Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

రాచకొండలో సినిమా సిటీ!

-నేడు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే -ఒకే చోట 2వేల ఎకరాల కోసం అన్వేషణ -మారనున్న రాచకొండ ముఖచిత్రం

KCR

రాచకొండ గుట్టలు, పరిసర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఉదయం ఏరియల్ సర్వే చేయనున్నారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల మధ్యనున్న ఈ ప్రాంతంలో రెండువేల ఎకరాల విస్తీర్ణంలో భారీ సినిమాసిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏరియల్ సర్వే జరుగనున్నది. ఈ సర్వేలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, పీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనా, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు చిరంజీవులు, శ్రీధర్ కూడా పాల్గొంటున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం బృందం హెలికాప్టర్‌లో బయలుదేరుతుంది.

సీఎం పర్యటనకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగానికి పెద్ద పీట వేస్తుందని గతంలోనే సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధిలో భాగంగా హాలీవుడ్ స్థాయిలో, గ్లోబల్ టెక్నాలజీతో సినిమాసిటీ నిర్మిస్తామని ప్రకటించారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించే స్థాయిలో రెండువేల ఎకరాల్లో ఈ సినిమాసిటీ ఉంటుందని చెప్పారు. ఈ మేరకు నగరానికి దగ్గరలో స్థల పరిశీలన చేయాలని సీఎం అధికారులను పురమాయించారు. వివిధ ప్రాంతాలు పరిశీలించిన అధికారులు రాచకొండ గుట్టలను ఎంపిక చేశారు. హైదరాబాద్‌కు కేవలం 30 నుంచి 40 కిలో మీటర్ల దూరంలోనే ఈ ప్రదేశం ఉన్నందున సినిమా నిర్మాణాలకు ఎంతో అనువుగా ఉంటుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.

ఈ సిటీ నిర్మాణం వల్ల పెద్దగా పరిశ్రమలు లేని ఈ ప్రాంతానికి ఆ లోటు తీరడంతోపాటు పర్యాటక ప్రాంతంగానూ తీర్చిదిద్దేందుకు అవకాశాలు ఉన్నాయని సూచించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సీఎం స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. ఇటీవల ఫార్మా సిటీ కోసం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో కూడా ఏరియల్ సర్వే చేసి ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఈ క్రమంలో రాచకొండ గుట్టల్లో సినిమా సిటీ కూడా ఖాయమవుతుందని స్థానికులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వేపై స్థానికులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.

ఘనమైన చరిత్ర.. ఆకట్టుకునే ప్రకృతి ఒకనాడు తెలంగాణను ఏకచ్ఛత్రంగా ఏలిన ఘనకీర్తి సొంతం చేసుకున్న రాచకొండకు పూర్వవైభవం రానుంది. రాచరికపు యుగాన్ని గుర్తు చేసే కోట, సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు రాచకొండ ఆలవాలం. వందల కొద్దీ అడుగుల ఎత్తయిన కొండలు, పచ్చని అడవితో పాటు వన్యప్రాణులు, వివిధ రకాల వృక్షజాలాలకు రాచకొండ పెట్టింది పేరు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరిచేందుకు పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోద ముద్ర పడింది. దానికితోడు సోలార్ విద్యుదుత్పత్తికి చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్రం ప్రభుత్వం ప్రతిపాదించింది. తాజాగా ఈ ప్రాంతంలో సినిమా సిటీ నిర్మించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జరిపే ఏరియల్ సర్వే ఈ ప్రాంత భవిష్యత్తును మార్చే అవకాశాలున్నాయి.

ఘనమైన చారిత్రక నేపథ్యం -32 వేల ఎకరాల మేర అడవులు, గుట్టలు -ఇప్పటికే పలు సినిమా షూటింగులు -అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న స్థానికులు -ఫిలింసిటీ వస్తే జాతకం మారుతుందని విశ్వాసం రాచకొండను రాజధానిగా చేసుకుని రేచర్ల పద్మనాయకులు తెలంగాణను పాలించారు. అనపోతన వంటి గొప్ప రాజులెందరో ఈ ప్రాంతంనుంచి పాలన సాగించారు. ఆ కాలంలోనే ఇక్కడ అత్యంత పటిష్టంగా భారీ ప్రాకారాలు, అద్భుతమైన కోటలు, శత్రు దుర్భేధ్యమైన ప్రహరీలు నిర్మించారు. నేటికీ ఈ గుట్టల పై వాటి ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి.

