-ఏడాదంతా పీవీ జయంతి ఉత్సవాలు -పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ తొలి సమావేశంలో చైర్మన్ కే కేశవరావు

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్, టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రాన్ని మరోసారి కోరనున్నట్టు తెలిపారు. పార్లమెంట్‌లో పీవీ విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాదంతా ఘనంగా నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. గురువారం బంజారాహిల్స్‌లోని కే కేశవరావు ఇంట్లో పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ తొలి సమావేశం జరిగింది. దీనికి మంత్రులు కే తారకరామారావు, ఈటల రాజేందర్, వీ శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, పీవీ కుమారుడు ప్రసాదరావు, కుమార్తె వాణి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో శతజయంతి ఉత్సవాలపై పలు ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. అనంతరం కేకే మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 28న పీవీ శతజయంతి ఉత్సవాలను నెక్లెస్ రోడ్‌లోని జ్ఞానభూమి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. ఏడాదంతా సాగే ఉత్సవాల కార్యాచరణ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందుంచుతామని, ఆ తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల కారణంగానే ఆర్థికంగా ప్రపంచంలో భారత్ నాలుగోస్థానంలో నిలబడిందని చెప్పారు. ‘రామేశ్వరంలోని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం మ్యూజియం తరహాలోనే.. పీవీ జ్ఞానభూమిలో మెమోరియల్, మ్యూజియం ఏర్పాటుచేయాలి. పీవీ జన్మించిన వంగర గ్రామంలోని ఇంటిని పర్యాటకశాఖ అభివృద్ధిపరచాలి. పీవీ అమ్మమ్మ ఊరు వరంగల్ రూరల్ జిల్లా లక్నేపల్లిని అభివృద్ధిచేయాలి. పీవీ రాసిన ప్రతులను ముద్రించేందుకు కమిటీ వేయాలి. హైదరాబాద్‌లో పీవీ విగ్రహ ఏర్పాటుకు, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో ఒకదానికి పీవీ పేరు పెట్టాలని ప్రతిపాదించాం’ అని కేకే వివరించారు.