Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి

కొత్త రాష్ర్టానికి సవాళ్లున్నాయి.. సహకరించండి నీటి వనరులుంటేనే తెలంగాణలో పంటలు -చెరువులు పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నాం.. -వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు అధిక నిధులివ్వండి -రాష్ర్టానికి పన్నుల వాటా 40శాతానికి పెంచండి.. -ఎస్సీల సమగ్రాభివృద్ధికి ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు -బీసీలకోసం రూ.25 వేల కోట్లు ఖర్చుచేయనున్నాం.. – 14వ ఆర్థిక సంఘం సమావేశంలో సీఎం కేసీఆర్

CM KCR Press Meet

కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు అనేక సమస్యలు, సవాళ్లు ఉన్నాయని, వీటిని అధిగమించేందుకు రాష్ర్టానికి ఇతోధికంగా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 14వ ఆర్థిక సంఘాన్ని కోరారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను ఖర్చుచేయాల్సి ఉన్నందున ఆర్థిక సంఘం అర్థంచేసుకొని రాష్ర్టానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గ్రాండ్ కాకతీయ హోటల్‌లో 14వ ఆర్థిక సంఘం సభ్యులతో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.

రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వ ప్రణాళికలతో కూడిన నివేదికను ముఖ్యమంత్రి ఆర్థిక సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలో తెలంగాణలో నీటి వనరుల అభివృద్ధి తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు. ఫలితంగా తెలంగాణలో రైతులు సాగునీటికి భూగర్భ జలాలపైనే ఆధారపడాల్సి వస్తున్నదని తెలిపారు. భూగర్భ జలాలు మెరుగుపర్చాలంటే చెరువుల పునరుద్ధరణ ఒక్కటే మార్గమని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని తీసుకుంటున్నదని ఆర్థిక సంఘానికి వివరించారు. అన్ని జిల్లాల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా తెలంగాణ డ్రింకింగ్‌వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధంచేస్తున్నదని తెలిపారు. తెలంగాణలో పరిశ్రమలను ప్రోత్సహించడానికి కొత్త పారిశ్రామిక విధానాన్ని అమలు చేయబోతున్నామని ఆర్థిక సంఘం సభ్యులకు సీఎం తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని కూడా గుర్తించామన్నారు.

ఎన్నో సవాళ్లున్నాయి: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని ఆర్థిక, సామాజిక పరిస్థితులను మీ ముందు ఉంచుతున్నాంటూ ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డిని ఉద్దేశించి సీఎం తన ఉపన్యాసం మొదలు పెట్టారు. నేను, నాతోపాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, మా ప్రభుత్వ అధికారుల బృందం మీతో సమావేశం కావడం సంతోషదాయకం. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ ఎదుర్కొనాలంటే కేంద్రం సముచితమైన ఆర్థిక సహాయం అందించాలి అని విజ్ఞప్తి చేశారు. అంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతంలో కాకతీయులు, అసఫ్‌జాహీలు చెరువులకు, స్థానిక నీటి వనరుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని, ఫలితంగా తెలంగాణ ప్రాంతంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని ఆర్థిక సంఘం సభ్యులకు ముఖ్యమంత్రి వివరించారు. అనంతర పరిణామాల్లో తెలంగాణలో నీటి పారుదల వనరులను నిర్లక్ష్యం చేయడంతో పది జిల్లాల్లో తొమ్మిది జిల్లాలు వెనకబడిపోయయని చెప్పారు. దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించిన విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని ఆర్థిక సంఘాన్ని కోరారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన ఆరు దశాబ్దాల తర్వాత కూడా తెలంగాణలోని మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలు నేటికీ ఎంతో వెనుకబడిన జిల్లాలుగానే ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 86% ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారేనన్నారు. ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్నందునే ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే పన్నుల ద్వారా ఆదాయం, వ్యాట్, సేల్స్ టాక్స్‌లు ఎక్కువగా వస్తున్నాయని, రాష్ట్రం మొత్తంలోని పరిశ్రమలు, సంస్థలు హైదరాబాద్ కేంద్రంగానే రిజిస్ట్రర్ కావడంతో ఇక్కడే పన్నులను చెల్లిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో వచ్చే ఆదాయాన్ని తెలంగాణ జిల్లాలలో కలిపి లెక్కించి తెలంగాణ ఆర్థికంగా ముందంజలో ఉందని భావించవద్దని సీఎం కోరారు. 12వ ఆర్థిక సంఘం సమయంలో 2005-2010 మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థికవృద్ధి 10.5 శాతం ఉంటే, అది 13వ ఆర్థిక సంఘం సమయం 2012-13 నాటికి 4.5 శాతానికి పడిపోయిందని తెలిపారు. ఆర్థిక వృద్ధిని పెంచడం ఒక్కటే కాదు, అన్ని వర్గాలను సమానంగా అభివృద్ధి చెందేలా చేయడం అన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రధాన అంశంగా ఉందని సీఎం తెలిపారు.

దళితుల అభివృద్ధికి ఐదేండ్లలో 50వేల కోట్లు ఖర్చు జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ మా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను అని ఆర్థిక సంఘం సభ్యులను ఉద్దేశించి అన్న కేసీఆర్..

