Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

రైతన్నకు రక్షణ కవచం

-నూతన రెవెన్యూ చట్టంతో సాగుపై రైతు దృష్టి
-మారబోతున్న తెలంగాణ రైతాంగ ముఖచిత్రం
-అన్ని రాష్ర్టాల్లో అమలుచేస్తే జీడీపీలో మార్పు
-రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి

‘భూమి అంటే రైతుకు ప్రాణం కంటే ఎక్కువ. తరతరాలుగా వచ్చిన చట్టాలన్నీ అలాంటి భూమి నుంచి కేవలం శిస్తు వసూలుకోసమే నిర్దేశించాయి. కానీ రైతు కేంద్రంగా ఒక్క చట్టం కూడా రాలేదు. అందుకే ఇప్పుడు వచ్చిన నూతన రెవెన్యూ చట్టం చారిత్రాత్మకమైనది, విప్లవాత్మకమైనది కూడా’ అని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఘంటాపథంగా చెప్తున్నారు. ఇప్పటివరకు అనుక్షణం తన భూమిని కాపాడుకోవడానికే సమయాన్ని ఉపయోగించిన రైతు.. తాజా చట్టంతో నిశ్చింతగా పంటల సాగుపై దృష్టి పెడుతాడని అన్నారు. ఈ చట్టాన్ని మిగతా రాష్ర్టాల్లోనూ అమలుచేస్తే దేశ జీడీపీలో కూడా స్పష్టమైన మార్పు వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారని తెలిపారు. చట్టంతో తెలంగాణ రైతాంగ ముఖచిత్రమే మారబోతున్నదని చెప్పా రు. నూతన రెవెన్యూ చట్టం అమల్లోకి వస్తున్న సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఇవీ వివరాలు..

మొన్నటివరకు రైతు పరిస్థితి ఎలా ఉన్నది?
మొన్నటిదాకా రైతు దయనీయంగా భూమి కోసం పోరాడుతూ కనిపించేవాడు. గతంలో రైతుకు తెలియకుండానే పహాణీల్లో మార్పులు జరిగేవి. ఎకరం ఉంటే అర ఎకరమే రైతు పేరిట ఉండేది. వేరేవారికి రెండు ఎకరాలుంటే అందు లో ఈ అరఎకరం చేరేది. కాస్తులో భూమికి, రికార్డుల్లో ఉన్నదానికి పొంతనలేదు. వివాదాలు, ఘర్షణలకు దారితీసేవి. ఇష్టారాజ్యంగా భూరికార్డులను రాయడం వల్ల కోర్టునుంచి ఇన్‌జంక్షన్‌ ఆర్డర్లతో న్యాయ వివాదాలు తలెత్తి రైతు జీవితం ఉన్న భూమిని రక్షించుకోవడంతోనే సరిపోయేది. పంటల సాగుపై దృష్టి పెట్టే అవకాశం రాలేదు.

భూమి కేంద్రీకరణా వికేంద్రీకరణా?
భూమి కేంద్రీకరణ అనేది తప్పు. గతంలో భూస్వాములు, బడా పెత్తందారుల చేతుల్లో ఒక్కొక్కరి వద్ద వేల ఎకరాలుండేవి. ఇప్పుడు స్పష్టమైన మార్పు వచ్చింది. భూస్వాములు, జమీందార్లు లేరు. రైతులే ఉన్నారు. అందుకే ఈ చట్టం రైతు కేంద్రంగా తెచ్చారు. రాష్ట్రంలో తాజా పరిస్థితిని పరిశీలిస్తే.. 39.52 లక్షల మంది రైతుల వద్ద 47.43 లక్షల ఎకరాల భూమి ఉన్నది. వీరంతా 2.20 ఎకరాల్లోపువారే. మొత్తం పట్టాదారుల్లో వీరు 64.84%. ఐదెకరాల్లోపు ఉన్న సన్న, చిన్నకారు రైతులను గమనిస్తే.. 1.04 కోట్ల ఎకరాల భూమి 55 లక్షలమంది చేతుల్లో ఉన్నది. మొత్తం పట్టాదారుల్లో వీరు 90.75%. 10 ఎకరాల్లోపు ఉన్న రైతులు 98.38% ఉన్నారు. 25 ఎకరాలకుపైగా భూములున్న రైతులు 6,679 మంది మాత్రమే. మొత్తం పట్టాదారుల్లో వీరు 0.11%. ఇక భూమి కేంద్రీకరణకు ఆస్కారం ఎక్కడ? భూమి వికేంద్రీకరణ జరిగింది.

