-రామలింగారెడ్డి నిబద్ధత గొప్పది -ఆదర్శాలను ఆచరించిన అభ్యుదయవాది -ఈ తీర్మానం బాధాకరం, దుఃఖకరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు -అరుదైన నాయకుడు: మంత్రి కేటీఆర్.. రామలింగారెడ్డికి శాసనసభ సంతాపం

దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గొప్ప వ్యక్తి త్వం కలిగిన నాయకుడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో నిబద్ధతతో పనిచేశారని, ఉద్యమ శత్రువులను ఎండగట్టడంలో, ప్రతిఘటించడంలోనూ ఎంతో సాహసంతో వ్యవహరించారని గుర్తుచేశారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంపై శాసనసభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తంచేసింది. సోమవారం ఏకగ్రీవంగా సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానాన్ని ప్రశేపెట్టిన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగి వచ్చిన నాయకుడు సోలిపేట రామలింగారెడ్డి. నిత్యం ప్రజలమధ్యనే మనుగడ సాధించిన నిరాడంబర నేత. రామలింగారెడ్డి హఠాన్మరణం దుబ్బాక నియోజకవర్గ ప్రజలతోపాటు యావత్తు తెలంగాణ ప్రజల హృదయాలను కలచివేసింది. రామలింగారెడ్డి విద్యార్థి దశనుంచే ప్రజా ఉద్యమాలవైపు ఆకర్షితులయ్యారు. ప్రజల హక్కులను కాపాడటానికి పత్రికలు ఉపయోగపడుతాయనే విశ్వాసంతో జర్నలిస్టుగా పనిచేశారు. వామపక్ష భావాలతో ప్రేరేపితమై మెదక్ జిల్లాలో ఎగసిపడిన ఉద్యమాలకు బాసటగా నిలిచారు. జర్నలిస్టు నాయకుడిగా రామలింగారెడ్డికి ప్రత్యేకస్థానం ఉన్నది. రామలింగారెడ్డి ఎమ్మె ల్యే కాకముందు నుంచి ఆయనతో ఆత్మీయ అనుబంధం ఉన్నది. నమ్మిన ఆదర్శాలను ఆచరించిన అభ్యుదయవాది. వరకట్నం, ఇతర ఆడంబరాల ప్రసక్తి లేకుండా సభావివాహం చేసుకున్నారు. ప్రజాకవి కాళోజీతోపాటు అప్పుడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న నా చేతుల మీదుగా ఆ వివాహం జరిగింది. తన పిల్లలకు అదే పద్ధతిలో వివాహం జరిపించిన ఆచరణశీలి. తెలంగాణ ఉద్యమక్రమంలో రామలింగారెడ్డిలోని చురుకుదనాన్ని, నిబద్ధతను, నాయకత్వ లక్షణాలను గమనించి నేను స్వయంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో దొమ్మాటనుంచి టీఆర్‌ఎస్ తరఫున ఘన విజయం సాధించారు. ఉద్యమ ప్రతీఘాతకులను ఎండగట్టడంలోనూ, ప్రతిఘటించడంలోనూ ఎంతో సాహసంతో, పదునుగా వ్యవహరించారు. సమైక్యవాదుల ప్రలోభాలకు లొంగకుండా చెదరని సంకల్పంతో పోరాటంలో నిలిచారు. ఉద్యమ ప్రయోజనాల కోసం నాయకత్వం నిర్దేశించినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేసి, తిరి గి భారీ మెజారిటీతో గెలిచారు. సిద్దిపేటలోని జర్నలిస్టు కాలనీలో ప్రభుత్వం ఇచ్చిన సాధారణమైన ఇంట్లోనే చివరిదాకా నిరాడంబరంగా జీవించారు’ అని చెప్పారు.
అరుదైన నేత సోలిపేట: మంత్రి కేటీఆర్ ప్రస్తుత రాజకీయాల్లో సోలిపేట రామలింగారెడ్డి లాంటి నాయకుడు చాలా అరుదు అని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘2004లో టీఆర్‌ఎస్ టికెట్‌కోసం అత్యంత ఎక్కువ దరఖాస్తులు వచ్చింది, పోటీ పడింది దొమ్మాటలోనే. నిబద్ధ కలిగిన నాయకుడిగా, చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తగా రామలింగారెడ్డి అయితేనే నియోజకవర్గానికి న్యాయంచేస్తారనే ఉద్దేశంతో కేసీఆర్ ఆయనను పోటీలో నిలిపారు. ఆయన విశ్వాసాన్ని వమ్ము కానీయకుండా నిబద్ధతతో చివరిదాకా వెంట నడిచారు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన నేత నమ్మిన సిద్ధాంతానికి జీవితాంతం కట్టుబడిన మహనీయుడు రామలింగారెడ్డి అని మం త్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఉద్యమం లో పలు సందర్భాలలో రామలింగారెడ్డి కీలకపాత్ర పోషించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఉద్యమంలో కేసీఆర్ సైనికుడిగా పనిచేశారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాపం మాజీ ఎమ్మెల్యేలు కావేటి సమ్మయ్య (సిర్పూర్), జువ్వాడి రత్నాకర్‌రావు (బుగ్గారం), సల్లూరి పోచయ్య (ఆలేరు), రామస్వామి (మహారాజ్‌గంజ్), నర్సింహా (ఇబ్రహీంపట్నం), కృష్ణ (ఆసిఫ్‌నగర్), సున్నం రాజ య్య (భద్రాచలం), కిష్టారెడ్డి (కల్వకుర్తి), మాతంగి నర్సయ్య (మేడారం)కు నివాళిగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది.