-అత్యుత్తమైన పాలసీ కోసం అధికారుల కసరత్తు -సింగపూర్, గుజరాత్‌ల్లో అమలుతీరుపై పరిశీలన -వారంలోపే పాలసీ అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు
ప్రపంచంలోనే అత్యుత్తమమైన పారిశ్రామిక విధానం రూపకల్పనలో రాష్ట్ర పరిశ్రమల శాఖ తలమునకలైంది. పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు అధికారులు దేశవిదేశాల్లోని అత్యుత్తమ పారిశ్రామిక విధానాలపై విస్తృతంగా అధ్యయనం చేశారు. పెట్టుబడులను ఆకర్షించేలా పెట్టుబడిదారులకు ఎన్నెన్నో ప్రోత్సాహకాలను తెర మీదికి తీసుకుస్తున్నారు.
ప్రతి వస్తువుపై మేడ్ ఇన్ తెలంగాణ/హైదరాబాద్ అని కనిపించేలా ఉండాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర భారీ కసరత్తు సాగిస్తున్నారు. పారిశ్రామికవర్గాల నుంచి సిఫార్సులను స్వీకరించడంతోపాటు విధానాల రూపకల్పనలో అన్నీ బాధ్యతలు తానే తీసుకుని సొంతంగా డ్రాఫ్టు చేస్తుండడం విశేషం. వారంలోపే పాలసీని అమల్లోకి తీసుకొచ్చేందుకు పరిశ్రమల శాఖ తుది మెరుగులు దిద్దుతున్నది.
దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ ఏడాది ఆఖరులోగా సదస్సును ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి 160 దేశాల ప్రతినిధులను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇప్పటికే పెద్దఎత్తున పెట్టుబడిదారులు రాష్ర్టానికి క్యూ కడుతుండటంతో కచ్చితంగా రాష్ట్ర పారిశ్రామిక విధానం అన్ని వర్గాలకు అనుకూలంగా ఉంటుందని.. పారిశ్రామిక రంగానికి ఊతమిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
సింగపూర్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సింగపూర్ భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న దేశం. అక్కడ అమలయ్యే పాలసీలు ఆకర్షణీయంగా ఉండటంతోపాటు అనుమతుల విషయంలో పెట్టుబడిదారులకు సౌకర్యవంతంగా ఉన్నాయి. పరిశ్రమల స్థాపనకు రెండు వారాల్లోనే అనుమతులు లభిస్తాయి. గ్లోబల్ ఇన్వెస్టర్ ప్రోగ్రాంలో భాగంగా విదేశీ పెట్టుబడిదారులకు ప్రత్యేక ఎంట్రీ పాస్ జారీ ఇస్తారు.. దీంతో వారు తరచూ దేశానికి వచ్చి వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది. ఏ తరహా వ్యాపారమైనా, పరిశ్రమైనా అకౌంటింగ్ అండ్ కార్పొరేట్ రెగ్యులరేటరీ అథారిటీలో రిజిస్టర్ చేసుకోవాల్సిందే. ఇందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఆన్‌లైన్‌లోనే అనుమతులు పొందవచ్చు.
గుజరాత్ విజన్.. మేడ్ ఇన్ గుజరాత్ దేశంలోనే అత్యుత్తమైన ఇండస్ట్రియల్ పాలసీ అమలుచేస్తున్న రాష్ట్రంగా గుజరాత్‌కు పేరుంది. అన్ని ప్రాంతాల్లోనూ పారిశ్రామికీరణ జరిగేటట్లు చూడడంతోనే అక్కడి ప్రభుత్వం సగం విజయాన్ని సాధించినట్లు తెలుస్తున్నది. అక్కడ వెనుకబడిన తాలూకాల్లోనూ పరిశ్రమలను నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టింది. గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రొడక్ట్ క్లస్టర్లు, స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆకర్షిస్తున్నది. రూ.1000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి, 2 వేల మందికి పైగా ఉపాధి కల్పించే ప్రాజెక్టును మెగా యూనిట్‌గా పరిగణిస్తున్నది. క్లస్టర్లను అభివృద్ధి చేసేందుకు మూడేళ్ల వరకు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నది.
పారిశ్రామిక వాడల అభివృద్ధిలోనూ పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆకర్షిస్తున్నది. వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు యువతకు శిక్షణ ఇస్తున్నది. ప్రపంచంలోని పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రతి రెండేళ్లకోసారి వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నది.
పారిశ్రామిక విధానం డ్రాఫ్టు సిద్ధం -సీఎం కేసీఆర్‌కు సమర్పించిన అధికారులు తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం డ్రాఫ్టును సీఎం కే చంద్రశేఖర్‌రావుకు పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర అందజేశారు. ఈమేరకు గురువారం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సీఎం పలు సవరణలను ప్రతిపాదించినట్లు సమాచారం. మిగతా రాష్ర్టాల్లో అమలు చేస్తున్న పాలసీల కంటే మెరుగ్గా ఉందని ప్రశంసించినట్లు తెలిసింది. కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే.. త్వరలోనే జరుగనున్న కేబినేట్‌లో పాలసీకి ఆమోదం లభించనుంది.