తెలంగాణ రాష్ట్రంలోకెల్లా అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఆదిలాబాద్ జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మించి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు.

ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా నిర్మించతలపెట్టిన తుమ్మిడిహట్టితో పాటు ఇతర ప్రాజెక్టులపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నీటి పారుదల శాఖ ఇఎన్‌సి మురళీధర్, సీనియర్ అధికారులు శ్రీదేవి, హరిరామ్, మధుసూదన్‌రావు, శంకర్, పురుషోత్తమ్ రాజు, భగవంతరావు, రమేష్, ఓఎస్‌డి శ్రీధర్ దేశ్‌పాండే పాల్గొన్నారు.
మహరాష్ట్ర నుంచే వచ్చే గోదావరిపై అక్కడి ప్రభుత్వం అనేక చెక్‌డ్యామ్‌లు నిర్మించడం వల్ల దిగువకు నీటి ప్రవాహం తగ్గిందని, భవిష్యత్‌లో మరింత ఇబ్బంది తప్పదని సిఎం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రాణహిత, ఇంద్రావతి ద్వారా వచ్చే నీటిని గరిష్టంగా వినియోగించుకుని తెలంగాణ రైతులకు మేలు చేయాలని కేసిఆర్ చెప్పారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టడం వల్ల రెండు లక్షల ఎకరాలకు తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో నీరందించాలని సిఎం చెప్పారు. 2017 చివరిలోగా తుమ్మిడిహట్టి పూర్తి చేయాలని, నిధులకు కొరత లేదని వివరించారు. నిర్మల్-ముథోల్ ప్రాజెక్టును, పెన్ గంగా బ్యారేజీని కూడా త్వరగా నిర్మించాలని ఆదేశించారు. జిల్లాలో 12 మధ్యతరహా నీటి ప్రాజెక్టులు చేపట్టారని, అందులో పాతవి ఆరు, కొత్తవి ఆరు వున్నాయన్నారు. వీటన్నిటి నిర్మాణం పంట కాలువలతో సహా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. బోధ్ నియోజకవర్గం కుట్టి దగ్గర కూడా మధ్య తరహా ప్రాజెక్టు నిర్మించాలని చెప్పారు. జైకా, మిషన్ కాకతీయ తదితర కార్యక్రమాల కింద చిన్నతరహా నీటి పారుదల ప్రాజెక్టులన్నింటినీ చేపట్టాలన్నారు. భారీ, మధ్య, చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులన్నింటినీ 2018లో వందకు వంద శాతం పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి కార్యాచరణ ప్రారంభించాలని చెప్పారు. నీటి పారుదల శాఖలో ఖాళీలను భర్తీ చేసుకోవడానికి అనుమతిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో చాలా చోట్ల నిరంతరం నీరు అందుబాటులో వుంటుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఆర్ అండ్ బి, పంచాయితిరాజ్ శాఖల ద్వారా నదులు, వాగులు, కాలువలపై వంతెనలు నిర్మించేటప్పుడు తప్పక వాటికి అనుబంధంగా చెక్ డ్యామ్ లు నిర్మించాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించి వంతెనల డిజైన్లు రూపొందించాలన్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణకు వేర్వేరుగా హైడ్రాలజీ విభాగాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.