పేదరికంలో ఉన్న దళితులను అభివృద్ధిపథంలో నడిపించేందుకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూమి లేని నిరుపేద దళితులకు మూడు ఎకరాల భూమిని అందించే పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. దీనిని స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీన లాంఛనంగా ప్రారంభించామని తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా భూమిలేని నిరుపేద దళితులను గుర్తించి, ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి వారికి అందిస్తుందని, అంతేకాకుండా ఇచ్చిన భూమికి నీటి వనరులను కల్పించే ప్రణాళికలను ప్రభుత్వం అమలు చేయబోతన్నదని సీఎం వివరించారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం రాబోయే ఐదేండ్లలో రూ.50 వేల కోట్లను ఖర్చు చేయాలని భావిస్తున్నదని తెలిపారు. ఎస్టీల అభివృద్ధికోసం ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి 12% రిజర్వేషన్లు కల్పించనున్నట్లు చెప్పారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి రాబోయే ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు, మైనార్టీల సంక్షేమం కోసం ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు 14వ ఆర్థిక సంఘానికి సీఎం తెలిపారు.

వ్యవసాయరంగంపై ప్రత్యేక శ్రద్ధ రాష్ట్రంలో వ్యవసాయరంగం నిర్లక్ష్యానికి గురవడంవల్ల వ్యవసాయం ఖర్చుతో కూడిన రంగంగా మారిపోయింది. రైతులకు నీటి సదుపాయం లేక బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేయవలసి వస్తున్నది. తెలంగాణలో 84 శాతం భూములు బోరుబావులపైనే ఆధారపడి ఉన్నాయి. దీంతో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని సీఎం వివరించారు. తెలంగాణ ప్రాంతంలో సాధారణ వృద్ధి రేటులో 14% వాటాను కలిగి ఉన్న వ్యవసాయరంగం 50%మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుందన్నారు. ఇలాంటి వ్యవసాయరంగాన్ని ఆదుకునేందుకు, నీటిపారుదల వనరులను మెరుగు పర్చేందుకు తెలంగాణలోని 48 వేల చెరువులను పునరుద్ధరించి, భూగర్భ జలాలను పెంచి రైతులను ఆదుకుంటామని సీఎం తెలిపారు.

ఇంటింటికీ మంచినీటి వసతి తెలంగాణలోని ప్రతి ఇంటికి మంచినీటి వసతి కల్పించేందుకు వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణలో లభ్యమవుతున్న మొత్తం నీటి వనరులలో 10 శాతం నీటిని వాటర్ గ్రిడ్‌లోకి మళ్లించి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీరు అందించే ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అసలైన లబ్ధిదారులకు మాత్రమే అందాలనే లక్ష్యంతో ఇటీవలే సమగ్ర సామాజిక సర్వే నిర్వహించి, తెలంగాణ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను నమోదు చేశామని చెప్పారు. తెలంగాణలో పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంకోసం ప్రభుత్వం హరిత హారం కార్యక్రమాన్ని చేపట్టబోతున్నదని వెల్లడించారు. ఇందులో భాగంగా రాబోయే మూడేండ్లలో 230 కోట్ల మొక్కలను తెలంగాణ వ్యాప్తంగా, అందులో ప్రతి శాసనసభా నియోజకవర్గ పరిధిలో 40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేసీఆర్ వివరించారు.

పన్నుల్లో రాష్ట్ర వాటా పెంచండి సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నుల ద్వారా వచ్చే అదాయాన్ని పంపిణీ చేసే విధానం కొనసాగుతున్నదన్న సీఎం.. ఇందులో భాగంగా కేంద్రం రాష్ర్టాలకు ఇస్తున్న 32 శాతం వాటాను 40 శాతానికి పెంచాలని కోరారు. గత ఆరేండ్లుగా తెలంగాణ ప్రాంతం ప్రకృతి విపత్తులకు గురై తీవ్రంగా నష్టపోయిందని, వ్యవసాయరంగం పూర్తిగా దెబ్బతిన్నదని ఆర్థిక సంఘం దృష్టికి సీఎం తీసుకొచ్చారు. ప్రకృతి విపత్తుల సమయంలో రాష్ర్టాలను కేంద్రం ఆదుకునేందుకు ఉద్దేశించిన నిధులను 75 శాతం నుంచి 90 శాతానికి పెంచాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయాల్సి ఉన్నందున ఆర్థిక సంఘం అర్థం చేసుకొని సానూకూలంగా అధిక నిధులను కేటాయించాలని విన్నవించారు. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. సామాజిక న్యాయం జరుగనిదే సమగ్రాభివృద్ధి జరుగదని ఆరవ ఆర్థిక సంఘం చెప్పింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సామాజిక న్యాయంతో సమగ్రాభివృద్ధిని సాధించాలనే కృత నిశ్చయంతో ఉంది. ఇందుకు సహకరించాలని 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవీరెడ్డిని కోరుతున్నాను అని చెబుతూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ఆర్థిక సంఘంతో జరిగిన సమావేశంలో సీఎంతోపాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వీ నాగిరెడ్డి, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగరావు, ఇతర శాఖల ముఖ్య కార్యదర్శులు రేమండ్ పీటర్, జోషి, టీ రాధ, డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.