దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి ఏటా రూ.100 కోట్లను బడ్జెట్‌లో కేటాయిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తక్షణం రూ.వంద కోట్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే క్యాబినెట్ సమావేశంలో దేవాలయ ప్రాధికార సంస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

-తక్షణమే వంద కోట్ల మంజూరు.. దేవాలయ ప్రాధికార సంస్థ ఏర్పాటుకు నిర్ణయం -శృంగేరీపీఠం సౌజన్యంతో వేద, సంస్కృత పాఠశాలల ఏర్పాటు.. -విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి -సతీసమేతంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం -మిడ్‌మానేరు నిర్వాసితుల ఇండ్ల నిర్మాణానికి రూ.5.04లక్షల చొప్పున కేటాయింపు కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సతీసమేతంగా దర్శించుకున్నారు. కరీంనగర్ నుంచి రోడ్డుమార్గం ద్వారా మధ్యాహ్నం పన్నెండున్నరకు సీఎం వేములవాడ చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే రమేశ్‌బాబు ఇంటికి వెళ్లిన కేసీఆర్ పట్టుబట్టలతో కుటుంబ సమేతంగా దేవాలయానికి చేరుకున్నారు. సతీమణి శోభతో పాటు కూతురు కవిత, అల్లుడు అనిల్, నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్‌రావుతో కలిసి వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం గర్భగుడిలో గణపతి పూజలు నిర్వహించి రాజరాజేశ్వరస్వామికి అన్నపూజతో పాటు అభిషేకాలు నిర్వహించారు. మేళతాళాల మధ్య దేవాలయ ప్రధాన మొక్కైన కోడె మొక్కులను సీఎం కుటుంబసభ్యులు చెల్లించుకున్నారు. అమ్మవారికి కుంకుమపూజ తరువాత ఒడిబియ్యం పోసి ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబసభ్యులకు ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. రెండుగంటలపాటు ఆలయ ప్రాంగణంలోని పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాంగణ పరిధిలోని దర్గాలో ప్రార్థనలు చేశారు.

కాలినడకన పరిశీలించిన కేసీఆర్ పూజల అనంతరం కొద్దిసేపు ఎమ్మెల్యే రమేశ్‌బాబు ఇంటిలో విశ్రాంతి తీసుకున్న ముఖ్యమంత్రి, అక్కడే దేవాలయ అభివృద్ధిపై కొద్దిసేపు చర్చించారు. పక్కనే ఉన్న నాంపల్లి నరసింహస్వామి గుట్ట అభివృద్ధి విషయంపై జిల్లా అధికారులతో చర్చించారు. అనంతరం నాలుగు గంటల సమయంలో దేవస్థానానికి చేరుకున్న సీఎం కేసీఆర్ దేవాలయ పరిసరాలను స్వయంగా పరిశీలించారు. రూ.300 కోట్లతో ఇప్పటికే తయారుచేసిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు సంబంధించిన స్థలాలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు.
దేవస్థానాన్ని ఆనుకుని ఉన్న గుడి చెరువుతోపాటు ఆ పరిధిలో చేపట్టాలనుకొన్న ఒక్కొక్క పని గురించి దేవాలయ అధికారులు, సంబంధిత ఇంజినీర్లతో చర్చించారు. ఇదే సమయంలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులు చెప్తూ గంటన్నరపాటు పరిసర ప్రాంతాల్లో కాలినడకన తిరుగుతూ అధికారులకు సూచనలు చేశారు. నాంపల్లి నరసింహస్వామి గుట్ట వద్దకు వెళ్లి పరిశీలించారు. దేవాలయం ఆవరణలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
నాలుగేండ్లలో ఆలయ అభివృద్ధి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షానంతరం విలేకరులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. కాకతీయరాజులకు ముందు నిర్మించిన వేములవాడ దేవాలయాన్ని రానున్న మూడు నాలుగేండ్లలో అన్ని హంగులతో పూర్తిస్థాయిలో అభివృద్ధిచేసి చూపిస్తామన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తదుపరి దేవాలయానికి రావడానికి కొంత అలస్యం జరిగిందన్న ముఖ్యమంత్రి పక్కా ప్రణాళికలతో అభివృద్దిని ముందుకు తీసుకెళతామన్నారు. 47 సంవత్సరాల క్రితం తన పెండ్లి రాజరాజేశ్వరస్వామి సన్నిధిలోనే జరిగిందని గుర్తుచేశారు. తాను అమరణదీక్షకు వెళ్లేముందు వేదపండితుల సూచనల మేరకు రాజన్న దర్శనం చేసుకొని వెళ్లానని, ఆనాడు తెలంగాణ సాధించి వస్తానని మొక్కుకున్నట్టు చెప్పారు, దైవకృపవల్ల ఆ కల నెరవేరడంతోపాటు .. బంగారు తెలంగాణకు బాటలు పడుతున్నాయన్నారు.
