-పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను సమాయత్తం చేయనున్న సీఎం – త్వరలో ప్రత్యేకంగా అవగాహన సమావేశం – ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాలపై స్పష్టత – వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం – మీడియాకూ వివరించే యోచనలో కేసీఆర్!

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలులో విపక్షాలు చేస్తున్న అనవసర రాద్ధాంతాలకు దీటుగా సమాధానం ఇచ్చేలా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. ఇందుకోసం వారితో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు.
ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుపై విపక్షాలు లేవనెత్తుతున్న వివాదాన్ని పటాపంచలు చేసేలా, ప్రజలకు వాస్తవాలపై అవగాహన కలిగించేలా తమ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను తీర్చిదిద్దాలని సీఎం భావిస్తున్నారు. ప్రత్యేకించి త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో సీఎం నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవే విషయాలను మీడియాకు కూడా వివరించాలన్న యోచనలో సీఎం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకుల వివక్ష, నిర్లక్ష్యం కారణంగా తగిన ప్రాజెక్టులు లేక తెలంగాణ భూములు బీడువారాయి. దీన్ని సరిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం గోదావరి, కృష్ణా నదులపై ఎక్కడ ఎంత నీటి లభ్యత ఉంది? ఎక్కడ ప్రాజెక్టులు కడితే ఉపయోగం? ఏ ప్రాజెక్టులను రీడిజైన్ చేయాలి? అనే అంశాలపై దృష్టిసారించింది. ఈ విషయాలన్నింటినీ సమగ్రంగా ఎంపీలు, ఎమ్మెల్యేలకు వివరించాలని సీఎం భావిస్తున్నారని తెలిసింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నా.. వాటిపైనా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని భావించిన సీఎం.. ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు సంక్షేమరంగంలో ప్రభుత్వం చేస్తున్న కృషి, సాధించిన విజయాలపై ఎమ్మెల్యేలు, ఎంపీలకు అవగాహన కల్పించడం ద్వారా వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారని సమాచారం.
తెలంగాణ చరిత్రలో నిలిచిపోయిన సమగ్ర ఇంటింటి సర్వే, పాలనలో మైలురాళ్లుగా భావించే జలహారం, డబుల బెడ్‌రూమ్ ఇండ్ల పథకంతోపాటు ఇప్పటికే అమలవుతూ ప్రశంసలు పొందుతున్న హాస్టళ్లకు సన్న బియ్యం సరఫరా, పింఛన్లు, పేదలకు రేషన్ కోటా పెంపుదల, పేదింటి ఆడ పిల్లలకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, హరితహారం, తాజాగా చేపట్టిన గ్రామజ్యోతి తదితర పథకాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు సీఎం సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఉద్యమ నినాదాల్లో ఒకటైన నియామకాల విషయంలో నిరుద్యోగులు, విద్యార్థుల ఆశలు తీర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతున్నదనే విషయంలో కూడా వాస్తవాలను ప్రజలకు తెలియజేసేలా పార్టీ నేతలను సమాయత్తం చేయాలని సీఎం భావిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వెంటనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయడం మొదలుకుని.. ఉద్యోగుల విభజన పూర్తికాకపోవడంతో ఎదురవుతున్న సమస్యలను అధిగమించి కనీసం కొన్ని ఉద్యోగాలనైనా భర్తీ చేయాలని నిర్ణయించడం.. ఇందులో భాగంగానే ఈ ఏడాది 25 వేల పోస్టులు భర్తీ చేస్తామని సీఎం స్వయంగా చేసిన ప్రకటన.. అందుకు అనుగుణంగా వెలువడుతున్న నోటిఫికేషన్లు.. తదితర అంశాలను సీఎం ప్రస్తావిస్తారని తెలిసింది.