Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

రాజధానికి అన్ని హంగులు..

ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. మంచినీళ్లు, రోడ్లు, మల్టీలెవల్ ఫ్లైఓవర్లు వంటి మౌలిక సౌకర్యాలతో పాటు నగర శివార్లలో రెండు భారీ జలాశయాలు, భారీ ఎత్తున శాటిటైట్ టౌన్‌షిప్‌లను చేపడుతున్నామని సీఎం చెప్పారు. ప్రధాన రోడ్లను రూ.337కోట్లతో అభివృద్ధి పరచనున్నామని చెప్పారు. శివార్లలోని 12పాత మున్సిపాలిటీల్లో ఇంటింటికి మంచినీరు అందించేందుకు హడ్కో ద్వారా మంజూరైన రూ. 1900కోట్లతో పనులు చేపడుతున్నామని వివరించారు. -రూ.337కోట్లతో ప్రధాన రోడ్ల అభివృద్ధి -మల్టిలెవల్ ైఫ్లె ఓవర్ల నిర్మాణం -శివారు ప్రాంతాల్లో టౌన్‌షిప్‌ల నిర్మాణం -కొత్తగా రెండు భారీ జలాశయాలు -1900 కోట్లతో శివారు ప్రాంతాలకు మంచినీరు -ఖైరతాబాద్‌లో డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకం -రాష్ట్రంలో ఐదు కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి -త్వరలో మళ్లీ స్వచ్ఛ హైదరాబాద్ -తడి-పొడి చెత్త సేకరణ పథకానికి సీఎం శ్రీకారం -1005ఆటో టిప్పర్లు, చెత్త బుట్టల పంపిణీ -తొలగించిన కార్మికులు విధుల్లోకి.. ముఖ్యమంత్రి ఆదేశం

CM KCR flaggs off the GHMC auto trolleys02

మురికివాడల అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల కాలనీ నిర్మించామని, త్వరలో ఖైరతాబాద్‌లో మరో కాలనీ నిర్మించనున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని ఐదు కార్పొరేషన్లను సమగ్రంగా అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నగరంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పథకంలో భాగంగా ఇండ్లనుంచి తడి-పొడి చెత్తను విడివిడిగా సేకరించేందుకు ఉద్దేశించిన బృహత్తర కార్యక్రమానికి సోమవారం పీపుల్స్‌ప్లాజాలో సీఎం శ్రీకారం చుట్టారు. చెత్త సేకరణకోసం 1005మందికి ఆటోటిప్పర్లను, ఇండ్లలో పంపిణీకి ఉద్దేశించిన చెత్తబుట్టలను లాంఛనంగా పంపిణీ చేశారు.

