Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ప్రాణహిత-చేవెళ్లకు భరోసా

తెలంగాణకు శుభవార్త.. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడానికి సంసిద్ధమని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి ప్రకటించారు. ఏడెనిమిది రోజుల్లోనే ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో కలిపి సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని భరోసా ఇచ్చారు.

CM-KCR-with-Union-Minister-Umabharthi

-జాతీయ హోదాపై సత్వర నిర్ణయం -వారంలోగా కేంద్ర,రాష్ట్ర అధికారుల భేటీ -కేంద్ర జలవనరుల శాఖ మంత్రి వెల్లడి -ఢిల్లీలో మంత్రి ఉమాభారతితో సీఎం కేసీఆర్ భేటీ -మిషన్ కాకతీయ, దేవాదులపైనా చర్చ -మిషన్ కాకతీయ ప్రారంభోత్సవానికి ఉమాభారతి -అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నదని ఉమ కితాబు ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు టీఆర్‌ఎస్ ఎంపీలతో కలిసి సోమవారం మధ్యాహ్నం మంత్రి ఉమాభారతితో ఆమె కార్యాలయంలో భేటీ అయ్యారు. రాష్ర్టానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులతోపాటు చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ గురించి మంత్రికి వివరించారు. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు ఆవశ్యకతను వివరించి ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంతోపాటు సత్వరం పూర్తికావడానికి పర్యావరణ, హైడ్రాలజీ అనుమతులను కూడా మంజూరు చేయాలని కోరారు.

కేసీఆర్ చేసిన విజ్ఞప్తులకు మంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర అధికారులతోపాటు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారులను సమావేశపరిచి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. జాతీయ హోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ అభివృద్ధిలో మాత్రం వేగంగా దూసుకుపోతున్నదని ఉమాభారతి కితాబునిచ్చారు.

మిషన్ కాకతీయపై ఆసక్తి..: సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ గురించి మంత్రికి వివరణాత్మకంగా తెలియజేశారు. కాకతీయులు, నిజాం కాలంలో చెరువులకు చాలా ప్రాధాన్యత ఉండేదని, కేవలం వర్షాధారంపై రైతులకు సంవత్సరం పొడవునా సాగునీరు అందేదని చెప్పారు. కాలక్రమంలో చెరువులను నిర్లక్ష్యం చేయడం వల్ల సాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయని, మరోవైపు భూగర్భ జలమట్టాలు కూడా దారుణంగా పడిపోయాయని వివరించారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 45,200 చెరువులను గుర్తించే ప్రక్రియ పూర్తయిందని, వీటికి మరమ్మత్తులు చేపట్టి పునరుద్ధరించడం మాత్రమే కాక ఒకదానితో మరొకటి అనుసంధానం చేయడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలు సాధించాలని తలపెట్టామని పేర్కొన్నారు.

చెరువుల పునరుద్ధరణ వ్యవసాయానికి ఎలా మేలు చేయనుందో ఆయన వివరించారు. బహుళ ప్రయోజనాలున్న ఈ ప్రాజెక్టు దీర్ఘకాలిక స్వభావంతో కూడుకున్నది కాబట్టి సుమారు 22,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్న కేసీఆర్, కేంద్రం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను గ్రహించిన ఉమాభారతి సానుకూలంగా స్పందించారు. కేసీఆర్ వివరణను ఆసక్తిగా ఆలకించిన మంత్రి ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా కేసీఆర్ ఆహ్వానించగా తప్పనిసరిగా వస్తానని హామీ ఇచ్చారు.

దేవాదుల బకాయిలు ఇవ్వండి.. దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి 2013-14 సంవత్సరానికి రూ. 113 కోటు,్ల 2014-15 సంవత్సరానికి రూ. 63 కోట్లు ఏఐబీపీ నిధులు రావాల్సి ఉన్నదని కేసీఆర్ మంత్రికి గుర్తు చేశారు. ప్రాజెక్టు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నందున సత్వరమే ఆ నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరాలను జలవనరుల మంత్రిత్వ శాఖకు పంపిందని చెప్పారు.

