Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ప్రజల బాటన కేసీఆర్

బడ్జెట్ సమావేశాలు కాగానే ప్రజల్లోకి వెళ్తామని చెప్పిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నట్టుగానే ఆదివారం ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు కోరుకునే పారదర్శక పాలనకు మెదక్ జిల్లా ఎర్రవల్లిలో తన సొంత నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గ సమీక్షతో శ్రీకారం చుట్టారు. పాలన అంటే రాజధాని ఏసీ గదుల్లో కాదు… ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధుల మధ్య అనే సందేశం వెలువరించారు.

-ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో గజ్వేల్ అభివృద్ధిపైసమీక్ష -రాజకీయాలకు దూరంగా.. పారదర్శకంగా సమావేశం -అక్కడికక్కడే నిధుల విడుదల.. తప్పుడు లెక్కలపై నిలదీత -హర్షాతిరేకాలు ప్రకటించిన ప్రజాప్రతినిధులు

CM-KCR-at-Gajwelతూతూ మంత్రంగా పర్యటించడం.. అధికారులకు చెవులు అప్పచెప్పడం.. చేతులూపి వెళ్లిపోవడం కాకుండా నిజంగా ప్రజాసమస్యలమీద క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులనుంచి రాష్ట్రస్థాయి అధికారుల దాకా అందరినీ ఒకే వేదిక మీదికి తెచ్చి కొత్త ఒరవడి ప్రారంభించారు. సీఎం పర్యటన అంటే కేవలం గుప్పెడు మంది అధికారులు, పిడికెడు మంది రాజకీయ నాయకుల వ్యవహారంలా కాకుండా పార్టీలకు అతీతంగా ఆరుగురు ఎంపీపీలు, ఆరుగురు జెడ్పీటీసీలు, 75 మంది ఎంపీటీసీ సభ్యులు, 125 మంది సర్పంచ్‌ల సమక్షంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం గంటల తరబడి సమావేశం నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు.

సమావేశంలో సీఎం వివిధ శాఖలకు చెందిన పనుల మీద ప్రశ్నలు వేసి ప్రజాప్రతినిధులనుంచి వాస్తవ పరిస్థితి తెలుసుకున్నారు. అధికారుల వివరణలు విన్నారు. పరిష్కారాలు ప్రకటించారు. ఈ క్రమంలో అనేక అభివృద్ధి పనులు మంజూరు చేశారు. నిధులు కేటాయించారు. కాకి లెక్కలతో దాటవేయాలనే అధికారులను నిలదీశారు. పనులు చేసినవారిని అభినందించారు. అక్కడికక్కడే అనేక సమస్యలు పరిష్కరించారు. అనేక ఏండ్లుగా పడివున్న సమస్యలకు కూడా ఈ సమావేశం పరిష్కారం చూపడం ప్రజాప్రతినిధుల్లో ఆనందం నింపింది. కొత్త రాష్ట్రంలో కొత్త పంథాలో పాలన సాగిస్తామని పదవి స్వీకరించిన సమయంలోనే సీఎం ప్రకటించారు.

గత ఐదునెలల కాలంలో దాన్ని ఆచరణలో పెడుతూ వచ్చారు. ఇటీవలే ముగిసిన బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆ వైవిధ్యం కనిపించింది. తాజాగా సమీక్షా సమావేశంలోనూ ఆ ఒరవడి కొనసాగింది. గత సర్కారు పాలనకు భిన్నంగా అధికారుల సమాచారం మీద ఆధారపడకుండా ప్రజల్లోకి స్వయంగా వెళ్లే కార్యక్రమం ప్రారంభించారు. గతంలో అధికారులు చెప్పే కాకిలెక్కలు విని ముఖ్యమంత్రులు తలూపి వెళ్ళిపోయేవారు. ఎవరైనా భిన్నంగా చెప్పినా ప్రతిపక్షం విమర్శగా కొట్టిపారేసే వారు. కానీ గజ్వెల్ సమావేశం భిన్నమైన దృశ్యం ఆవిష్కరించింది.

సమీక్షలో అధికారులు చెప్పిన లెక్కలను అక్కడిక్కడే లెక్క కరెక్టనేనా..? అని ప్రజాప్రతినిధులను అడిగి నిర్దారించుకున్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్‌బొజ్జా, గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అధికారి హన్మంతరావు, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రాజు, డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణరెడ్డితో పాటు అన్ని శాఖల అధికారులు అక్కడే ఉండడంతో ప్రతి సమస్యకూ పరిష్కారం దొరికే అవకాశం కలిగింది. ఈ సమావేశం మరిన్ని సమావేశాలకు ప్రేరణగా నిలిచింది.

సీఎం ఎదుట ధైర్యంగా..: మెదక్ జిల్లా చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి ఈ తరహాలో సమీక్ష నిర్వహించడం ఇదే మొదటిసారి. సీఎం జరిపిన సమీక్ష ప్రజాప్రతినిధుల ప్రశంసలు పొందింది. ఇలాంటి సమావేశాల్లో సాధారణంగా మాట్లాడని ప్రజాప్రతినిధులుకూడా కేసీఆర్ చొరవ చూసి ధైర్యంగా సమస్యలు ఏకరువు పెట్టారు. విద్యుత్, సాగునీటి రంగం, రోడ్లు, ఆర్టీసీ, చెరువుల పునరుద్ధరణ, మొక్కల పెంపకంపై ప్రధానంగా సమీక్షించారు. విద్యుత్ సమస్యపై సీపీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, జిల్లా ఎస్‌ఈ రాములు విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటు, విద్యుత్ సరఫరా గురించి వివరిస్తున్నప్పుడు ప్రజాప్రతినిధులను విద్యుత్ సమస్యలపై సీఎం వాకబు చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిన రోజే తిరిగి కొత్త ట్రాన్స్‌ఫార్మర్ అందిస్తున్నామని అధికారులు చెప్పినపుడు ప్రజా ప్రతినిధులను నిజమేనా? అని అడిగి నిర్దారించుకున్నారు. ఒకరిరిద్దరు మినహా మిగతా వారంతా ఇస్తున్నారని చెప్పారు.

వేలాడే వైర్లు, ఒరిగిన స్తంభాల సమస్య ఎక్కువగా ఉందని గమనించి పవర్ డే పేరుతో ఓ రోజు జిల్లాలోని విద్యుత్ శాఖ అధికారులంతా గజ్వేల్‌కు వచ్చి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించడంతో ప్రజాప్రతినిధులు చప్పట్లతో హర్షం ప్రకటించారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం తన ఎమ్మెల్యే కోటా కింద వచ్చే రూ.కోటి 50లక్షలు అందిస్తానని ప్రకటించి వారిని మరింత ఆనందపరిచారు. ఇక మాటలుండవ్.. చేతలేనని సీఎం పేర్కొన్నపుడు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా హర్షాతిరేకాలు ప్రకటించారు. కొత్తగా సర్పంచ్‌గా ఎన్నికైన వారు సైతం కేసీఆర్‌తోనే తమ గ్రామ సమస్యలు చెప్పుకున్నారు. ప్రజా ప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యకు కేసీఆర్ అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రోడ్ల దశ మారుతుంది..: తమ గ్రామానికి రోడ్డు బాగాలేదని చెప్పిన ప్రజాప్రతినిధికి రోడ్ల మరమ్మతుకోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం వివరించి నియోజకవర్గంలో అన్ని రోడ్ల దశమారుతుందని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో మరమ్మత్తు చేయాల్సిన రోడ్ల లెక్కల సమయంలో ఆర్‌అండ్‌బీ అధికారులను… మరి మరమ్మత్తు అవసరం లేని రోడ్డు ఎక్కడుందని కేసీఆర్ ప్రశ్నించడంతో ప్రజాప్రనిధులు చప్పట్లు కొట్టారు. బాగున్న రోడ్డు గురించి అధికారులు చెప్పినపుడు ఆ గ్రామానికి చెందిన సర్పంచ్‌ను లేపి నిజమేనా అని అడిగారు. అవునుసార్ బాగుంది అన్న తరువాతే మరో అంశంలోకి వెళ్ళారు.

చెరువుల పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్న సమయంలో ఓ మహిళా సర్పంచ్ లేచి సార్.. చెరువులో కొందరు బోర్లు వేసుకున్నరు. ఇప్పుడు మరమ్మత్తు చేస్తే అడ్డమొస్తరేమోనని సందేహాన్ని వ్యక్తం చేసింది. ఇందుకు స్పందించిన సీఎం పోలీసులు, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేయాలని, పునరుద్ధరణకు ఎవరు అడ్డొచ్చినా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆర్టీసీ సమీక్షలో అన్ని గ్రామాల్లో బస్‌షెల్టర్లు నిర్మిస్తామని ప్రకటించారు. విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకుని బస్సులు వేయాలని ఆదేశించారు.

మేం కూడా ఉషారైనం..: రోడ్ల మరమ్మత్తు అంశంపై చర్చ సందర్భంగా గజ్వేల్‌కు రూ. వందల కోట్లు వస్తున్నాయి.. ఎప్పుడూ మీరు ఇన్ని నిధులు చూడలేదని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన సీఎం కేసీఆర్ హరీష్ బాగా హుషార్. నువ్వు సిద్దిపేటను అభివృద్ధి చేసుకున్నట్లు మేం చేసుకోవద్దా? మేమూ హుషార్ అయినం అనడంతో సమీక్షలో నవ్వులు విరిశాయి. నీ దగ్గర మూడు శాఖలున్నయి. అన్నింటిలో నా గజ్వేల్‌కు ఎక్కువ ఇయ్యాలే అన్నప్పుడు కూడా అందరూ నవ్వారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని, ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్‌రెడ్డిలనుద్దేశించి మావోల్లు మీకు మస్తు ఓట్లేసిండ్రు.

మరి మీరు కృతజ్ఞత చూపించరా..? మీ కోటా నుంచి నిధులు ఇవ్వరా? అనడంతో అక్కడికక్కడే ప్రభాకర్‌రెడ్డి రూ.2 కోట్లు, సుధాకర్‌రెడ్డి రూ.50 లక్షలు ప్రకటించారు. బస్టాండ్ల మరమ్మత్తులు, వీధి దీపాలు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, రోడ్లు, బస్సులు ఇలా అడిగినవన్నీ మంజూరు చేయడంతో ప్రజా ప్రతినిధులు మీరు ఎమ్మెల్యే కావడం అదృష్టమని ప్రశంసించారు. ఈ సమావేశం ప్రజాప్రతినిధుల్లో పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసాన్ని నింపింది. గజ్వెల్ అభివృద్ధి ఇక వేగం పుంజుకుంటుందనే నమ్మకం వారిలో కనిపించింది. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు కూడా సమీక్ష జరిగిన తీరుపై చర్చించుకున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.