ఒక్క జలాశయం కట్టలేదు… ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ శతాబ్దాల చరిత్రగలిగిన హైదరాబాద్ నగరం ఉమ్మడి రాష్ట్రంలో ఎదుర్కున్న కష్టాలను మననం చేసుకున్నారు. గత ప్రభుత్వాల హయాంలో బాధ కలిగించే అంశాలు అనేకం ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎప్పుడో నిజాం కాలంలో నిర్మించిన గండిపేట, హిమాయత్‌సాగర్ తప్ప చెప్పుకోదగ్గ ఒక్క మంచినీటి రిజర్వాయర్ కూడా సమైక్య పాలకులు నిర్మించలేదని అన్నారు. నగర అవసరాల కోసం కృష్ణా, గోదావరి నదుల నీటిని ఎంతోదూరం నుంచి తరలిస్తున్నామని, ఈ క్రమంలో మధ్యలో ఏదైనా సమస్య తలెత్తితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో రెండు భారీ జలాశయాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. నగర విస్తరణ అడ్డదిడ్డంగా జరిగిందని రహదారులు, డ్రైనేజీలు కుంచించుకుపోయి చిన్న వర్షానికే నీరు చేరుతున్నదని అన్నారు. ఇవాళ సమగ్ర డ్రైనేజీ వ్యవస్థను చేపట్టేందుకు రూ. 10వేల కోట్లు కావాలన్నారు.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ.. నగరాన్ని బాగు చేసుకోవలనే లక్ష్యంతో.. తపనతో పార్టీలకు అతీతంగా అందరితో సమావేశాన్ని నిర్వహించి ఒక కమిటీని ఏర్పాటుచేశామని చెప్పారు. ఈ కమిటీ ఢిల్లీ, నాగపూర్ నగరాల్లో అధ్యయనం నిర్వహించిందని, అక్కడ అమలు చేస్తున్న మెరుగైన అంశాలను గుర్తించి వాటని మన నగరంలోనూ అమలు జరపాలని సూచించిందని చెప్పారు. వారి సూచనల మేరకు పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు 2500ఆటో టిప్పర్లను, అవి వెళ్లలేని చిన్న గల్లీలకు ట్రైసైకిళ్లను ఉపయోగించాలని నిశ్చయించామన్నారు. ఇంటికి రెండు చొప్పున 22లక్షల కుటుంబాలకు చెత్త బుట్టలను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. 20-25రోజుల్లో మిగిలినవని కూడా పంపిణీ చేసి ఈనెల చివరికల్లా ఇండ్ల నుంచి చెత్త విడివిడిగా సేకరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఆటో టిప్పర్లు తీసుకున్న లబ్ధిదారులు చెత్త సేకరించే ఇంటింటికీ వెళ్లి వారితో పరిచయం చేసుకోవడంతోపాటు తడి, పొడి చెత్త విడివిడిగా బుట్టల్లో వేయడంపై వారికి అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఆకుపచ్చ రంగు బుట్టను తడి చెత్తకు, నీలిరంగు బుట్ట పొడి చెత్తకు వాడాలని సీఎం సూచించారు. ప్రపంచవ్యాప్తంగా చెత్త బుట్టలకు ఇవే రంగులు వాడుతున్నందున తాము కూడా వీటిని ఎంపికచేశామన్నారు. లక్ష కిలోమీటర్ల నడక కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని,చిత్తశుద్ధితో ముందుకు సాగితే విజయం తథ్యమని చెప్పారు. చెత్తతోపాటు డెబ్రిస్ కూడా తొలగించేందుకు ఢిల్లీ తరహాలో రీసైక్లింగ్ విధానాన్ని చేపడుతామన్నారు. ఈ దిశగా త్వరలోనే టెండర్ ఫైనల్ అవుతుందని, ఆ తర్వాత రోడ్లపై ఎక్కడా డెబ్రిస్ ఆనవాళ్లు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

లక్షమందికి క్రమబద్ధీకరణ సర్టిఫికెట్లు…. జీఓ- 58, 59 ద్వారా గుడిసెల్లో నివసిస్తున్న దాదాపు లక్షమంది నిరుపేదలకు పూర్తి ఉచితంగా స్థలాల క్రమబద్ధీకరణ సర్టిఫికెట్లు అందజేశామని సీఎం తెలిపారు. మరోవైపు అనుమతులు లేకుండా నిర్మించుకున్న ఇండ్లు , డీవియేషన్లతో కూడిన ఇండ్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం కూడా కల్పించామన్నారు. పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పథకం కింద ఐడీహెచ్ కాలనీలో ఇప్పటికే ఇండ్లు సిద్ధమయ్యాయని, ఖైరతాబాద్‌లో త్వరలో నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పారు. పేద ప్రజలు మంత్రులను కలిసి ఇండ్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మంచినీటి కొరత లేకుండా.. మంచినీటి కొరతను తీర్చేందుకు నగరానికి ఈశాన్యం, ఆగ్నేయం వైపు రెండు భారీ జలాశయాలు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. నల్లగొండవైపు రామోజీ ఫిలింసిటీ వద్ద 20టీఎంసీలు, శామీర్‌పేట్ వైపు 15టీఎంసీల సామర్థ్యంతో వీటిని నిర్మిస్తామన్నారు. త్వరలోనే వీటి పనులకు శ్రీకారం చుడతామన్నారు. నగరశివార్లలోని 12పాత మున్సిపాలిటీల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ కోసం హడ్కో ద్వారా రూ. 1900కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. ఈ ప్రాజక్టు పూర్తైతే మంచినీటికి ఇబ్బందులు తొలగిపోతాయన్నారు.

