Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

రాష్ర్టానికి జలహారం

– 30 వేల కోట్లతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం – న్యూయార్క్ సిటీలా కరీంనగర్ – బృందావన్ గార్డెన్‌లా అతి పెద్ద పార్కు – 14వేల క్యూసెక్కులకు కాకతీయ కెనాల్ సామర్థ్యం – కరీంనగర్ జిల్లా పర్యటనలో – వరాల వర్షం కురిపించిన సీఎం కేసీఆర్ – సీఎం హోదాలో తొలిసారి జిల్లాకు సీఎం – బోనాలు, బతుకమ్మలతో ఘనస్వాగతం – 19న జరిగే సర్వే అందరికీ తప్పనిసరి – విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి

KCR-002 వచ్చే నాలుగేండ్లలో రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి మంచినీరు అందించి తీరుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇందుకోసం తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ అనే కొత్త పథకాన్ని ప్రకటించారు. దీంతోపాటుగా కరీంనగర్ జిల్లాపై వరాల జల్లులు కురిపించారు. సింగరేణి రూపురేఖలు మార్చి తీరుతామని చెప్పిన కేసీఆర్.. 19న జరిగే ఇంటింటి సర్వేలో అందరూ పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సీఎం హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన కేసీఆర్‌కు కరీంనగర్ ప్రజలు ఘనస్వాగతం పలికారు. బోనాలు, బతుకమ్మలతో ఎదురేగి ఆయనను ఊరేగింపుగా తీసుకెళ్లారు. దారిపొడవునా విద్యార్థినులు, ప్రజలు బారులు తీరి.. ఆయనపై పూల వర్షం కురిపించారు. వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం.. జిల్లా అభివృద్ధి సంక్షేమ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పథకాన్ని రూ.25వేల కోట్ల నుంచి 30వేల కోట్ల రూపాయలతో చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా లక్ష కిలోమీటర్ల మేర పైపులైన్లు విస్తరిస్తామని తెలిపారు. ఇందుకు మొత్తంగా 160 టీఎంసీల నీరు అవసరమవుతుందని, గోదావరి, కృష్ణా నదులనుంచి 80 టీఎంసీల చొప్పున తీసుకోవడానికి ప్రణాళిక సిద్ధంచేశామని చెప్పారు.

KCR-

గుజరాత్‌లో ఈ తరహా ప్రాజెక్టు అమలవుతుందని చెప్పిన సీఎం.. త్వరలోనే రాష్ర్టానికి చెందిన ఎమ్మెల్యేలు, అధికారుల బృందం ఈ పథకాన్ని పరిశీలించడానికి వెళుతుందని తెలిపారు. అవసరాన్ని బట్టి తాను కూడా వెళ్లి పథకం అమలుతీరును పరిశీలిస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు దిక్కులనుంచి ఈ పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఉత్తర తెలంగాణలో కరీంనగర్, దక్షిణ తెలంగాణలో నల్లగొండ, తూర్పు తెలంగాణలో ఖమ్మం, పశ్చిమ తెలంగాణలో నిజామాబాద్ జిల్లాల్లో ఒకే రోజు పనులకు శంకుస్థాపనలు చేస్తామని వివరించారు. ఇందుకు సంబంధించిన ప్రధాన ఫౌండేషన్‌ను తాను స్వయంగా నల్గొండ జిల్లాలో వేస్తానని చెప్పారు.

మిగిలినచోట్ల ఇద్దరు డిప్యూటీ సీఎంలు, అర్థిక మంత్రి శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. ఈ పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేసి, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రస్తుతం వివిధ పథకాల కింద కొనసాగుతున్న మంచినీటి పథకాలన్నింటినీ దీనిలోనే విలీనం చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులో 10% మంచినీటికి, 10% నీటిని పరిశ్రమలకు వినియోగించేలా నిర్ణయం తీసుకున్నామని, కాబట్టి గ్రిడ్ పథకంలో భాగంగా ఎక్కడ నీటి లభ్యత ఉంటే అక్కడి నుంచి తీసుకొని ప్రజలకు సరఫరా చేస్తామని చెప్పారు.

