Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ప్రజాకాంక్షలే మా బడ్జెట్

-సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తున్నాం -వ్యవసాయం పండుగ కావాలన్నదే ధ్యేయం -60ఏండ్ల తప్పులను సరిదిద్దబోతున్నాం -అవహేళనలు చేసిన చోటే బడ్జెట్ పెట్టడం గర్వకారణం -నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్

Etela Rajendar

మా ప్రాథమ్యాలు: చెరువులు, మంచినీరు, విద్యుత్, రహదారులు ఒక్క రూపాయి కూడా ఇవ్వం.. ‘ఏం చేసుకుంటారో చేసుకోండి.. అనే అవహేళనలు ఎదుర్కొన్న చోట ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రమై.. మన బడ్జెట్‌ను మనమే ప్రవేశపెట్టుకుంటున్నాం. 14 ఏండ్లుగా ఉద్యమాలు చేసివచ్చిన వాళ్లం. ప్రజల అవసరాలు దగ్గర్నుంచి చూసినవాళ్లం. ఆ అనుభవాలన్నీ బడ్జెట్ రూపకల్పనలో రంగరించాం.

అరవై ఏండ్లుగా సీమాంధ్రపాలకులు విస్మరించిన తెలంగాణ అవసరాలన్నింటికీ ఈ బడ్జెట్‌లో కేటాయింపులు జరిపాం. పింఛన్ పథకాలు, రుణమాఫీకి నిధులు ఇచ్చాం. సంక్షేమానికి పెద్దపీట వేయడంతోపాటు చెరువులు, మంచినీరు, విద్యుత్, రహదారులువంటి రంగాలకు భారీగా నిధులు ఇస్తున్నాం. కేవలం అంకెల గారడీగా ఉండకూడదనే గ్రామస్థాయినుంచి ప్రణాళికలు రూపొందించి టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటుచేసి దేశంలో ఏ రాష్ట్రంలో చేయనంత భారీ కసరత్తు చేశాం. మా బడ్జెట్ ప్రాక్టికల్‌గా ఉంటుంది. ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉంటుంది. అన్ని వర్గాలు హర్షించే విధంగా బడ్జెట్ ఉండబోతున్నది.’ – ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్

తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెద్ద పీటవేస్తూ అన్ని రంగాలకు నిధుల కేటాయింపులో సరైన వాటా కల్పిస్తున్నామన్నారు. అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్న శాసనసభలోనే.. ఆర్థికశాఖ మంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఎంతో గర్వంగా ఉందన్నారు.

తెలంగాణ అంటే అది ఎక్కడుంది?.., ఒక్క రూపాయి కూడా ఇవ్వను.. ఏం చేసుకుంటారో చేసుకోండి.. మీరు ఎంత మంది ఉన్నారు? తెలంగాణ ఎలా వస్తుంది అంటూ ఎందరో హేళన చేసిన వారున్నారు. అన్నింటినీ సహనంతో భరించాం అని మంత్రి ఈటెల గతాన్ని గుర్తు చేసుకున్నారు. నవంబర్ 5న శానసభలో తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈటెల రాజేందర్ నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశ పెడుతున్న ఘనత మీది. ఈ బడ్జెట్ ఎలా ఉండబోతున్నది? తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుంది. అపూర్వమైన సందర్భం కాబట్టే ఈ బడ్జెట్ రూపకల్పనలో ముఖ్యమంత్రితో సహా వివిధ శాఖల మంత్రులందరం కలిసి కూర్చొని సుదీర్ఘంగా చర్చించి, నిర్ణయాలు తీసుకున్నాం. తెలంగాణ బడ్జెట్ రూపకల్పనకు జరిగినంత కసరత్తు దేశంలో బహుశా ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకు జరిగి ఉండదు.

మా బాధ్యత పెద్దది. 14ఏండ్లుగా ప్రజల తరఫున ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్లం. ప్రజల అవసరాలు చూసిన వాళ్లం. అందులో నేను శాసనసభలో 10ఏండ్లు ఫ్లోర్ లీడర్‌గా ఉన్నాను. ఈ అనుభవాలన్నీ ఇందులో రంగరించాం. అన్ని వర్గాలు హర్షించే విధంగా బడ్జెట్ ఉండబోతున్నది. గత 57 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు ఏయే అంశాలు విస్మరించారో వాటికి బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించాం. పేదల సంక్షేమానికి అగ్రతాంబూలం ఇస్తూ సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు చేశాం.

వ్యవసాయం దండుగ అని చెప్పిన పాలకులు తెలంగాణ నీటి పారుదల రంగాన్ని, చెరువులను విచ్ఛిన్నం చేశారు. మేం తెలంగాణలో వ్యవసాయం పండుగ అనిపించే రీతిగా నీటి పారుదలరంగానికి, చెరువుల పునరుద్ధరణకు అధిక నిధులు కేటాయిస్తున్నాం. జటిల సమస్యే అయినా రైతుల రుణమాఫీకి ఇప్పటికే మొదటి విడత నిధులు ఇచ్చాం.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదాయాలు తగ్గాయంటున్నారు. దానిని పూడ్చుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలేంటి? రాష్ట్ర విభజనలో అస్పష్టతే దానికి కారణం. అనేక అంశాల్లో సమస్యలు వస్తున్నాయి. అధికారుల విభజనపై కేంద్రంనుంచి స్పష్టత రావడం లేదు. పాలనపై ఈ ప్రభావం పడుతున్నది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజనను కేంద్రం ఫైనల్ చేస్తే, అధికారులుకూడా పూర్తి స్థాయిలో మనసుపెట్టి పనిచేస్తారు. ఒకసారి ఇది జరిగిపోతే పాలన కుదురుకుంటుంది. అపుడు ఆదాయాలను సమకూర్చుకోవచ్చు.

