీఆర్‌చేతుల మీదుగా ప్రారంభిస్తామని, తద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని తెలిపారు. ‘బోయినపల్లి మండలం కొదురుపాక మా అమ్మమ్మ ఊరు. కొదురుపాక చీర్లవంచ మధ్యలో ఉన్న వాగులో నేను టవల్‌ వేసి చేపలు పట్టాను’ అని గుర్తు చేసుకున్నారు. గోదావరి జలాలతో రాజన్నసిరిసిల్ల జిల్లా నీటి జంక్షన్‌గా మారిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సముద్రమట్టానికి 100 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరిని 618 మీటర్ల ఎత్తుపైకి తీసుకెళ్లి కొండ పోచమ్మ ద్వారా బీడు భూములను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాగుభూములుగా మారుస్తున్నారని తెలిపారు. గోదావరి జలాలతో జిల్లాలో 6 మీటర్ల వరకు భూగర్భజలాలు పెరగడం అసాధారణ విషయమన్నారు. సమావేశాల్లో కేటీఆర్‌ చేనేత మాస్క్‌ ధరించటం అందరినీ ఆకర్శించింది.

కాంగ్రెస్‌ నేతలు సిగ్గుపడాలి.. పోతిరెడ్డిపాడు వివాదంపై మాట్లాడేందుకు కాంగ్రెస్‌ నేతలు సిగ్గుపడాలని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. పోతిరెడ్డిపాడు జీవో ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదా..? ఆనాడు కృష్ణా జలాలను తరలించుకుపోయేందుకు హారతులు పట్టింది ఆ సర్కారు కాదా? అని నిలదీశారు. కాళేశ్వర జలాలలతో వేసవిలోనూ చెరువులు నిండుకుండల్లా కనిపిస్తుంటే ప్రతిపక్షాలకు కళ్లలో నీళ్లు వస్తున్నాయని ఎద్దేవాచేశారు. సీఎం కేసీఆర్‌ ఉన్నంత వరకు రైతులకు అన్యాయం జరగదని, వేదికలతోనే రైతు బాగుపడుతాడనేది ఆయన ఆలోచన అని స్పష్టంచేశారు.

వ్యవసాయ సంస్కరణల ఘనత కేసీఆర్‌దే: వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి రాష్ట్రంలో వ్యవసాయ సంస్కరణలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మంత్రి నిరంజన్‌రెడ్డి కొనియాడారు. ప్రతి సంక్షేమపథకం విషయంలో ఓ రైతులా ఆలోచిస్తారని అన్నారు. నీటి సదుపాయం పెరిగిన క్రమంలో పండించిన పంటకు డిమాండ్‌ ఉండేలా నూతన వ్యవసాయ సాగు విధానానికి నాంది పలికారని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 26 జిల్లాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. క్షేత్రసాయిలోని వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితిలు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రతి 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయాధికారి -ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

వ్యవసాయంలో నూతన విధివిధానాలను తీసుకరావడమే కాకుండా ఎప్పటికప్పుడు రైతులను వెన్నంటి ఉండేవిధంగా ప్రతి 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయాధికారిని నియమించామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ తెలిపారు. నియంత్రిత సాగుకోసం ఇప్పటికే గ్రామాల్లోని రైతులు మూకుమ్మడిగా తీర్మానాలు చేస్తున్నాని తెలిపారు. మనం తినే సన్న బియ్యం పండించడం ద్వారా మార్కెట్‌లో డిమాండ్‌తోపాటు మనకే ఆహారంగా ఉపయోగపడతాయన్నారు. క్షేత్రస్థాయిలో రాజకీయాలకు అతీతంగా రైతును ప్రోత్సహిస్తూ ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు నూతన విధానాలను అమలు చేసే విధంగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ రైతును రాజు చేయడానికే ప్రభుత్వం సాససోపేత నిర్ణయం తీసుకుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, ఆర్‌బీఎస్‌ జిల్లా కన్వీనర్‌ గడ్డం నర్సయ్య, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.