గోదావరిపై కొత్త విషయాలు తెలుసుకున్నా.. దక్షిణ గంగానదిగా పిల్చుకునే గోదావరి నదిపై సీఎం కేసీఆర్‌నుంచి కొత్త విషయాలు తెలుసుకోగలిగానని మంత్రి ఉమా భారతి అన్నారు. ప్రాణహిత -చేవెళ్ల అంశంపై వివరణ ఇచ్చిన సందర్భంగా కేసీఆర్ గోదావరి నది పుట్టుపుర్వోత్తరాలను, నది గమనాన్ని, ఆయా ప్రాంతాల్లో నదిలో లభ్యమయ్యే నీటి పరిమాణాన్ని సవివరంగా ఉమా భారతికి వివరించారు. ఈ వివరణతో ఆశ్చర్యపడిన ఉమాభారతి చాలా కొత్త విషయాలు తెలుసుకున్నానన్న సంతృప్తిని వ్యక్తం చేశారు.

గోదావరి నుంచి ప్రతి ఏటా వేలాది టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలుస్తున్నదని, పోలవరం ప్రాజెక్టు వల్ల ఈ నీటిని ఒక మేరకు మాత్రమే సద్వినియోగం చేసుకోవచ్చని సీఎం చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు టీఆర్‌ఎస్ పార్టీగానీ, తెలంగాణ ప్రభుత్వంగానీ వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూనే డిజైన్‌ను మార్చితే రెండున్నర లక్షల మంది గిరిజనుల జీవితాలకు భరోసా కల్పించవచ్చన్నారు. గోదావరి, ప్రాణహిత, శబరి లాంటి నదులతో తెలంగాణలోని ఏడు జిల్లాలకు అనుబంధం ఉందని, ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం ద్వారా ఏడు జిల్లాల రైతాంగానికి ఎంతో మేలు చేసినవారమవుతామని ఆమెకు వివరించారు. ఈ చర్చల్లో కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ ఎంపీలు కే కేశవరావు, జితేందర్‌రెడ్డి, బీ వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, కవిత, ప్రొఫెసర్ సీతారాం నాయక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ హోదాకు కేంద్రం సానుకూలం: ఉమాభారతి కేసీఆర్‌తో భేటీ అనంతరం కేంద్ర మంత్రి ఉమాభారతి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తన కార్యాలయానికి తొలిసారి వచ్చారని.. చాలా సంతోషంగా ఉందని అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని కితాబు ఇచ్చారు. తమ సమావేశంలో రాష్ర్టానికి సంబంధించిన పలు జల అంశాలపైన సవివరంగా చర్చించామని, ముఖ్యంగా మూడు అంశాలపైన కేసీఆర్ వివరించారని తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ళకు జాతీయహోదాపై కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నదని, తప్పనిసరిగా హోదా కల్పిస్తామని తెలిపారు.

ప్రాజెక్టు సత్వరం పూర్తి కావడానికి పర్యావరణ, హైడ్రాలజీ అనుమతులు అవసరం కాబట్టి వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తానని, అధికారులతో మాట్లాడుతానని చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ గురించి ఉమాభారతి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు గొప్పదనాన్ని, ప్రాధాన్యతను వివరించి ప్రారంభోత్సవానికి రావాలని కేసీఆర్ ఆహ్వానించగా తప్పనిసరిగా వస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మిషన్ కాకతీయ ప్రాజెక్టుకు సంబంధించి కూడా డాక్యుమెంట్లను పరిశీలించి కేంద్రం నుంచి సహాయాన్ని అందజేస్తామని స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు బకాయిలు రూ. 64 కోట్ల నిధులు వారంలోగా విడుదల చేస్తానని తెలిపారు.

ఢిల్లీలో ఎస్‌ఈ స్థాయి అధికారి: ఎంపీ కవిత ప్రాణహిత-చేవెళ్ళతో పాటు మిషన్ కాకతీయ లాంటి తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలపై శీఘ్రగతిన నిర్ణయాలు జరిగేందుకు ఒక ఎస్‌ఈ స్థాయి అధికారిని ఢిల్లీలోనే ఉంచుతామని చర్చల సందర్భంగా మంత్రి ఉమాభారతికి ముఖ్యమంత్రి తెలియచేశారని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత మీడియాకు చెప్పారు. కేసీఆర్ ప్రస్తావించిన ప్రాజెక్టులపై ఉమాభారతి చాలా సానుకూలంగా స్పందించారని, మిషన్ కాకతీయ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కేసీఆర్ ఆహ్వానించిన వెంటనే తప్పనిసరిగా వస్తామని మాట ఇచ్చారని తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.