Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

రైతు కోసమే మిషన్

వ్యవసాయరంగానికే తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. అందుకోసమే మిషన్ కాకతీయను చేపట్టినట్లు తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు బాగుంటాయన్నారు. సాంకేతిక ప్రగతి ఫలితాలు వ్యవసాయంతో అనుసంధానం కాకపోవడంతో ఆశించిన స్థాయిలో వ్యవసాయం ఎదగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన స్టేట్ క్రెడిట్ సెమినార్ 2015-16కు ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో దక్కన్ గ్రామీణ బ్యాంకు పేరును తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్చుతూ, అందుకు సంబంధించిన లోగో విడుదలైంది.

-నాబార్డ్ రుణ పరిమాణం రూ.48,000కోట్లు -గత ఏడాది ప్రణాళికకంటే 19 శాతం ఎక్కువ.. -నాబార్డ్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఆర్థిక మంత్రి -నీటి అవసరం గుర్తించే మిషన్ కాకతీయ -స్టేట్ క్రెడిట్ సెమినార్‌లో ఆర్థిక మంత్రి ఈటల -తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా దక్కన్ గ్రామీణ బ్యాంక్ -మిషన్ కాకతీయతో 46 వేల చెరువుల పునరుద్ధరణ -రైతులకు అందుబాటులో 265 టీఎంసీలు:హరీశ్ -రూ.1000 కోట్లు కేటాయించాలని నాబార్డ్‌కు విజ్ఞప్తి

TGB-13-12-14

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ రాబోయే ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్రానికి జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) ప్రకటించిన రూ.48,176 కోట్ల రుణ పరిమాణంపై సంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో ప్లాన్ బడ్జెట్‌కు సమాన స్థాయిలో ప్రకటించిన రుణ పరిమాణం తమకు కొండంత బలాన్ని ఇస్తుందన్నారు. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అవసరాలను గుర్తించి, రుణపరిమాణాన్ని ప్రకటించినందుకు నాబార్డ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని తమ సర్కారు నమ్ముతుందని ఆయన అన్నారు.

అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తమ రాష్ట్ర ప్రభుత్వ మొదటి ప్రాధాన్యం వ్యవసాయమేనని బాధ్యతలు స్వీకరించినపుడు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. వ్యవసాయం, దానిపై ఆధారపడినవారి గూడు చెదిరిపోవద్దన్నదే తమ ప్రభుత్వ అభిమతమన్నారు. ఆశించిన స్థాయిలో వ్యవసాయరంగం ఎదగడంలేదని, సాంకేతిక ఫలితాలు వ్యవసాయంతో పూర్తిస్థాయిలో అనుసంధానం కాకపోవడం ఇందుకు కారణం కావచ్చునని అన్నారు.

ఇంత సాంకేతికత అందుబాటులో ఉన్నా ఆత్మహత్యలు జరుగడం అందర్నీ బాధిస్తున్నదని చెప్పారు. వ్యవసాయం లాభసాటిగా ఉంటే దానిపై ఆధారపడ్డ వారితోపాటు మిగతా రంగాలు బాగుంటాయని అన్నారు. గ్రామస్థాయిలో రైతులు, ప్రజల అవసరాలను గుర్తించి, రుణ ప్రణాళికలు రూపొందించాలని కోరారు. వ్యవసాయరంగం బాగుండేందుకు నీరుఅత్యంత ముఖ్యమైనదన్న ఈటల.. అందుకే తమ సర్కారు మిషన్ కాకతీయను చేపట్టిందన్నారు. గోదాముల నిర్మాణం, చేపలు, పాడి పశువుల పెంపకం, గ్రీన్‌హౌస్‌లలో కూరగాయలసాగు వంటివి తమ ప్రాధాన్యానికి నిదర్శనమన్నారు.

గ్రీన్‌హౌస్‌కు రూ.200 కోట్లు కేటాయించడం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధిని చాటుతున్నాయని చెప్పారు. మొక్కుబడిగా రుణాలు ఇవ్వడం కాకుండా రైతులను బాగుపర్చేందుకు ఎలాంటి విధానాలు అవసరమో నిర్ణయించుకోవాలన్నారు. తద్వారా ప్రైవేటు వ్యాపారులను రైతులు ఆశ్రయించే పరిస్థితి ఉండబోదని చెప్పారు. వివిధ వ్యవసాయ అనుబంధ అవసరాలను గుర్తించాలని మంత్రి నాబార్డ్‌ను కోరారు. రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఉమ్మడిరాష్ట్రం నాటి అవసరాలు, కొత్త రాష్ట్రం ప్రాధాన్యలను గుర్తించి, రుణ ప్రణాళిక రూపొందించడంలో నాబార్డ్ విజయవంతం అయిందన్నారు.