అధికారంలోకి వచ్చిన తరువాత చాలాసార్లు రావాలనుకున్నానని, అయితే కొత్త రాష్ట్రమైన కారణంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ఉండి కొంత అలస్యం జరిగిందని వివరించారు. అయినా ఆరుద్ర నక్షత్రంరోజు సంపూర్ణ దర్శనం చేసుకున్నందుకు సంతృప్తిగా ఉందన్నారు. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దేవాలయ అభివృద్ధి జరగలేదన్నారు. ముఖ్యంగా శివరాత్రితో పాటు ఇతర పర్వదినాలలో వస్తున్న భక్తుల రద్దీకి తగ్గట్టు సౌకర్యాలు లేవన్నారు. దేవాలయ అభివృద్ధితో పాటుగా వేములవాడ పట్టణాభివృద్ధికి కూడ ఏకకాలంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రధానంగా దేవాలయానికి చుట్టూ 1,200మీటర్ల మేర మూడు నాలుగు అంతస్థుల భవనాలు కట్టకుండా చర్యలు తీసుకోవాలని అదేశించారు. శివరాత్రినాడు దేవుడి కళ్యాణం కోసం ఒక మినిస్టేడియం అవసరం ఉందన్నారు. దేవాలయాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతోపాటు ట్యాంక్‌బండ్ తరహాలో చుట్టూ రింగ్‌బండ్ ఏర్పాటుచేస్తామన్నారు. దేవాలయ అభివృద్దికి, ఇతర నిర్మాణాలకు దేవుడి గుడి స్థలాన్ని వినియోగిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇదే సమయంలో మరో 25 నుంచి 30 ఎకరాల స్థలం సేకరించి చెరువును నిర్మిస్తామన్నారు. వేములవాడ అంటే వేదమూర్తులవాడ అని అర్థం చెప్పిన కేసీఆర్.. శృంగేరీ పీఠం సహకారంతో సంస్కృత, వేద పాఠశాలలను ఏర్పాటు చేస్తాన్నారు.
వేములవాడ దేవస్థానం ముందు రోడ్డును కొంత వెడల్పు చేస్తే బాగుటుందని.. దేవాలయ, పట్టణాభివృద్దికోరుకునే ప్రతి ఒక్కరు ఈ విషయంలో కలిసి రావాలని విజ్ఞప్తిచేసారు. సిరిసిల్ల-వేములవాడకు నాలుగులైన్ల రహదారి మంజూరు చేశామని, పనులు యుద్ధప్రాతిపదిక చేయాలని అదేశించినట్లు తెలిపారు. ముఖ్యంగా దేవాలయ గర్భగుడి, ప్రధానాలయం అభివృద్ది విషయంలో శృంగేరీ, కంచికామకోటి పీఠాధిపతులతో చర్చించి తీసుకొచ్చి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరిస్తాం అనంతరం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్రంలో 46వేల పైచిలుకు చెరువులను పునరుద్ధరిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది మార్చి నుంచి ఉదయం 6గంటల నుండి 3గంటల వరకు నిరంతర విద్యుత్‌ను అందిస్తామన్నారు.మధ్యమానేరు జలాశయం ముంపు గ్రామాల నిర్వాసితులు తమ సమస్యలను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి పరిష్కరించుకొని తనవద్దకు వస్తే తక్షణమే స్పందిస్తానన్నారు.
అవసరమైతే ప్రత్యేక బడ్జెట్‌ను కూడా కేటాయిస్తామన్నారు. జలాశయంలో ముంపుకు గురవుతున్న ప్రతి ఇంటి యజమానికి రెండు పడక గదుల నిర్మాణానికి ప్రభుత్వం అందించే 5లక్షల4వేల రూపాయల చొప్పున నగదు రూపంలో అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ నిధులను తమ ఇష్టం వచ్చినచోట నిర్మాణానికి ఖర్చు చేసుకునే విధంగా మినహాయింపు ఇస్తామని చెప్పారు. ఇక నియోజకవర్గంలోని 109 గ్రామాల అభివృద్ధి పనుల నిమిత్తం ప్రతి గ్రామపంచాయతీకి 10లక్షల రూపాయల నిధులను అందిస్తామన్నారు. అలాగే నియోజకవర్గంలోని చందుర్తి, కోనరావుపేట, మేడిపల్లి, కథలాపూర్ మండల కేంద్రాల గ్రామపంచాయతీలకు రూ.25లక్షల చొప్పున అభివృద్ధి నిధులను అందజేస్తామన్నారు. అలాగే కొండగట్టు, ధర్మపురి ఆలయాలను కూడా సందర్శించి అభివృద్ధి చేస్తానన్నారు.
తప్పుడు ప్రచారాలకు తెరదించిన సీఎం కేసీఆర్ రాజరాజేశ్వరస్వామి దర్శనంకు వెళితే.. పదవులు పోతాయంటూ సాగుతున్న దుష్ప్రచారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తెరదించారు. నాయకులు దర్శనంచేసుకుంటే పదవులు పోతాయంటూ కొంతమంది సీమాంధ్ర నాయకులు, స్వార్థపరులు రాజన్న ఆలయంపై లేనిపోని ప్రచారాలు చేస్తూ వచ్చారు. ఈ విష ప్రచారాన్ని కేసీఆర్‌కు కూడా అంటగంటేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నాలు చేసాయి. గురువారం ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సతీసమేతంగా రాజన్నను దర్శించుకున్న కేసీఆర్.. ఇన్నాళ్ల్లూ జరుగుతున్న వక్రప్రచారాలకు అడ్డుకట్ట వేశారు.
భారీ బందోబస్తు ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకొని జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం వరకు అణువణువు తనిఖీలు నిర్వహించడంతోపాటు వేములవాడ పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడా భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీ వినోద్‌కుమార్, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ప్రభుత్వ చీఫ్ విఫ్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధు, బొడిగె శోభ, సోమారపు సత్యనారాయణ, విద్యాసాగర్‌రావు, ఒడితెల సతీశ్‌కుమార్‌తో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, జిల్లాకలెక్టర్ నీతూప్రసాద్, డీఐజీ మల్లారెడ్డి, ఎస్పీ జోయల్ డెవిస్, దేవాలయ ఈవో దూస రాజేశ్వర్, జిల్లా అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.