– గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం – నేడు టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గం భేటీ – మున్సిపల్ ఎన్నికలపై చర్చ – పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ – ఇంచార్జీల నియామకం.. ప్రచారవ్యూహం.. అభ్యర్థుల ఎంపికపై మార్గదర్శకాలు
రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ పార్టీ ముందుకు వెళ్తున్నది. శుక్రవారం తెలంగాణభవన్‌లో ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. జనవరి 7న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఇందుకు సంబంధించిన షెడ్యూలును రాష్ట్ర ఎన్నికలసంఘం ఇప్పటికే విడుదలచేసింది. ఈ క్రమంలో ఎన్నికలు జరిగే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గులాబీ జెండా ఎగురవేసే విధంగా పక్కా ప్రణాళిక, వ్యూహాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ఖరారుచేశారు. సీఎం వ్యూహాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమలుచేయనున్నారు. శుక్రవారంనాటి సమావేశంలో ఈ వ్యూహంపై విస్తృతంగా చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా పార్టీ ప్రధాన కార్యదర్శులను ఇంచార్జీలుగా ఇప్పటికే నియమించారు.
పార్టీ కార్యదర్శులు, రాష్ట్రస్థాయి నాయకులు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ముఖ్య నేతలను ఇతర జిల్లాలకు ఇంచార్జీలుగా నియమించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒకటి, రెండు మున్సిపాలిటీలకు ఒకరిని బాధ్యులను చేశారు. వీరందరితోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమవుతారు. ఇంచార్జీల్లో ఒకరిద్దరి మార్పు మినహా అందరూ యథావిధిగా కొనసాగుతారు. ఎన్నికల వ్యూహంపై చర్చించిన అనంతరం అభ్యర్థుల ఎంపికపై మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లు ఖరారైన వెంటనే.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నందున అభ్యర్థుల ఎంపికలో జాప్యంచేయకుండా సమర్థులు.. పార్టీ విధేయులు.. గెలుపు గుర్రాలు, ఉద్యమకారులు, సామాజిక సమీకరణాలు.. ఇలా అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను ఎంపికచేయాలని సూచనలు చేయనున్నారు.
ప్రచారవ్యూహంపైనా చర్చ మున్సిపల్ ఎన్నికల ప్రచారవ్యూహంపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రచారం విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఉద్యోగులు, విద్యార్థులు, విద్యావంతులు, కార్మికులు ఎక్కువసంఖ్యలో ఉంటా రు. దీంతోపాటు పట్టణాల్లో సామాజిక, డిజిటల్ మాధ్యమాల ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి.. ప్రచారంలో వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, పది కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఔటర్ రింగ్‌రోడ్ లోపల దాదాపుగా 30 వరకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిని కైవసం చేసుకోవడంలో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ముఖ్యనేతల సేవలను అక్కడ వినియోగించుకోనున్నారు. వీరిని ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇంచార్జీలుగా నియమించి.. ఎక్కడైనా నాయకుల మధ్య సమన్వయలోపం కనిపిస్తే వీరిద్వారా సమాచారం తెప్పించుకొని వారిని సమన్వయపరిచేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ నెల 30 నుంచి జరుగనున్న ఓటర్ల జాబితా సవరణలోనూ చురుగ్గా పాల్గొని అర్హులైన వారందరికీ ఓటుహక్కు ఉన్నదాలేదా అని మరోసారి పరిశీలించాలని సూచించనున్నారు.