-నాగార్జునసాగర్ ఆయకట్టులో.. యాసంగిలో 4 లక్షల ఎకరాలకు -చివరి భూములకుసైతం నీరందేలా చర్యలు -జూన్ నాటికి ఆధునీకరణ పనులు పూర్తిచేస్తాం -ఎడమకాల్వకు నీరు విడుదల చేసిన మంత్రి హరీశ్‌రావు -మాది అభివృద్ధి దాహం కాంగ్రెస్‌ది అధికార దాహం -రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ తపన -అభివృద్ధిని అడ్డుకొనేందుకే కాంగ్రెస్ కేసుల డ్రామా: హరీశ్‌రావు -భవిష్యత్తులో చివరి ఆయకట్టు అన్న పదం ఉండదు: మంత్రి జగదీశ్‌రెడ్డి -ఉదయసముద్రం పనులను పరిశీలించిన మంత్రులు

నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలో నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని నాలుగు లక్షల ఎకరాల యాసంగి పంటలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టంచేశారు. ప్రతి ప్రధానకాల్వ కింద చివరి భూములకు సైతం నీరందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. ఆదివారం నాగార్జునసాగర్ ఎడమకాల్వకు రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖల మంత్రి జీ జగదీశ్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు నీటిని విడుదలచేశారు. హెలికాప్టర్ ద్వారా నాగార్జునసాగర్‌కు వచ్చిన మంత్రి హరీశ్‌రావు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పొట్టిచెల్మె వద్దకు చేరుకొన్నారు. ఎడమకాల్వ హెడ్‌రెగ్యులేటర్ వద్ద ఉదయం 10:30 గంటలకు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదలచేశారు. అంతకు ముందు పైలాన్ పిల్లర్ వద్ద నిర్వహించిన సాగర్ 63వ శంకుస్థాపన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం స్థానిక విజయవిహార్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాగర్ ఎడమకాల్వ పరిధిలోని లిఫ్టులకు, ఏఎమ్మార్పీకి సైతం ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ప్రతి నెల రెండు టీఎంసీల చొప్పున 10 టీఎంసీల నీటిని విడుదలచేస్తామని చెప్పారు. కాల్వ చివరి భూములకు కూడా నీరందేలా నల్లగొండ, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మాది అభివృద్ధి దాహం .. కాంగ్రెస్‌ది అధికార దాహం తమది అభివృద్ధి దాహమైతే, కాంగ్రెస్ నాయకులది అధికార దాహమని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌పార్టీ నాయకులు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కాకుండా అధికారమే పరమావధిగా ఎలాంటి శక్తులతోనైనా చేతులు కలుపుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేస్తూ తమ పదవులకు రాజీనామా చేయాలని ఓయూ విద్యార్థులు కోరితే కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం ఎమ్మెల్యేలంతా పారిపోయారని ఎద్దేవాచేశారు. మరికొందరు రాజీనామా చేసినట్టు జిరాక్స్ పత్రాలపై సంతకాలు చేసి డ్రామాలాడారని పేర్కొన్నారు. కేవలం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే రాజీనామాలు చేసి ప్రజాకోర్టుకు వెళ్లారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో అవాంతరాలను, అడ్డంకులను ఎదుర్కొని అన్నిరంగాల్లో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలుపాలని సీఎం కేసీఆర్ నిరంతరం తపన పడుతున్నారని చెప్పారు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ప్రజలకు తాగు, సాగునీరు, విద్యుత్ అందించే ప్రాజెక్టులపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారని, కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో కేసులువేశారని, సింగరేణి వారసత్వ ఉద్యోగాలతోపాటు ఇతర ఉద్యోగాల భర్తీ విషయంలోనూ కోర్టుల్లో కేసులు వేస్తూ అడుగడుగునా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
ప్రాజెక్టులను అడ్డుకోవటం లేదంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గాంధీభవన్‌లో చేసిన ప్రకటనపై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకొనేందుకు చనిపోయిన రైతుల పేరుతో దొంగసంతకాలు చేసి కోర్టులో కేసులు వేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఈ విషయమై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వంతోపాటు ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు సైతం ప్రశంసిస్తున్నారని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా జనవరి 1 నుంచి వ్యవసాయంతోపాటు ఐటీ, ఇతర రంగాలకు సైతం 24 గంటలు విద్యుత్ సరఫరా చేయనున్నట్టు తెలిపారు. నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, 2008 నుంచి 2014 వరకు ఆరేండ్లపాటు కేవలం 30శాతం పనులు చేసి రూ.573కోట్ల ప్రపంచబ్యాంకు నిధులు ఖర్చుచేసిందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన మూడున్నరేండ్లలోనే 65 శాతం పనులు పూర్తిచేసి రూ.1,265 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. మిగిలిన ఐదుశాతం పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేస్తామని స్పష్టంచేశారు. ఆధునీకరణ పనులు త్వరతగతిన పూర్తి చేసినందుకుగానూ ప్రపంచబ్యాంకు బృందం మనకు నంబర్ వన్ స్థానాన్ని ఇచ్చిందని తెలిపారు.
భవిష్యత్తులో చివరి ఆయకట్టు అన్న పదం ఉండదు: మంత్రి జగదీశ్‌రెడ్డి సాగర్ ఎడమకాల్వ పరిధిలో భవిష్యత్తులో చివరి ఆయకట్టు అన్న పదమే వినిపించకుండా చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖల మంత్రి జీ జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఎడమకాల్వ కింద మేజర్ పరిధిలోని రాజవరం, ముదిమాణిక్యంతోపాటు అన్ని మేజర్ల చివరి భూములకు సాగునీరు అందించే విధంగా ఎప్పటికప్పుడు ఎన్‌ఎస్పీ అధికారులు పర్యవేక్షిస్తారని అన్నారు. కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలూనాయక్, జిల్లా కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, నియోజకవర్గ ఇంచార్జి నోముల నర్సింహయ్య, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, నాయకులు అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఉదయ సముద్రం పనుల పరిశీలన నార్కట్‌పల్లి, నమస్తే తెలంగాణ : నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంలలో నిర్మిస్తున్న ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్ పనులను మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. అనంతరం పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. పనులు సకాలంలో పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్, జేసీ నారాయణరెడ్డి, ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల గ్రామంలో ఆదివారం ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్ పనులను పరిశీలిస్తున్న మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు