-పీహెచ్‌సీల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి.. డిప్యూటీ సీఎం రాజయ్య సూచన

ప్రైవేట్ దవాఖానలకు దీటుగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలు అందించాలని వైద్యసిబ్బందికి డిప్యూటీ సీఎం డాక్టర్ టీ రాజయ్య సూచించారు. వరంగల్ జిల్లా రఘునాథపల్లిలోని పీహెచ్‌సీలో రాజయ్య మంగళవారం రాత్రి బసచేశారు. అనంతరం బుధవారం ఉదయం దవాఖానను పరిశీలించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రైవేటు దవాఖానను ఆశ్రయించి జేబులు గుళ్ల చేసుకుంటున్నారని, ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు జరిగేలా వైద్యసిబ్బంది ప్రత్యేక శ్రద్ధచూపాలన్నారు.
డాక్టర్లు సమయపాలన పాటించి సరైన వైద్యం అందిస్తేనే ప్రభుత్వ దవాఖానలకు రోగులు వచ్చే వీలుంటుందన్నారు. రాష్ట్రంలో 346 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైతే అందులో 140 పాజిటివ్‌గా తేలాయని, 142 కేసులకు ప్రభుత్వ దవాఖానలోనే సమర్థంగా సేవలు అందించామన్నారు. ప్రైవేట్ వైద్యాన్ని ఆశ్రయించినవారే మృతిచెందారన్నారు. ప్రభుత్వవైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగేలా డాక్టర్లు కృషిచేయాలన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణను తీర్చిదిద్దడానికి నియోజకవర్గానికి రూ.కోటి, జిల్లాకు రూ.25 కోట్లు రాష్ట్రప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వం దవాఖానల్లో కుక్క, పాముకాటుకు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.