Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

రాచ నగరాలు!

వందల ఏండ్ల తర్వాత రాచకొండకు మళ్లీ రాజయోగం పట్టనుంది. చరిత్ర ప్రసిద్ధికెక్కిన ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సినిమా సిటీ సహా మూడు నగరాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సోమవారం ఆయన రాచకొండ గుట్టలు, పరిసర ప్రాంతాలను ఏరియల్ సర్వే చేశారు.

KCR visits Rachakonda

-కొండల నడుమ కొలువుదీరనున్న సినిమా, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ సిటీలు -అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణాలు -తెలంగాణకు తలమానికంగా రాచకొండ -ఏరియల్ సర్వే జరిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ – 40 నిమిషాలపాటు గుట్టలను చుట్టిన సీఎం, మంత్రులు -భూముల సమగ్ర వివరాలపై ఆరా -నెలాఖరుకల్లా నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం అనంతరం మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సినిమాసిటీతోపాటు, స్పోర్ట్స్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సుమారు 32 వేల ఎకరాల మేర విస్తరించిన ఈ ప్రాంతంలో అత్యధిక భాగం చాలా చదునుగా, వివిధ సిటీల ఏర్పాటుకు అనువుగా ఉందని సంతృప్తి వ్యక్తంచేశారు. నూతనంగా నిర్మితమయ్యే నగరాల కారణంగా ఎలాంటి కాలుష్యం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. నల్లగొండ ఇప్పటికే ఫ్లోరైడ్ రక్కసి కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నదని, జిల్లాకు మరో సమస్య తెచ్చిపెట్టే ఉద్దేశం ఎంతమాత్రం లేదని స్పష్టంచేశారు. ఇక్కడ చక్కటి భూములున్నాయని, వీటన్నింటినీ సద్వినియోగం చేసుకుని తెలంగాణకే తలమానికంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. భూముల వివరాల ఆరా..: ఏరియల్ సర్వే సందర్భంగా ఈ ప్రాంతంలో మూడుగంటలపాటు గడిపిన సీఎం కేసీఆర్.. వివిధ అంశాలను కలెక్టర్లు, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మధ్యనున్న ఈ గుట్టల ప్రాంతంలో భూముల స్థితిగతుల మీద ప్రధానంగా ఆయన దృష్టి సారించారు. ఏయే సర్వే నంబర్లలో ఎంత మేరకు భూములున్నాయి? ఎలాంటివి ఉన్నాయి? అనే విషయాలు స్పష్టంగా చెప్పాలని కలెక్టర్లు చిరంజీవులు, శ్రీధర్‌లను అడిగారు.

అధికారులు వివరణ ఇస్తూ ఇక్కడ ప్రభుత్వ భూములతోపాటు పట్టా, అటవీ భూములు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ దశలో కల్పించుకున్న సీఎం ఇక్కడ చెట్లే కనిపించడం లేదు.. మరి అటవీ భూములని ఎలా నిర్ధారించారు? అని ఆరా తీశారు.

రాచకొండతో పోలిస్తే ముచ్చెర్ల ప్రభుత్వ భూమిలోనే చెట్లు ఎక్కువగా కనిపించాయని వ్యాఖ్యానించారు. అసలు ఇది అటవీ ప్రాంతంగానే కనిపించడం లేదు.. చెట్లు కూడా కనిపించలేదు.. ఒక వేళ రికార్డుల్లో అలా ఉండి ఉంటే ప్రభుత్వ భూమిగా మార్చాలి అని అధికారులకు సూచించారు. అలాగే ఇక్కడ ఉన్న పట్టా భూములకు సంబంధించి పక్కా లెక్కలు సేకరించాలని ఆదేశించారు. రాచకొండ ప్రాంతం నల్లగొండ జిల్లా పరిధిలోకి 16 వేల ఎకరాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలోకి 14 వేల ఎకరాల వరకు వస్తుందని అధికారులు చెప్పారు.

అంగుళం అంగుళం పూర్తి వివరాలు సేకరించి, నెలాఖరుకల్లా సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులకు మార్గనిర్దేశం చేశారు. సర్వే నంబర్ల వారీగా, ఏయే భూములు దేనికి ఉపయోగపడుతాయో కూడా వివరిస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నివేదిక అందిన తర్వాత ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఏ సిటీకి ఎంత స్థలం కేటాయించాలో నిర్ణయించనున్నట్టు తెలిసింది. నివేదిక అందగానే భూ సేకరణ పూర్తి చేసి మొత్తం పర్యాటక శాఖకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రెండు విడతలుగా సర్వే రాచకొండ ప్రాంతానికి సీఎం కేసీఆర్ బృందం ఉదయం 11.50 గంటలకు చేరుకుంది. హెలిప్యాడ్‌లో దిగిన అనంతరం మంత్రులు, అధికారులతో కలిసి రాచకొండ ఫొటో మ్యాప్‌ను సీఎం కేసీఆర్ పరిశీలించారు. రాచకొండ ప్రాంతం నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్ని వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నది? అందులో రిజర్వు ఫారెస్టు ఎంత? పట్టా భూములు ఎన్ని? హైదరాబాద్ నుంచి ఇక్కడికి రోడ్డుమార్గం ఎక్కడ నుంచి ఉంది? ఎంతసేపు ప్రయాణం? తదితర కోణాల్లో అధికారులనుంచి సమాచారం సేకరిస్తూ మ్యాప్‌లను పరిశీలించారు. తర్వాత మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్లు చిరంజీవులు, శ్రీధర్ ఏరియల్ సర్వే చేశారు. వారు తిరిగొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఇద్దరు కలెక్టర్లు ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు.

