దివంగత ప్రధాని, బహుముఖ ప్రజ్ఞశాలి, ఆర్థిక సంస్కరణ పితామహుడు పీవీ నర్సింహారావు పదో వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నివాళులర్పించింది. మంగళవారం ఉదయం 10.55 గంటలకు నెక్లెస్‌రోడ్డులోని పీవీఘాట్‌పై సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థనలు చేశారు. తర్వాత పీవీ కూతురు వాణిదేవి, కొడుకు పీవీ రాజేశ్వర్‌రావును, బంధుమిత్రులను పలుకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూన్ 28న పీవీ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని గుర్తుచేశారు.

-పీవీ ఘాట్‌ను సందర్శించిన సీఎం కేసీఆర్ -హాజరైన రాష్ట్ర మంత్రులు.. -పార్లమెంట్‌లో విగ్రహ ఏర్పాటుకు కృషి: టీఆర్‌ఎస్ ఎంపీలు పీవీకి నివాళులర్పించిన వారిలో డిప్యూటీ సీఎంలు రాజయ్య, మహామూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జోగు రామన్న, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, పాపారావు, సమాచారశాఖ కమిషనర్ చంద్రవదన్, పీవీ అభిమానులు, విద్యార్థులు ఉన్నారు.
ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో ఎంపీల నివాళి: తెలంగాణ నుంచి తొలిసారిగా ప్రధానిగా పనిచేసి, పదవికే వన్నెతెచ్చిన దివంగత పీవీ నర్సింహారావు పదోవర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో రాష్ట్ర ప్రతినిధులు, టీఆర్‌ఎస్ ఎంపీలు ఘనంగా నివాళులర్పించారు. దేశంలో చరిత్ర సృష్టించిన పీవీ విగ్రహాన్ని పార్లమెంట్‌లో ఏర్పాటు చేసేలా చొరవ తీసుకుంటామని టీఆర్‌ఎస్ ఎంపీలు స్పష్టంచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున పీవీ చిత్రపటానికి నివాళులర్పించారు. టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్షనేత్ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ చరిత్రలో నూతన అధ్యాయాన్ని సృష్టించారని కొనియాడారు. దేశంలో గడ్డు పరిస్థితులు ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చి అగ్రభాగాన నిలబెట్టారని ప్రశంసించారు. గొప్ప వ్యక్తిత్వం, పాలనాదక్షత కలిగిన పీవీ విగ్రహం పార్లమెంట్‌లో లేకపోవడం బాధాకరమని, విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ సభ్యుడిగా తనవంతు కృషి చేసి విగ్రహాన్ని పెట్టేందుకు చొరవ తీసుకుంటానన్నారు.
ఎంపీ బీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలు అనగానే ప్రైవేట్ సంస్థలకు తలుపులు బార్లా తెరవడమనే భయాలు ఉండేవని, అలాంటి పరిస్థితికి వెళ్లకుండా బంగారాన్ని తాకట్టుపెట్టి దేశ గౌరవ మర్యాదలకు భంగకరం కాకుండా చూశారన్నారు. ఒక ప్రధాని చనిపోతే దహన సంస్కారాలు ఢిల్లీలో జరగడం అనవాయితీ అని, పీవీ విషయంలో తెలంగాణలో జరిగాయని.. ఇది ప్రజల్లో అవమానంగా నిలిచిపోయిందన్నారు.
పార్లమెంట్‌లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ద్వారా తెలంగాణ ప్రజల సెంటిమెంట్లను గౌరవించినట్లవుతుందన్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ 1990వ దశకంలో క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని పదవిని అలంకరించి మైనారిటీలో ఉన్నప్పటికీ ఐదేండ్లపాటు ప్రభుత్వాన్ని నడిపించి ఆర్థిక వ్యవస్థను పరిరక్షించారని గుర్తుచేశారు. ఎంపీ జీ నగేశ్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి తేజావత్ రామచంద్రునాయక్‌లు పీవీ నర్సింహారావు పాలనాదక్షతను కొనియాడారు.