కొత్త చట్టం వల్ల రైతులకు జరిగే లాభాలు?
ఇటీవలే భూరికార్డుల ప్రక్షాళన జరిగింది. ఇందులో దాదాపు 96% ప్రక్షాళనచేసి 1.5 కోట్ల ఎకరాలకు పాస్‌పుస్తకాలిచ్చారు. దీంతో రైతులకు ఒక ఆధారం దొరికింది. ఇది మొదటి రక్షణ. కొత్త చట్టంతో మ్యుటేషన్లు, రిజిస్ట్రేషన్లలో పెను మార్పులు తీసుకొచ్చారు. వీఆర్వో వ్యవస్థను రద్దుచేశారు. దీంతో తన భూమిని ఎవరూ ఏమీ చేయలేరనే ధైర్యం, ఎవరూ రికార్డుల్లో మార్పులు, చేర్పులు చేయలేరనే ధీమా రైతుల్లో వ్యక్తమవుతున్నది. తమకు 100% రక్షణ వచ్చిందని రైతులు భావిస్తున్నారు. గతంలో భూస్వాములు, జమీందార్లు ఉన్నప్పుడు భూమిని రైతులు సాగుచేసేవారు. అప్పుడు కౌలుదారు చట్టం వచ్చింది. దీనివల్ల రైతులకు కొంత మేలు జరిగింది. కాలక్రమేణా జమీందార్లు, భూస్వాములు పోయి చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. కౌలుదారు చట్టం వల్ల ప్రయోజనం కన్నా సామాన్య రైతులకు నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఆ చట్టం దుర్వినియోగమైంది. అందుకే ఆ కష్టాన్ని, ఇబ్బందులను, న్యాయ వివాదాలను తొలిగించేలా కొత్త చట్టం తీసుకొచ్చారు. కౌలుదారుల నుంచికూడా రైతుకు రక్షణ కలిగింది. రైతుకు సంపూర్ణ రక్షణ కవచం లభించినట్టయింది.

భూమికి, రైతుకు మధ్య అనుబంధం?
తరతరాలుగా భూమికి, రైతుకు మధ్య ఎంతో అనుబంధం పెనవేసుకుని ఉన్నది. అందుకే భూమి కోసం అనేక పోరాటాలు జరిగాయి. రైతు తన ప్రాణం కంటే ఎక్కువగా భూమిని చూసుకుంటాడు. గతంలో ఉన్న చట్టాలు, అందులోని లోపాల వల్ల రైతు పంటల కోసం కాకుండా భూమిని రక్షించుకోవడానికి, దక్కించుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రాజెక్టులు, చెరువులు, కాలువలతో కావాల్సినంత సాగునీరు అందుతున్నది. ప్రభు త్వం నుంచి పెట్టుబడి సాయం అందుతున్నది. కొత్త చట్టంతో భూములకు రక్షణ దొరికింది.

కొత్త చట్టంతో ఎలాంటి మార్పులు వస్తాయి?
నిపుణులు పేర్కొంటున్నట్టుగా ఈ చట్టాన్ని అన్ని రాష్ర్టాల్లో అమలుచేస్తే.. దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో 1.3% నుంచి 2% అభివృద్ధి ఉంటుందని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇప్పటివరకు భూమిని రక్షించుకునేందుకు రైతు తన శక్తియుక్తులను, కాలాన్ని వెచ్చించాడు. ఇప్పుడు ఆ సంపూర్ణ రక్షణ ప్రభుత్వం కల్పించడంతో ఇక పంటల సాగు, ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరిస్తాడు. ఉత్పత్తి పెరుగుతుంది. అదికాస్తా జీడీపీలోనూ కనపడుతుందని నిపుణులు చెప్తున్నారు. ధరణిలో భూరికార్డులు ఉండటం వల్ల.. వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది. 48 గంటల్లోనే రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధును అందించడం దీ నికి ఉదాహరణ. వివాదాలు, ఘర్షణలు, కేసులు తగ్గుతాయి. పంటల ఉత్పత్తి పెరిగి.. అది రైతుతోపాటు దేశాభివృద్ధికి దోహదపడుతుంది

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.