న్యూయార్క్ సిటీలా కరీంనగర్ హైదరాబాద్ మినహాయిస్తే కరీంనగర్, ఖమ్మం, నిజమాబాద్, రామగుండం, వరంగల్ ప్రధాన నగరాలుగా ఉన్నాయని సీఎం అన్నారు. ఈ కార్పొరేషన్ల పరిధిలో ఇప్పటివరకు పనులన్నీ అశాస్త్రీయంగా జరిగాయని చెప్పారు. ఇక ముందు అలా ఉండదు. కరీంనగర్ కార్పొరేషన్‌ను ఎవరూ ఊహించనిరీతిలో అభివృద్ధిచేస్తాం. నగరం చుట్టూ బ్రహ్మాండమైన రింగ్‌రోడ్డుతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో నాలుగులైన్ల రహదారి నిర్మిస్తాం. భవిష్యత్తులో కరీంనగర్ సిటీని లండన్, న్యూయార్క్ నగరాల్లా తీర్చిదిద్దుతాం. అభివృద్ధి ఇలా కూడా చేయవచ్చా! అని ప్రతి ఒక్కరు అశ్చర్యపోయే రీతిలో చేసి చూపిస్తాం. ఈ పనులకు నేనే ఇన్‌చార్జిగా ఉండి పరిశీలిస్తాను అని సీఎం ప్రకటించారు. టూరిజంపరంగా ఊహించిన రీతిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించామని తెలిపారు.

లోయర్ మానేరు డ్యాం పరిధిలో ప్రస్తుతం 207 ఎకరాల స్థలం ఉంది. ఇక్కడ మూడు నాలుగు వందల ఎకరాలు సేకరించి మైసూర్ బృందావన్ గార్డెన్‌లా పెద్ద పార్కు ఏర్పాటు చేస్తాం. లోయర్ మానేర్ డ్యాంలో భవిష్యత్తులో ఎప్పుడూ నీళ్లు ఉండేలా ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. ఇప్పటికే శ్రీరాంసాగర్, మధ్య మానేరు, వరదకాలువ ప్రాజెక్టులతో ఎల్‌ఎండీ అనుసంధానమైవుంది. శాశ్వతంగా నీరు ఉంటుంది కనుక ఎల్‌ఎండీని బోటింగ్ స్పాట్‌గా తీర్చిదిద్ది, రెస్టారెంట్ ఏర్పాటుచేస్తాం. రెండు మూడు వందల మంది చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేలా ప్రత్యేక బోటును ఏర్పాటు చేస్తాం. ఈ స్థలంలో కొన్ని ప్రత్యేక హంగులతో విల్లాలు కడుతాం. ఎలగందులపోర్టు, కొండగట్టు, వేములవాడ దేవస్థానాలను టూరిజం కేంద్రాలుగా మార్చుతాం. కొండగట్ట వద్ద తిరుమల మాదిరిగావిల్లాలు నిర్మిస్తాం. అతి త్వరలోనే దైవ దర్శనం కోసం వేములవాడ దేవస్థానానికి వెళతాను. అక్కడ ఏ తరహాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో అలోచించి నిర్ణయం తీసుకుంటాం అని సీఎం చెప్పారు.

ఇక వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లు రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లోనూ ప్రస్తుతం ఉన్న వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లు పెట్టేలా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా పరిషత్తు, కార్పొరేషన్, కళాభారతి భవనాలు పాత పడిపోయాయని, సాధ్యాసాధ్యాలు పరిశీంచి వీటి స్థానంలో బహుళ అంతస్తుల భవంతులు కట్టే విషయాన్ని కూడా పరిశీలిస్తామని ప్రకటించారు.

కాకతీయ కెనాల్ సామర్థ్యం పెంచుతాం కాకతీయ కెనాల్ సామర్థ్యం పెంచడానికి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 12 వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 14వేల క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయించామని తెలిపారు. ప్రధాన కెనాల్‌కింద ఉన్న బ్రాంచి కెనాల్స్‌ను అధునీకరిస్తామని, తద్వారా చివరి భూములకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో రీ జనరేటర్ వాటర్ వినియోగంపై అంచనాలు తయారీకి అదేశాలు జారీచేసినట్లు చెప్పారు. తద్వారా మరో లక్ష ఎకరాల ఆయకట్టు పెరుగుతుందన్నారు.

