Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

రాజకీయ అవినీతిని అంతంచేస్తా

వైఎస్, చంద్రబాబు అక్రమాలపై విచారణ -బొక్కిన నిధులు కక్కేంత వరకు పోరాటం – ఆంధ్ర ఉద్యోగులు వెళ్లాల్సిందే.. మరో ఆప్షన్ లేదు – మహబూబ్‌నగర్ జయభేరిలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

KCR in Mahabubnagar Meeting 17-04-14 మహబూబ్‌నగర్: వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు పాలనలో తెలంగాణ ప్రాంతం విధ్వంసానికి గురైందని టీఆర్‌ఎస్ అధినేత కే.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆ ఇద్దరు చేసిన అక్రమాలపై విచారణ చేసి, బొక్కిన నిధులు కక్కిస్తా. చంద్రబాబును జైలుకు పంపేవరకు విడిచిపెట్టను. వీరిద్దరి హయాంలోఅక్రమంగా లక్షల కోట్ల రూపాయలు కూడబెట్టారు. వీరి రాజకీయ అవినీతికి అంతులేకుండా పోయింది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రాజకీయ అవినీతిని అంతం చేసి, సమర్థపాలన అందిస్తాం అని చెప్పారు. బుధవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల జయభేరిలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమం మూడు అంశాలపై కొనసాగిందన్న కేసీఆర్.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం 14 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేశామని చెప్పారు. ఉద్యమంలో లాఠీలు, తూటాలు, బాష్పవాయు గోళాలు, జైలుజీవితం, 1200 మంది విద్యార్థుల బలిదానం తర్వాత ఆంక్షలతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.

ఆంధ్రోళ్ల ఒత్తిడికి తలొగ్గిన జైరాం ఆంక్షలు లేని తెలంగాణ కావాలని కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌కు చెప్పినా, సీమాంధ్రుల మాటలకు ఆయన తలొగ్గారని కేసీఆర్ మండిపడ్డారు. సర్పంచ్‌గా కూడా గెలువలేని జైరాం.. ఆంధ్రనాయకుల మాటలు నమ్మి ఆంక్షలతో కూడిన తెలంగాణ ఇచ్చారని, దీన్ని బట్టి చూస్తే ఆయన ప్రజల మనిషి కాదని అర్థమైందని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ సచివాలయంలో 90% ఆంధ్ర ఉద్యోగులు ఉంటే అది ఎలా న్యాయమని ప్రశ్నిస్తే.. దామోదర, పొన్నాల విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వారి రాజకీయ జీవితంలో ఏనాడైనా ఉద్యమంలో పాల్గొన్నారా, లాఠీదెబ్బలు తిన్నారా? అని ప్రశ్నించారు. అలాంటివారికి ప్రజల కోరికలు ఎలా తెలుస్తాయని నిలదీశారు.

ఆంధ్ర ఉద్యోగులు వెళ్లాల్సిందే తెలంగాణ పోలీసు ఉద్యోగాల్లో చిచ్చుపెట్టడానికి 14 ఎఫ్ పెడితే ఆమరణ నిరాహార దీక్ష చేసిన. తెలంగాణ వస్తే ఆంధ్ర ఉద్యోగులందరూ ఆంధ్రకు పోతరనుకున్నం. అందుకోసం పోరాటం జేసినం. ఫలితం రాకపోతే ఇంత పోరాటం చేసింది వృధా అవుతుంది. తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంలో.. ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్ర ప్రభుత్వంలో ఉండాల్సిందే. ఆంధ్ర ఉద్యోగులకు మరో ఆప్షన్ లేదు అని కేసీఆర్ విస్పష్టంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ర్టాన్ని నిజాం పాలించారు. పాలమూరులో కోయిల్‌సాగర్, నిజామాబాద్‌లో నిజాంసాగర్, కరీంనగర్‌లో మరో ప్రాజెక్టు నిర్మించారు. రాజుగా ఉన్నాడు కాబట్టి ఢిల్లీలో హైదరాబాద్ భవనాన్ని నిర్మించారు. ఆ భవనాన్ని సీమాంధ్ర నాయకులు కబ్జా చేసుకున్నారు. ఏపీభవన్ నిజాం ఆస్తి.అది తెలంగాణప్రజలకే చెందాలని మేం పోరాటం జేస్తే తెలంగాణ కాంగ్రెస్ నేతలు నోరుమూసుకున్నారు. ప్రస్తుతం పాక్షిక విజయమే సాధించాం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడితేనే అభివద్ధి సాధ్యమవుతుంది అని కేసీఆర్ వివరించారు.

రాజకీయ అవినీతి అంతంకావాలి తెలంగాణ రాష్ట్రంలో మొదట రాజకీయ అవినీతి అంతం కావాలి. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. చంద్రబాబు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తాకట్టు పెట్టిండు. శాసనసభా సంఘం నిజాలు నిగ్గు తేల్చింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తుంది. చంద్రబాబును జైల్లో పెడతాం. టీడీపీ, బీజేపీ బలవంతంగా ఎందుకు దోస్తాన్ జేసిండ్రు? వారి భయమల్లా ఒకటే. తెలంగాణల ఎవరన్నా అధికారంలోకి రానీ.. టీఆర్‌ఎస్ మాత్రం రాగూడదు. వారు కబ్జా చేసిన ఆస్తులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం గుంజుకుంటదనే భయం. భూదానంజేసిన భూములు గుంజిన్రు. 700ఎకరాల గురుకుల భూములు గుటకాయస్వాహా జేసిండ్రు. వక్ఫ్ భూములు కబ్జా జే సిండ్రు. అధికారంలోకి రాగానే వక్ఫ్‌కు జ్యుడీషియల్ అధికారాలు అప్పజెప్తాం అని కేసీఆర్ అన్నారు.

