-సీఎం కేసీఆర్‌తో జపాన్ కౌన్సిల్ జనరల్ నకానో భేటీ -తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు సంసిద్ధత

రాష్ట్రంలో భారీఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు అభివృద్ధి చెందిన దేశాలు ముందుకు వస్తున్నాయి. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు సీఎం కే చంద్రశేఖర్‌రావుతో గురువారం సమావేశమై హైదరాబాద్‌లో పరిశ్రమల స్థాపనకు సంసిద్ధత వ్యక్తం చేయగా, తాజాగా జపాన్ కౌన్సిల్ జనరల్ మసనోరి నకానో శుక్రవారం సచివాలయంలో తన ప్రతినిధి బృందంతో కలిసి సీఎం కేసీఆర్‌తో పెట్టుబడులపై చర్చలు జరిపారు. హైదరాబాద్‌లో పరిశ్రమలు స్థాపనకు తాము సిద్ధమని సీఎం కేసీఆర్‌కు జపాన్ ప్రతినిధులు వివరించినట్టు తెలుస్తున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణవ్యాప్తంగా పరిశ్రమలను స్థాపించేందుకు జపాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రం అటవీ సంపద, సహజవనరులతో అలరారే ప్రాంతమని, హైదరాబాద్‌తో సహా దాదాపు అన్ని జిల్లాలు సమశీతోష్ణ వాతావరణం ఉంటుందని, పలురకాల స్వభావాలు కలిగిన నేలలు ఉన్నాయని సీఎం జపాన్ ప్రతినిధులకు వివరించినట్టు తెలుస్తోంది. తెలంగాణ భూకంప రహిత ప్రాంతమని, సునామీ వంటి ప్రకతి వైపరీత్యాలకు దూరమని చెప్పినట్టు సమాచారం. నూతన రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విదేశీ పారిశ్రామిక విధానాన్ని అమలులోకి తేనున్నట్లు జపాన్ ప్రతినిధులకు కేసీఆర్ వివరించారు.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పుతాం భారీస్థాయిలో పెట్టుబడులు పెట్ట్టే విదేశీ కంపెనీలకు హైదరాబాద్‌ను కూడలిగా నిలుపేందుకు ప్రభుత్వం అనేక నూతన పథకాలను అమలులోకి తేనున్నదని జపాన్ ప్రభుత్వ ప్రతినిధులకు కేసీఆర్ వివరించినట్టు సమాచారం. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దనున్నామని అందుకు సంబంధించిన కార్యాచరణను త్వరలోనే ప్రారంభించనున్నామని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ అధునీకరణ, మౌలిక వసతుల కల్పన తదితర ఏర్పాట్లను మరో రెండేండ్లలో పూర్తిచేయనున్నామని, రెండేండ్లకు తర్వాత వచ్చి చూడండి హైదరాబాద్‌ను ఎంత గొప్పగా తీర్చి దిద్దుతామో అని చెప్పినట్టు తెలుస్తోంది.
మళ్లీ కలుద్దాం తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సంసిద్ధత వ్యక్తం చేయడాన్ని సీఎం కేసీఆర్ స్వాగతించారు. అందకు సంబంధించి సమగ్ర విధి విధానాలతో త్వరలో పూర్తిస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందామని జపాన్ ప్రతినిధులను మరోసారి ఆహ్వానించారు. తెలంగాణతో జపాన్‌కున్న ఆర్థిక, సాంస్కృతిక అనుబంధంపై ఈ సందర్భంగా వారు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్నారు.
హైద్రాబాద్ సంస్కృతి గొప్పదని నగరానికున్న చారిత్రక నేపథ్యం స్నేహ పూర్వకమైందని వారు కేసీఆర్‌తో అన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ప్రభుత్వ ప్రతినిధులు చేసిన పలు ప్రతిపాదనలకు కేసీఆర్ సానుకూలతను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన నకానో తమ దేశానికి చెందిన హస్తకళలకు చెందిన సాంస్కృతిక చిహ్నాన్ని జ్ఞాపికగా అందించారు. దీనికి బదులుగా తెలంగాణ సాంస్కృతిక చిహ్నం చార్మినార్ ప్రతిమను కేసీఆర్ వారికి బహూకరించారు.