– వచ్చే విద్యాసంవత్సరం నాటికి అమలు – మరుగుదొడ్ల నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది – సీఎంతో చర్చించిన తర్వాత నియామకం – విద్యామంత్రి జీ జగదీశ్‌రెడ్డి వెల్లడి – ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలువాలి – పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ – పాఠశాలల్లో వసతుల కల్పనపై సమీక్ష

వచ్చే విద్యాసంవత్సరం నాటికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులందరికీ రక్షిత తాగునీరు, మరుగుదొడ్డి వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 4,963 ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, 24,364 పాఠశాలల్లో మూత్రశాలలను ఏర్పాటుచేయాల్సిన అవసరముందని ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు.
పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాటు అంశంపై సోమవారం సచివాలయంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావుతో కలిసి మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం జగదీశ్‌రెడ్డి సమావేశ వివరాలను మీడియాకు తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం వచ్చే ఆగస్టు 15 నాటికి ప్రతి పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్డి వసతి కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ నిర్వహణపరమైన లోపాలతో అవి నిరుపయోగంగా మారుతున్నాయన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. పాఠశాలల్లోని మూత్రశాలలు, మరుగుదొడ్లలో ఉపయోగించిన నీటిని ఫిల్టర్ చేసి వ్యవసాయానికి, గార్డెనింగ్‌కు వినియోగించే సౌకర్యాలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, వాటిని పరిశీలించాల్సిందిగా అధికారులకు సూచించామని జగదీశ్ రెడ్డి తెలిపారు. మరుగుదొడ్లను కట్టి వదిలేస్తే ఫలితం ఉండదని గుర్తించిన ప్రభుత్వం వాటి నిర్వహణను చేపట్టేందుకు అవసరమైన సిబ్బందిని నియమించే విషయంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో చర్చించి , నియామకానికి అనుమతి తీసుకోనున్నట్లు మంత్రి చెప్పారు.
ఆగస్టు 15నాటికి మరుగుదొడ్ల ఏర్పాటు: కేటీఆర్ వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో బాల,బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయాలని, ఈ కార్యక్రమాన్ని అధికారులు సవాలుగా తీసుకొని మందుకెళ్లాలని పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కేటీఆర్ కోరారు. మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలువాలన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశింశారు. మరుగుదొడ్ల నిర్మించడం మొదటి సవాల్ అయితే వాటిని నిర్వహించడం మరో పెద్ద సవాల్‌గా మారిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మరుగుదొడ్ల సదుపాయంలేని పాఠశాలల సమాచారాన్ని వారంలోగా ప్రభుత్వానికి అందించాలని, ఇందుకోసం అవసరమైతే జిల్లా కలెక్టర్ల సహాయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. గత నెలలో ఢిల్లీలో జరిగిన స్వచ్ఛ్ భారత్-స్వస్థ్ భారత్ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం సూచన మేరకు ప్రతి పాఠశాలలో మరుగుదొడ్డి యూనిట్ నిర్మాణ ఖర్చును రూ.55 వేలకు పెంచేందుకు కేంద్రం అంగీకరించిందని, కేంద్రం నిధులకుతోడుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి వాటాను ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
పంచాయతీరాజ్ గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యశాఖతోపాటు విద్యాశాఖ పరిధిలోని వివిధ పథకాల నుంచి ఈ నిధులు ఇస్తామని చెప్పారు. నిర్మాణం కచ్చితంగా నాణ్యత పాటించాలని, ప్రతి మరుగుదొడ్డికి నీటి సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ అనుకూల బయోడిగ్రేడబుల్ మరుగుదొడ్ల పనితీరును పరిశీలించాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి జే రేమండ్ పీటర్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ఆర్‌డబ్యూఎస్ ఇంజినీరింగ్-ఇన్-చీఫ్ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.