పాలుగారిన పాలమూరు ఆగమెందుకైంది? కవులు, కళాకారులకు పాలమూరు పుట్టినిల్లని, ఇక్కడి కవులు వలసలపై ఎన్నో కన్నీటి పాటలు రాశారని కేసీఆర్ పేర్కొన్నారు. పాలుగారిన పాలమూరు ఆగమెందుకైంది? అని ప్రశ్నించారు. ఆరోజు ఆర్డీఎస్ తూములను సీమ గూండాలు బద్దలుకొట్టినప్పుడు పాదయాత్ర జేసిన. అప్పుడు కనిపించని నేతలు ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి అంటున్నారు. కచ్చితంగా జిల్లాలోని 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని షాద్‌నగర్‌లో కుర్చీ వేసుకొని కూర్చొని కట్టిస్తా అని కేసీఆర్ ఆవేశంగా చెప్పారు. కృష్ణమ్మ చెంతనే ఉన్నది. అయినా పాలమూరు ప్రజలకు తాగునీరు లేదు. ప్రతి ఇంటికి శుద్ధమైన నీరు అందించి, పాలమూరు పచ్చగా ఉండేందుకు కషి చేస్తా. ప్రథమంగా వలసలు నివారించేందుకు, మన పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలంటే టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలె అన్నారు.

అధికార దాహంతో రఘువీరారెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టు కట్టి తెలంగాణ నీళ్లు సీమాంధ్రకు తీసుకుపోతుంటే పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ జెండా ఊపి, తిలకం దిద్దారు. వీరా తెలంగాణలో ప్రాజెక్టుల గురించి మాట్లాడేది? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పావలా ప్రజలకు, బారాణా జేబులకు అనే అలవాటు ఉన్నది. అట్లాంటి పాలనకు చమరగీతం పాడాలన్నారు. సర్వమత సమ్మేళనం కోసం కృషి చేయాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడితే నా బిడ్డ, నా కొడుకునైనా,బంధువులైనా జైలుకు పంపుతా అని చెప్పారు. జలయజ్ఞం పేరుతో పొన్నాల, వైఎస్ ఎంత దోచుకున్నారు? వారి నిర్వాకంవల్ల ఐఏఎస్‌లు, మంత్రులు జైళ్లలో ఉన్నారు. పొన్నాల, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు అని అన్నారు.

మూడు లక్షలతో పక్కా ఇళ్లు కాంగ్రెస్ నేతలు పక్కా ఇళ్లు కట్టినమని జబ్బలు చర్చుకుంటున్నరు. పది ఇళ్లు కడితే 90 ఇళ్లు మింగిండ్రు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మూడు లక్షలతో 125 గజాల్లో 450 చదరపు మీటర్లలో ఇళ్లు నిర్మించి ఇస్తాం. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు ముష్టిచ్చినట్లు ఇచ్చినయి. వితంతులకు, వద్ధులకు వెయ్యి రూపాయల పింఛన్ అందజేస్తాం. వికలాంగులకు రూ.1500 ఇస్తాం. ముస్లిం, మైనార్టీలు, గిరిజనుల అభివద్ధికి నిరంతరం శ్రమిస్తాం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడాల్సిన ఆవశ్యకత ఉన్నది. పాలమూరు బిడ్డ శ్రీనివాస్‌గౌడ్ ఉద్యమంలో అలుపెరగని పోరాటం జేసిండు. ఉద్యోగం పోతేపోనీ అని పోరాటంలో ముందున్నడు అని ప్రశంసించారు.

చంద్రబాబును సాగనంపాలె చంద్రబాబు మెడలు పట్టి పంపినా పోడంట. ఆయనను ప్రజలు సాగనంపాలె. కొంతమంది తెలంగాణ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు. ఎమ్మెల్యేకు ఇటు, ఎంపీకి అటు ఓటు అంటున్నారు. ఇది తప్పుడు నిర్ణయం. కచ్చితంగా 17 మంది పార్లమెంట్ సభ్యులు టీఆర్‌ఎస్ వాళ్లే గెలవాలె. కేంద్రంలో సంకీర్ణం నడుస్తుంది. అందుకు మన ఎంపీలు ఎంతో అవసరం. తెలంగాణల టీఆర్‌ఎస్‌కు అధికారం పంట పండి ఉన్నట్లున్నది. కోసి కుప్పదెచ్చుకోవాలె. టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రజలకు వాస్తవాలు వివరించాలె. వనపర్తి సభలో ఒక సర్వే రిపోర్ట్ చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ సీట్లు టీఆర్‌ఎస్ గెలుస్తదని చెబుతున్నరు. గెలుస్తమని చెప్పి ఆదమరువొద్దు. ఈ చివరి రోజులు టీఆర్‌ఎస్ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు శక్తివంచన లేకుండా కషి చేసి గెలువాలె అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు జితేందర్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, గుర్నాథ్‌రెడ్డి, ఎల్లారెడ్డి, శివకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.