రుణ మాఫీ నూటికి నూరుపాళ్లు ఖాయం రైతు రుణాల మాఫీని నూటికి నూరుపాళ్లు అమలుచేసి తీరుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందులో ఉన్న ఒకటి రెండు చిన్న చిన్న సమస్యలు తప్పితే.. ప్రభుత్వం మొత్తం మాఫీ చేసినట్లుగా రైతులు భావించాలని చెప్పారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు అనవసరపు విమర్శలకు వెళుతున్నారన్న సీఎం.. వాటిని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

లేనివాడు లెక్కకు రాడు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈనెల 19న సమగ్ర కుటుంబ సర్వే చేస్తుందని, ప్రతి ఒక్కరు సర్వేలో తమ వివరాలు నమోదు చేయించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆరోజు ఇండ్లలో లేని వారు లెక్కకు రారని స్పష్టం చేశారు. భారతదేశంలోనే ఒకే రోజు సర్వే చేయడం ఇదే మొదటిసారని, నాలుగు లక్షల మంది ఉద్యోగులను ఇందుకు వినియోగిస్తున్నామని సీఎం చెప్పారు.

నిజానికి రాష్ట్రంలో గణాంకాలు సరిగా లేక అనేక ప్రభుత్వ పథకాలు పక్కదారి పడుతున్నాయని తెలిపారు. గృహ నిర్మాణ పథకం, రేషన్‌కార్డులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లలో ఎన్నో కుంభకోణాలకు కారణం సరైన గణాంకాలు లేకపోవడమేనన్నారు. ఈ సర్వేకు మీడియా విసృత ప్రచారం కల్పించాలని కోరారు. సర్వేలో వివరాలు రాయించుకోక పోతే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందే అవకాశాన్ని కోల్పోతారని స్పష్టం చేశారు. ఆ రోజు పెళ్లిళ్లు ఉన్న రద్దు చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా ఆ రోజు బస్సులతోపాటు చివరకు ప్రైవేటు వాహనాలు కూడ రోడ్లపై తిరగవన్నారు. ఉన్న వాహనాలను ప్రభుత్వమే తీసుకుంటుందని, కనుక ప్రజలంతా ఇళ్ల వద్ద ఉండి విధిగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మూడేళ్లు కరెంటు కోతలు తప్పవు రాష్ట్రంలో కరెంటు కోతలు మూడేళ్లపాటు తప్పని పరిస్థితులు ఉన్నాయని సీఎం చెప్పారు. విద్యుత్ కొరత తీర్చడానికి ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నదని వివరించారు. తాము మేనిఫెస్టోలో చెప్పినట్లు ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల తదుపరి 24 గంటలపాటు కరెంటు ఇచ్చి తీరుతామన్నారు. అప్పటివరకు సర్దుబాటు తప్పదన్నారు. తక్షణ అవసరాలు తీర్చే సౌర విద్యుత్‌కు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు.

వేయి మెగావాట్ల ఉత్పత్తికి ప్రణాళికలు తయారు చేయడమే కాకుండా ఇప్పటికే 500 మెగావాట్ల ఉత్పత్తికి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. త్వరలోనే పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాల్లో విధిగా రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అది ఏర్పాటు చేస్తేనే కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇస్తామన్నారు. ఆంధ్రా సర్కారు తెలంగాణను ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నదని సీఎం ఆరోపించారు. తాజాగా 710 మెగావాట్ల విద్యుత్తును చెప్పాపెట్టకుండా కట్ చేయడమే దీనికి నిదర్శనమన్నారు. ఆంధ్ర ప్రభుత్వ చర్యపై కేంద్రానికి లేఖ రాశామన్న సీఎం.. దీనిపై పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌పై ఈ నెల 11న సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నాయని, తుది తీర్పు వచ్చాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కరీంనగర్ జిల్లా నేదునూరు పవర్ ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నామని, ఇవ్వకపోతే థర్మల్ ప్లాంట్‌కు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు.