ఐదు సీటర్ల హెలికాప్టర్ కావడంవల్ల రెండుసార్లు పర్యటించాల్సి వచ్చింది. ఏరియల్ సర్వేలో రెండు జిల్లాల్లో ఉన్న రాచకొండ ఫారెస్టు ఏరియా, ఇతర ప్రభుత్వ భూములు ఏ మేరకు ఉన్నాయి? అవి ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాన్ని ప్రధానంగా పరిశీలించారు.

నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 32 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, రిజర్వు ఫారెస్టు భూములు 20 వేల ఎకరాలు ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. సర్వే తర్వాత సీఎం ఇక్కడ కొంత దూరం కాలినడకన తిరిగి భూములను పరిశీలించారు. ఏరియల్ సర్వే అనంతరం సీఎస్ రాజీవ్‌శర్మ, కలెక్టర్లు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రులు, అధికారులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో రాచకొండ ప్రాంతాన్ని ఏవిధంగా ఉపయోగించాలనే దానిపై సూచనలు తీసుకున్నారు. ఈ ప్రాంతం ఏ రంగానికి అనుకూలం? ఏయే పరిశ్రమలు పెడితే పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది? అనే విషయమై చర్చించారు. ఇక్కడ ఫిల్మ్ సిటీ, స్పోర్ట్స్ సిటీలతోపాటు కాలుష్యేతర పరిశ్రమలు, సంస్థల స్థాపనకు అవకాశాలను కూడా పరిశీలించాలని నిర్ణయించారు. అనంతరం మధ్యాహ్నం 2.17 గంటలకు మంత్రులతో కలిసి హైదరాబాద్‌కు బయలుదేరారు. సీఎం దాదాపు మూడు గంటలపాటు రాచకొండ ప్రాంతంలో గడిపారు.

ఎన్నో అనుకూల అంశాలు.. రాచకొండలో ఏర్పాటు చేసే నగరాలన్నీ హైదరాబాద్‌కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం అనుకూలమైన అంశం. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి అతి సమీపాన ఉన్నందున ఇక్కడ అభివృద్ధి చేపడితే రవాణాపరమైన ఇబ్బందులకు అవకాశమండదు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డునుంచి రాచకొండను అనుసంధానిస్తూ కొత్త హబ్‌లకు నలువైపులా నాలుగు లైన్ల రహదారులను నిర్మించాలనేది ప్రభుత్వ ప్రణాళికగా ఉంది. ఇక శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాచకొండ దగ్గరగా ఉండడం కలిసివచ్చే అంశాల్లో మరొకటి. వీటితోపాటు ఇప్పటికే ముచ్చర్ల వద్ద ప్రతిపాదించిన ఫార్మాసిటీని సైతం కలుపుతూ నాలుగు లైన్ల రహదారులు వేసే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తున్నది.

భారీ బందోబస్తు.. సీఎం ఏరియల్ సర్వే నేపథ్యంలో పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రేంజ్ డీఐజీ గంగాధర్, నల్లగొండ ఎస్పీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని చౌటుప్పల్, నారాయణపురం, మంచాల మండలాల్లోని ఆయా గ్రామాలు, రాచకొండ అటవీ ప్రాంతంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ ప్రాంతం గతంలో మావోయిస్టులకు కేంద్రంగా ఉండడంతో ఈ ప్రాంతమంతా పోలీసులు నిఘా నీడలో ఉంచారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, పైళ్ల శేఖర్‌రెడ్డి ఉన్నారు.

ఇది మా అదృష్టం: కర్నె ప్రభాకర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తమ ప్రాంతం 60 ఏండ్ల నుంచి వివక్షకు గురైందని, కనీసం గుక్కెడు మంచినీళ్లకు నోచుకోని దుర్భర స్థితి నేపథ్యంలో సీఎం కేసీఆర్ మూడు నగరాల ఏర్పాటుకు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రాచకొండకు, తమ ప్రజలకు మహర్దశ పడుతుందని అదే మండలానికి చెందిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ టీ మీడియాతో సంతోషాన్ని పంచుకున్నారు. చారిత్రక సంపదను కాపాడుకునేందుకే సినిమా సిటీని ప్రతిపాదించారని ఆయన చెప్పారు. గత ప్రభుత్వాలు ఇక్కడ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, క్షిపణి ప్రయోగాలు అంటూ భూములు కేటాయించజూస్తే ప్రజలు తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు.

ఇవాళ సీఎం తీసుకున్న నిర్ణయం ప్రజల్లో చెప్పలేని ఆనందం నింపిందన్నారు. చాలా కాలంగా ఉద్యోగాలు రాక, ఉపాధి దొరకక రాచకొండ గుట్టలనే నెలవుగా చేసుకొని సాయుధ పోరాటాలు సాగించారని, ఈ సిటీల నిర్మాణాల ద్వారా రెండు జిల్లాల నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగు పడుతాయని అన్నారు. రాజకీయాలకతీతంగా ఈ ప్రాంత నాయకులు కూడా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఏరియల్ సర్వే తర్వాత మాట్లాడుతూ కేసీఆర్ సారథ్యంలో ప్రజాస్వామికంగా రాచకొండకు రాజఠీవి వస్తుందని ప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. చాలా కాలంగా వివక్షకు గురైన ఇక్కడ పర్యావరణానికి హాని కలగని ప్రాజెక్టులు రాబోతుండడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.