-మండలాలవారీగా కాంటూర్ల వివరాలతో కూడిన పుస్తకం -వాటర్ ట్రీట్ ప్లాంట్లను పెద్దసంఖ్యలో నిర్మించాలి -మోటర్లు, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లపై అధ్యయనం చేయండి -వాటర్‌గ్రిడ్ సమీక్ష సమావేశంలో అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పనులను ప్రణాళికబద్ధంగా, శాస్త్రీయ అవగాహనతో, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వాటర్‌గ్రిడ్ పనులపై ఇంజినీరింగ్ అధికారులతో సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. జిల్లాలవారీగా గ్రిడ్ మ్యాప్‌లు తెప్పించుకొని, ఆయా ప్రాంతాల్లో ఉన్న నీటి వనరులు, గుట్టలు, ఇతర ఎత్తైన ప్రాంతాలను పరిశీలించారు. కృష్ణా, గోదావరి, ఇతర నదుల నీటిని గ్రామాలకు తరలించేందుకు లిఫ్ట్ కమ్ గ్రావిటీ ద్వారా వాటర్‌గ్రిడ్ పైపులైన్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.
అధికారులు రూపొందించిన గ్రిడ్ మ్యాపుల్లో మండలాల వారీగా కాంటూర్ల వివరాలను తెలుపుతూ ఓ పుస్తకం ముద్రించాలని, అది ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులందరికీ అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. ఇంటేక్‌వెల్ నిర్మాణానికి చాలా సమయం పడుతున్నందున, వెంటనే దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంచేయాలని ఆదేశించారు. ఎన్ని ఇంటేక్‌వెల్స్ కావాలి? ఎన్ని మోటర్లు కావాలి? అనే అంశంపై అంచనాలు రూపొందించుకోవాలని చెప్పారు.
అనుకోని అవాంతరాలు ఎదురైనా నీటిని తోడేందుకు ఇబ్బంది రాకుండా అవసరమైన చోట రెండు, అంతకన్నా ఎక్కువ మోటర్లు అదనంగా సమకూర్చుకోవాలని, వీటికోసం టెండర్ల ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇక ఎన్ని వాటర్ ట్రీట్‌మెంటు ప్లాంట్లు కావాలి? వాటిని నిర్మించడానికి ఎంత సమయం పడుతుంది? అనే అంశాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. ట్రంక్, డిస్ట్రిబ్యూటరీ పైపులైన్లు కూడా పెద్దఎత్తున నిర్మించాల్సి ఉన్నందున ఈ విషయంలో కూడా అధికారులు వేగంగా స్పందించాలని సీఎం తెలిపారు.
ఎన్ని ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులు నిర్మించాలనే విషయంపై కూడా అవగాహనకు రావాలని, ఎంత సమయంలోగా వాటిని నిర్మిస్తారో ప్రణాళికలు సిద్ధంచేసుకొని అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్‌పీటర్, ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, సాంకేతిక సలహాదారుడు ఉమాకాంత్‌రావు, సీఈ బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
గ్రిడ్ పనులకు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వాటర్‌గ్రిడ్ పనుల కోసం ఔట్‌సోర్సింగ్ ద్వారా సిబ్బందిని నియమించుకొనేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాశాఖకు ప్రభుత్వం అనుమతిచ్చింది. పదవీ విరమణ పొందిన 47 మంది సీనియర్ అసిస్టెంట్‌లు, 662 మంది వర్క్‌ఇన్‌స్పెక్టర్‌లను ఔట్‌సోర్సింగ్ ద్వారా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి రేమండ్‌పీటర్ ఉత్తర్వులు జారీచేశారు. గ్రిడ్ పనులను పర్యవేక్షించేందుకు అధికారులకు అవసరమైన కొత్త వాహనాల కొనుగోలుకు కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈఈ స్థాయి సిబ్బందికి 82 వాహనాలను కొనుగోలు చేయాలని, 167 వాహనాలను అద్దెకు తీసుకోవాల్సిన అవసరముందని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
వీటిని పరిశీలించిన ప్రభుత్వం 26 వాహనాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. వీటిలో మొదటి విడతగా 15 వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మిగతా 11 వాహనాలు కొత్త సిబ్బందిని నియమించిన తర్వాత కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
పంచాయతీరాజ్ ఈఎన్‌సీకి టెండర్లను నిర్ణయించే అధికారం పంచాయతీరాజ్ పనుల కాంట్రాక్ట్ టెండర్లను ఖరారుచేసే సమావేశాలకు హాజరుకావడంతోపాటు స్పెషల్ కాంట్రాక్ట్‌లు, క్లాస్-1 కాంట్రాక్ట్‌ల కేటాయింపు, కాంట్రాక్ట్‌ల రిజిస్ట్రేషన్లకు అనుమతులిచ్చే అధికారాన్ని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఇన్-చీఫ్ సత్యనారాయణరెడ్డికి ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.