సింగరేణి రూపురేఖలు మార్చుతాం సింగరేణి ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడంతో పాటు నిమ్స్ తరహాలో ఒక సూపర్‌స్పెషాలిటీ అస్పత్రిని త్వరలోనే ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. ఇది సింగరేణి ఉద్యోగులకు చాలా ఉపయోగపడుతుందన్నారు. సింగరేణి కార్మికుల పిల్లలకు ఈ మెడికల్ కళాశాలలో రిజర్వేషన్లు ఎక్కువ ఇచ్చే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటామన్నారు. సింగరేణి ఆధ్వర్యంలోనే ఒక మైనింగ్ కళాశాల కూడా ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణి రూపురేఖలను అతి కొద్ది రోజుల్లోనే మార్చి తీరుతామన్నారు. గత సీమాంధ్ర ప్రభుత్వాలు తెలివితక్కువతనంతో సింగరేణిని సద్వినియోగం చేసుకోలేకపోయాయన్నారు. సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతాన్ని కూడ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిందని సీఎం తెలిపారు. అస్ట్రేలియా, దక్షణాఫ్రికావంటి దేశాల్లో కొత్త బొగ్గుగనులు తీసుకునేలా సింగరేణి కార్యాచరణ ఉంటుందన్నారు. తద్వారా మరో లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి సింగరేణి చేరుకుంటుందని సీఎం తెలిపారు. విదేశాల్లోనూ సింగరేణి ద్వారా ఉద్యోగాలు పొందే అవకాశం మనకు ముందు ముందు కనిపిస్తుందని చెప్పారు. సింగరేణిని ఒక గొప్ప కంపెనీగా మార్చి చూపిస్తామమని స్పష్టం చేశారు.

కనీవినీ ఎరుగని రీతిలో పుష్కరాలు రాష్ట్రంలోని బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలంతోపాటు మిగిలిన ప్రాంతాల్లోనూ ఈసారి గోదావరి పుష్కరాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని సీఎం చెప్పారు. ధర్మపురిలోనే తాను పుష్కర స్నానం చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న ఈ పుష్కరాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుందని, వందల కోట్లు వెచ్చిస్తామని అన్నారు.

నిమ్స్ తరహాలో జిల్లా కేంద్ర ఆస్పత్రి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అస్పత్రిని నిమ్స్ తరహాలో త్వరలోనే తీర్చిదిద్దుతామని సీఎం చెప్పారు. దీనికి అనుబంధంగా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. మధ్యమానేరు, ఎల్లంపల్లి ముంపు గ్రామాల వాసులకు చెల్లించాల్సిన పరిహారం త్వరలోనే అందుతుందని సీఎం భరోసా ఇచ్చారు. మధ్యమానేరు ప్రాజెక్టును వచ్చే ఏడాదిలోపు పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుత కాంట్రాక్టర్ పనిచేయకపోతే చర్యలు తీసుకోవాలని అదేశించామని చెప్పారు.

కరీంనగర్‌లో అర్బన్ ప్రాంతానికి కొత్తగా రెవెన్యూ కార్యాలయాన్ని మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లిలో 100 పడకల అస్పత్రికి అమోదం తెలుపుతున్నట్లు చెప్పారు. హుస్నాబాద్‌లో 30 పడకల అస్పత్రిని 50 పడకలకు పెంచడానికి నిర్ణయించామన్నారు. రామగుండంకు మహిళా పోలీసు పోలీస్‌స్టేషన్ మంజూరు చేసినట్లు తెలిపారు. మంథనిలో 100 పడకల అస్పత్రి నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించాలని అదేశాలు ఇచ్చామన్నారు. జిల్లాలోని ఏడు ప్రాంతాల్లో కొత్తగా మార్కెట్ యార్డులు ఏర్పాటుచేయడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. కరీంనగర్ సిటీకి ఇద్దరు ట్రాఫిక్ సీఐలు, ఒక డీఎస్పీ పోస్టులు మంజూరు చేసినట్లు సీఎం వెల్లడించారు. రెండు ఇండోర్ సబ్‌స్టేషన్లను మంజూరు చేస్తున్నామన్నారు.

అమరుడు పోలీసు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వమే అదుకుంటుందన్నారు. కరీంనగర్ జిల్లా ఎన్టీపీసీవ ద్ద మరో 4వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంకా కొంత స్థలసేకరణ కావాల్సి ఉందన్నారు. దీన్ని వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.