మరోసారి స్వచ్ఛ హైదరాబాద్.. నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడంతోపాటు సమస్యల పరిష్కారానికి గతంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం అమలు చేశామని, తనతోపాటు గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పోలీస్ కమిషనర్ తదితర ఉన్నతాధికారులు కూడా భాగస్వాములయ్యారని సీఎం గుర్తుచేశారు. ఈ కార్యక్రమం కింద మొదటిదశకు రూ. 200కోట్లు విడుదలచేయగా, పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రాబోయే 10-15రోజుల్లో చెత్తబుట్టలు ఇంటిటికీ చేరిన తర్వాత మరోసారి 4-5రోజులు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడతామని ముఖ్యమంత్రి చెప్పారు.

912కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి.. నగరంలో 912కిలోమీటర్ల పొడవున ప్రధాన రోడ్లను రూ. 337కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని వచ్చే నెలరోజుల్లో పనులు పూర్తై రోడ్లు అద్దాల్లా తయారవుతాయని ధీమా వ్యక్తంచేశారు. నగరమంతా ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంచినీరు, డ్రైనేజీ కలువకుండా ఉండేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

మల్టీలెవల్ ఫ్లైఓవర్లకు సిద్ధం రియల్ స్మార్ట్ సిటీ, రియల్ గ్లోబల్ సిటీ కావాలంటే ఎలకతోకలాంటి ఫ్లైఓవర్లు సరిపోవని, వీటితో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. నగరంలో ఉన్న ట్రాఫిక్ రద్దీకి చైనాలో మాదిరిగా మల్టి లెవల్ ై ఫ్లైఓవర్లు అవసరమని అన్నారు. నగరంలో అలాంటి మల్టీలెవల్ ఫ్లైఓవర్లు నిర్మించేందుకు నిధులకోసం ఇప్పటికే బ్రిక్స్ బ్యాంక్ ఛైర్మన్‌తో చర్చించామని తెలిపారు.

కార్పొరేషన్లు, శివారు ప్రాంతాల అభివృద్ధికి చర్యలు.. హైదరాబాద్ శివార్లలోని సంగారెడ్డి, షాద్‌నగర్, చౌటుప్పల్, భువనగిరి, ఘట్‌కేసర్, తూప్రాన్, శామీర్‌పేట్, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో శాటిలైట్ టౌన్‌షిప్‌లు నిర్మించనున్నట్లు చెప్పారు. ఔటర్ రింగురోడ్డు చుట్టూ మెట్రో రైలు ప్రాజక్టు చేపట్టేందుకు అవకాశం ఉన్నందున దశలవారీగా మెట్రో ప్రాజక్టును చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వీటన్నింటికీ దాదాపు రూ. 25వేల కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌తోపాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

తొలగించిన కార్మికులు విధుల్లోకి.. గతంలో తొలగించిన బల్దియా కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గతంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా తానే సఫాయి కర్మచారీల వేతనాలు పెంచనున్నట్లు ప్రకటించానని, అయినా కొందరు కార్మికులను కవ్వించి సమ్మెకు దింపారన్నారు. సమ్మె కారణంగా రంజాన్, బోనాలు వంటి పండుగలకు తీవ్ర అసౌకర్యం కలిగినందున కొంత కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని చెప్పారు. అంతే తప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తమకు లేదని అన్నారు.

అప్పుడు తొలగించిన కార్మికులను అండర్ టేకింగ్ తీసుకొని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను సీఎం ఆదేశించారు. కార్మికులు ఏదైనా కష్టనష్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి, మంత్రులకు చెప్పి పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, అంతా కలిసి పనిచేసి నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.