మిషన్ కాకతీయద్వారా 46,000 చెరువులను పునరుద్ధరించాలని చూస్తున్నట్లు, తద్వారా 265 టీఎంసీల నీటిని రైతులకు అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ఇంతటి ప్రాధన్యమున్న ప్రాజెక్టుకు రుణ ప్రణాళికలో భాగంగా రూ.1000 కోట్లు కేటాయించాలని కోరారు. మొత్తం చెరువుల్లో వచ్చే మేలోగా 9000 చెరువులు జలకళను సంతరించుకోనున్నాయని చెప్పారు. రైతులకు అప్పు ఇచ్చినప్పటికీ వ్యవసాయానికి నీరు అందుబాటులో లేకుంటే కష్టమని, అందుకే నీటి సౌలభ్యం, మార్కెటింగ్ సదుపాయం మెరుగుపర్చుకునేందుకు సైతం సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఆరు జిల్లాల్లో పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోడౌన్ల నిర్మాణం అవసరమని గుర్తించినట్లు హరీశ్ తెలిపారు. 2.16 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లను రాజకీయ అవసరాలను కాకుండా వ్యవసాయ అవసరాల కోణంలో నిర్మించనున్నట్లు స్పష్టంచేశారు. రైతుబంధు పథకాన్ని బలోపేతం చేసినట్లు తెలిపారు. పంటలకోసం రైతులు బీమా చేస్తున్నప్పటికీ అది నిరుపయోగంగా మారుతున్నదని మంత్రి అన్నారు. పెట్టుబడుల అవసరాలను లెక్కలోకి తీసుకొని పంటలవారీగా రుణ సదుపాయాన్ని కల్పించాలని కోరారు. హైదరాబాద్‌కు అవసరమైన కూరగాయల్లో ముప్పావు శాతం ఇతర రాష్త్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు.

ఇక్కడ సాగును పెంచడంతోపాటు కోల్డ్ స్టోరేజీ సదుపాయం కల్పిస్తే రైతులకు వ్యవసాయం గిట్టుబాటుగా మారుతుందన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయాలని, వ్యవసాయ అనుబంధ రంగాలు కరువును తట్టుకునేలా రుణ పరిమాణాలుండాలని సూచించారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ పత్రాలు అందజేశామని, త్వరలోనే మిగిలిన రైతులకూ అందిస్తామని తెలిపారు. ఈ మాఫీ పత్రాలను పరిగణనలోకి తీసుకుని బ్యాంకులు రుణాల విషయంలో ఉదారంగా వ్యవహరించాలని కోరారు.

నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ జిజీ మమెన్ మాట్లాడుతూ.. వ్యవసాయంలో సుస్థిర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సేవారంగాలలో మూలధనాన్ని సమకూర్చే దృష్టిసారించి, రుణ పరిమాణం సిద్ధం చేసినట్లు తెలిపారు. కొత్త రాష్ట్రం అవసరాలు, ప్రాధమ్యాలపై శ్రద్ధ పెట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, మార్కెటింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, ఎస్‌బీహెచ్ బ్యాంకు ఎండీ శంతను ముఖర్జీ, ఆయా బ్యాంకుల సీనియర్ కార్యనిర్వహణ అధికారులు పాల్గొన్నారు.

నాబార్డు రుణ పరిమాణం రూ.48,000కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16)కు రూ.48,176 కోట్లతో జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు(నాబార్డ్) రుణ పరిమాణం ప్రకటించింది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటించిన రుణ పరిమాణం కంటే 19% ఎక్కువ కావడం గమనార్హం. పంట రుణాలు (స్వల్ప కాల పెట్టుబడి)కి రూ.25,780 కోట్లు, వ్యవసాయ నిర్దేశిత కాల రుణాలకు రూ.9,400 కోట్లు, సూక్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు(ఎంఎస్‌ఎంఈ) రంగానికి రూ.5,554కోట్లు, ఇతర రుణాలకు రూ.7,441 కోట్లు కేటాయించింది.

2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో చిన్న నీటి పారుదల, పశుపోషణ, పాల ఉత్పత్తి, కోళ్ల పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, ఉద్యానవనాలు, పండ్లు, కూరగాయల తోటల పెంపకం, పూల చెట్ల పెంపకం, గ్రీన్ హౌస్‌లు, మార్కెటింగ్ సదుపాయం, గిడ్డంగుల నిర్మాణం-నిర్వహణ ఈ కేటాయింపుల పరిధిలోకి వస్తాయి. పశుపోషణకు రూ.1617 కోట్లు, వ్యవసాయ క్షేత్రాల యాంత్రీకరణకు రూ.1338 కోట్లు, మొక్కలు, ఉద్యానవనాలకు రూ.710 కోట్లు, జలవనరులకు రూ.678 కోట్లు కేటాయించారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు రూ.45.32 కోట్లు ప్రతిపాదించారు.

దీంతోపాటు రాష్ట్ర ప్రాంతీయ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి(ఆర్‌ఐడీఎఫ్) మూల నిధి ద్వారా రూ.7106.01 కోట్లు, మంజూర్లు-వితరణల ద్వారా రూ.5397.15 కోట్లు ప్రయోజనం పొందనుంది. కౌలు రైతులు, సన్న, చిన్నకారు రైతులకు ఎలాంటి అవరోధాలు లేకుండా రుణం అందేలా మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. మార్కెట్ శక్తులతో పోటీ పడేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని నాబార్డ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఉత్పత్తిదారుల సంస్థ)గా పేర్కొంటున్నారు. రాష్ట్రంలో వంద ఉత్పత్తి దారుల సంస్థలను ఏర్పాటుచేయాలని నాబార్డ్ యోచనలో ఉంది.

ఇక తెలంగాణ గ్రామీణ బ్యాంకు రాష్ట్రంలోని దక్కన్ గ్రామీణ బ్యాంకు పేరు మారింది. ఇక దీనిని తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా వ్యవహరిస్తారు. శుక్రవారం క్రెడిట్ సెమినార్ సందర్భంగా బ్యాంకు లోగోను రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, టీ హరీశ్‌రావు ఆవిష్కరించారు. బ్యాంకు పేరు మార్పునకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 20న ఆమోదం తెలిపింది. ఐదు జిల్లాల్లో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు 300 బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వ వాటా 50%, తెలంగాణ ప్రభుత్వ వాటా 15%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వాటా 35%గా ఉంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.