ఈ కొండల్లోని శివాలయం, రామాలయం, బైరన్నగుడి, వీరన్నగుడి, దూతనీ గుడి, బోగందాని మంచం, కుమ్మరి మట్టం, చాకలి మట్టం సొరంగ మార్గాలు ఇప్పటికే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రాచకొండల అభివృద్ధి గత ప్రభుత్వాలకు పట్టలేదు. ఇక్కడ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు విఫలయత్నం చేశాయి. స్వరాష్ట్రంలో కొలువుదీరిన ప్రభుత్వం ఈ కొండల అభివృద్ధికి నడుం కట్టింది.

32 వేల ఎకరాల విస్తీర్ణం.. రాజధాని హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలోనే పరుచుకున్న ఈ అడవులు, కొండలు ఎక్కువ భాగం నల్లగొండ జిల్లాలో, కొంత భాగం రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లోనూ విస్తరించి ఉన్నాయి. రాచకొండ అడవుల విస్తీర్ణం సుమారు 32 వేల ఎకరాలు. ఎక్కువ భాగం రాచకొండ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉంది. సంస్థాన్ నారాయణపురం మండలంలోని రాచకొండ పరిధిలో నాలుగు తండాలు,14765 ఎకరాల భూములున్నాయి. వీటిల్లో 9418 ఎకరాల్లో మొత్తం గుట్టలే పరుచుకున్నాయి. మిగిలిన భూమిలో 2240 ఎకరాలు పట్టా భూములు, 2073 ఎకరాలు అసైన్డ్ భూములున్నాయి కొంత సీలింగ్ ల్యాండ్ కూడా ఉంది.

ఇప్పటికే సినిమా షూటింగ్‌లు.. రాచకొండలో అనేక సినిమాలు చిత్రీకరణ జరుపుకున్నాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, ఎన్‌కౌంటర్, ఆగడు, గబ్బర్‌సింగ్, సీతారాముల కల్యాణం లంకలో, విరోధి, రెబల్ వంటి సినిమాల ఇక్కడి కొండలు ఆలయాల వద్ద షూటింగ్‌లు జరుపుకున్నాయి. హైదరాబాద్‌కు దగ్గర్లో ఉండడం సినీ పరిశ్రమకు అనువుగా ఉంటుంది. ఇక్కడ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసినా.. టూరిజం కారిడార్ ఏర్పాటు చేసినా అనతి కాలంలోనే అభివృద్ధి సాధించడం ఖాయం.

ఏర్పాట్లు పూర్తి… సీఎం విహంగ వీక్షణం కోసం ఇప్పటికే నల్లగొండ జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్ రావు, స్థానిక అధికారులు, పోలీసులతో కలిసి హెలీప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. హెలికాప్టర్‌తో ట్రయల్న్ కూడా నిర్వహించారు. రాచకొండ అభివృద్ధికి ప్రభుత్వం సంకల్పంచడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫిల్మ్‌సిటీ వస్తే తమ ప్రాంత జాతకం మారిపోతుందనే ఆశాభావం వారిలో కనపడుతున్నది.

అభివృద్ధికి పూనుకోవడం సంతోషం రాచకొండ గుట్టలకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. వీటిని టూరిజం కారిడార్‌గా తీర్చిదిద్దాలి. ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇక్కడి జీవ వైవిధ్యాన్ని కాపాడుతూనే అభివృద్ధి చేపట్టాలి. గుట్టల్లో విచ్చల విడిగా సాగుతున్న మైనింగ్‌ను నివారించాల్సిన అవసరం ఉంది. – కంచుకట్ల సుభాష్, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి నే

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.