Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులివ్వండి

రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన పర్యావరణ అనుమతులను త్వరగా ఇవ్వాలని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు తెలంగాణకు ప్రాణధార. ఈ ప్రాజెక్టు వీలైనంత త్వరగా పూర్తికావాలంటే తొలి దశకుగాను 7830 ఎకరాల అటవీ భూములకు పర్యావరణ అనుమతులను కేంద్రం ఇవ్వాల్సి ఉంది అని ప్రకాష్ జవదేకర్‌కు విన్నవించారు.

Harish-Rao-met-with-Aviation-Minister-Ashok-minister-and-Forest-Minister-Javadekar01 కేంద్ర మంత్రి జవదేకర్‌తో రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు భేటీ -కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయండి -పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజుకు విజ్ఞప్తి ఇప్పటికే ఈ విషయమై లేఖ రాశామని, జాతీయ హోదా కల్పించనున్నట్లు కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చినందువల్ల ఈ అనుమతులు మంజూరైతే ప్రాజెక్టు నిర్మాణపు పనులు ఊపందుకుంటాయని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లా కొమురంభీం ప్రాజెక్టు రెండో దశ నిర్మాణానికిగాను 12.54 హెక్టార్ల మేరకు అటవీ భూమి ఒక చోట, 52.60 హెక్టార్ల అటవీ భూమికి మరోచోట అనుమతులు అవసరమని, ఈ మేరకు ప్రత్యామ్నాయ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందని స్పష్టం చేశారు.

మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు జొన్నలగడ్డలో తొలి దశలో 114.21 హెక్టార్లు, రెండవ దశలో 27 హెక్టార్లు, ఇక్కడే గుడిపల్లిగట్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏర్పాటుకు 8.21 హెక్టార్లు అటవీ భూమి అవసరమన్నారు. ఈ విజ్ఞప్తులకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ సానుకూలంగా స్పందించారు.

-పౌరవిమానయానశాఖ మంత్రితో భేటీ ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. అనేక కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, బొగ్గు గనులు, పర్యాటక ప్రాధాన్యత, ఆధ్యాత్మిక క్షేత్రమైన భద్రాచలంకు నిత్యం భక్తుల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని కొత్తగా విమానాశ్రయాన్ని నెలకొల్పాలని కోరారు. విమాన సౌకర్యం ఉన్న హైదరాబాద్‌కు కొత్తగూడెం చాలా దూరమన్నారు.

కొత్తగూడెంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ, ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు కూడా ఉపయోగంగా ఉంటుందన్నారు. కొత్తగూడెం మండలం పునుకుడుచెల్క గ్రామంలో 1600 ఎకరాల మేర స్థలాన్ని విమానాశ్రయం ఏర్పాటుకు అనువైనదిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. ఇక్కడినుంచి అత్యవసర సమయాల్లోనూ భద్రతాపరమైన అవసరాలకోసం విమానాలు, హెలికాప్టర్ల రాకపోకలకు కూడా వినియోగించుకోవచ్చునని హరీశ్‌రావు వివరించారు. శంషాబాద్ విమానాశ్రయానికి విదేశీ విమానాల కనెక్టివిటీని మరింతగా పెంచాలని కోరారు.

హైదరాబాద్‌లో విమానాల మరమ్మతులు, నిర్వహణ, సర్వీసింగ్ (మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాలింగ్-ఎమ్మార్వో) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఇరువురు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులను వీలైనంత త్వరగా మంజూరు చేసేందుకు కేంద్రమంత్రి జవదేకర్ సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారని, ఈ నెల మూడో వారంలో జరిగే సమావేశంలో ఎజెండా అంశంగా పెట్టుకుని చర్చిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

త్వరలోనే హైదరాబాద్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని విషయాలపై కూలంకషమైన సమీక్ష జరుపుతానని పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు హామీ ఇచ్చారని తెలిపారు. తాము విజ్ఞప్తి చేసిన అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించారని అన్నారు. మంత్రి హరీశ్‌రావుతో పాటు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు నాయక్ కూడా కేంద్రమంత్రుల భేటీలో పాల్గొన్నారు. మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తులకు కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించారని.. దీంతో మంత్రి ఢిల్లీ టూర్ సక్సెస్ అయ్యిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.