-సీఎంను కలిసిన థింక్ కాపిటల్, థింక్ ఎనర్జీ చైర్మన్లు -విద్యుత్, వ్యర్థజల వినియోగ ప్రాజెక్టులపై ఆసక్తి -పూర్తి ప్రాజెక్టు రిపోర్టుతో వస్తే నిర్ణయం: సీఎం కేసీఆర్

అమెరికాకు చెందిన థింక్ కాపిటల్, థింక్ ఎనర్జీ సంస్థలు తెలంగాణలో విద్యుత్, వ్యర్థ జలం పునర్వినియోగం, గ్యాస్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. గురువారం థింక్ కాపిటల్ ఛైర్మన్ డీ రవిరెడ్డి, థింక్ ఎనర్జీ ఛైర్మన్ ప్రశాంత్ మిట్టల్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యుత్, వ్యర్థజలం టెక్నాలజీపై తాము చేస్తున్న వివిధ ప్రాజెక్టుల వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా వ్యర్థజలాన్ని పునర్వినియోగించేలా తీర్చిదిద్దడం, విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు వారు తమ ఆసక్తిని సీఎం ముందుంచారు.
వీటితో పాటు గ్యాస్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయగల సాంకేతిక సామర్థ్యం కూడా తమ సంస్థలకు ఉన్నదని వారు వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టులతో రండి. మీరు చెప్పిన టెక్నాలజీ, ప్రాజెక్టులను పరిశీలిద్దాం.. సమీక్షించి స్థానికంగా అమలుకు నిర్ణయం తీసుకుందాం అని వారికి చెప్పారు. పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికలతో వస్తే ఓ నిర్ణయం తీసుకోవడం సాధ్యపడుతుందని ఆయన వారితో అన్నారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, తెలంగాణ జెన్‌కో ఛైర్మన్ డీప్రభాకర్‌రావు, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్‌లు ఉన్నారు.