-మంచివర్షాలు వచ్చే సందర్భంలోనే వేడుకలు -జోగులాంబ దేవస్థానాన్ని ఘనంగా తీర్చిదిద్దాలి -కృష్ణా పుష్కరాలపై మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్ష
గోదావరి పుష్కరాల తరహాలోనే ప్రతిష్ఠాత్మకంగా కృష్ణా పుష్కరాలను నిర్వహించి తెలంగాణ ఖ్యాతిని రెట్టింపు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఆగస్టులో మంచివర్షాలు కురిసే సమయంలో పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో భౌగోళిక, వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. ఆదివారం సచివాలయంలో కృష్ణా పుష్కరాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, టీ హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, చందూలాల్, జగదీశ్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల కలెక్టర్లు శ్రీదేవి, సత్యనారాయణ, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 50 వరకు స్నానఘట్టాలు నిర్మించాలని సీఎం ఆదేశించారు.

గోదావరి పుష్కరాలు జరిగిన సమయం, ప్రదేశాలతో పోలిస్తే కృష్ణా పుష్కరాలు చాలా భిన్నమైనవని, చాలా జాగ్రత్తలు అవసరమని సూచించారు. కృష్ణానదితీరంలోని జోగులాంబ దేవస్థానం అష్టాదశ శక్తిపీఠాల్లో ఘనమైనదని, ఈ దేవస్థానాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని, దేవస్థానం వరకు చక్కని రహదారులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. కృష్ణానదీతీరం వరకు రాకపోకల సౌకర్యాలు సరిగ్గా లేనందున, తీరంవరకు వెళ్లడానికి, అక్కడినుంచి రావడానికి వేర్వేరు దారులు ఏర్పాటుచేయాలని అన్నారు. వర్షాలు అప్పటికే ప్రారంభమవుతాయని, తీరమంతా నల్లరేగడి నేల అయినందున వాహనాలకు ఇబ్బందులు ఏర్పడకుండా, గట్టినేలలో పార్కింగ్‌స్థలాలు, హోర్డింగ్‌స్పేస్‌లు ఏర్పాటుచేయాలని తెలిపారు. కృష్ణానదిలో మొసళ్లు ఉంటాయని, ఆ దిశలో జాగ్రత్తలు అవసరమని చెప్పారు. జోగులాంబ దేవస్థానంతోపాటు పుష్కరఘాట్లకు వెళ్లేమార్గంలో ఉండే అన్నీ దేవాలయాలను గుర్తించి ఆధునీకరించాలని సీఎం మార్గనిర్ధేశం చేశారు. పుష్కరస్నానం చేసిన తర్వాత క్షేత్రదర్శనం సంప్రదాయమని, ఆలయాల వద్ద సదుపాయాలను పెంపొందించాలని అన్నారు. గోదావరి పుష్కరాల్లో పనిచేసిన కలెక్టర్లు, ఇతర అధికారుల సేవలను వినియోగించుకోవాలని స్పష్టంచేశారు. నాగార్జునసాగర్ డ్యామ్, శ్రీశైలం డ్యామ్, బీచుపల్లి, వాడపల్లి, మట్టపల్లి, కొల్లాపూర్, సోమశిల, పెబ్బేరు, జూరాల, తదితర ప్రాంతాల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లుచేయాలని సీఎం ఆదేశించారు.