సంక్షేమ పథకాలకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి? ముందే చెప్పినట్లు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. వృద్ధులు, వితంతువుల పెన్షన్‌ను రూ.1000కి పెంచాం. ఇది సాధ్యమేనా? అని ప్రతి పక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అంతకుముందు రైతుల రుణమాఫీపై కూడా ఇలాగే గగ్గోలు పెట్టాయి. కానీ దానిని అమలుచేశాం. ఇదే రీతిలో పెంచిన పెన్షన్లను కూడా అమలు చేసి విమర్శలు చేసే నోళ్లు మూయిస్తాం. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కొత్తగా తీసుకువచ్చిన పథకాలు. గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వని విధంగా మైనార్టీల సంక్షేమానికి రూ.1000 కోట్లకు పైగా నిధులు బడ్జెట్‌లో పెట్టబోతున్నాం. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కేటాయింపులు సబ్ ప్లాన్‌లో పేర్కొన్న విధంగా ఉంటుంది.

బడ్జెట్ అంటే అంకెల కూర్పు అనే విమర్శ ఉంది! అంకెల గారడీ కాకూడదనే కదా.. టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసి శాఖల వారీగా నివేదికలు తెప్పించి ఇంత ఎక్సర్‌సైజ్ చేసింది. కేవలం ఒక ఆర్థిక సంవత్సరానికే కాకుండా రాబోయే ఐదేండ్లకు ఎలాంటి కేటాయింపులు ఉండాలో సూచించాలన్నాం. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రాక్టికల్‌గా ఉంటుంది. కేటాయించిన ప్రతి పైసా ఖర్చు చేసే విధంగా ప్రణాళిక రూపొందించాం. విద్య మీద చేసే వ్యయాన్ని ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా భావించాం. అందుకే కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించి, అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడేలా తీర్చి దిద్దుతాం. విద్యావంతులైన యువకులకుకూడా వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను పెంపొందిస్తాం. తద్వారా తెలంగాణ సమాజం మొత్తం అభివృద్ధి చెందాలన్నది ప్రభుత్వం ధ్యేయం.

ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల కూర్పు ఎలా ఉండబోతున్నది? ఏ బడ్జెట్‌లోనైనా ప్రణాళిక వ్యయంకంటే ప్రణాళికేతర వ్యయం ఎక్కువగా ఉండటం చూస్తుంటాం. తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌లో మాత్రం ఇంచుమించు సమానంగా చూపబోతున్నాం. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలు సమానంగా ఉండాలంటే ప్రభుత్వ ఆదాయ, వనరులు పెంచుకోవాలి. కానీ వ్యయాన్ని తగ్గించుకోవడంకోసం, ఉద్యోగులను తొలగించటం, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు ఆపటం వంటివి చేయం. సంక్షేమ పథకాలకు కోతలు పెట్టం.

బడ్జెట్‌లో ప్రభుత్వ ప్రాధాన్యాలేంటి? బడ్జెట్ అంటే గతంలో మంత్రులు, ఐఏఎస్‌లు హైదరాబాద్‌లో కూర్చొని తయారు చేసేవారు. తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నంగా గ్రామీణ, మండల, జిల్లా స్థాయిల్లో సమస్యలను తెలుసుకోవడానికి మన ఊరు-మన ప్రణాళిక రూపొందించింది. సమగ్ర కుటుంబ సర్వే జరిపాం. వచ్చిన సమాచారం, అంశాల ఆధారంగా ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు ఉండబోతున్నాయి. మా ప్రభుత్వ ప్రాధాన్యాలు ప్రధానంగా నాలుగు.

విద్యుత్: విద్యుత్‌కు భారీగా కేటాయింపులుంటాయి. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ సమస్య ఉన్న మాట వాస్తవం. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలోనే ఈ విషయం చెప్పాం. అయితే కేంద్ర ప్రభుత్వం తన వద్ద ఉన్న ఎవరికీ కేటాయించని విద్యుత్‌లో కొంతైనా ఇచ్చి ఆదుకుంటుందని ఆశించాం. మరోవైపు విభజన చట్టం మేరకు 54% విద్యుత్ వస్తే కొరత చాలా వరకు అదుపులోకి వచ్చేది. అది జరగలేదు. మరోవైపు వర్షాలు లేక కరువు పరిస్థితులు తోడై సమస్య తీవ్రమైంది. ప్రస్తుత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో విద్యుత్ కొరత తలెత్తకుండాప్రణాళికను తయారు చేశాం. అవసరమైన నిధులను ప్రస్తుత, వచ్చే సంవత్సరాల బడ్జెట్‌లో కేటాయిస్తున్నాం.

ఇంటింటికీ మంచినీరు: భారీ ఆర్థికభారమే అయినా మా ఆడ బిడ్డలు నీళ్లకోసం మైళ్ల దూరం నడిచి వెళ్లే పరిస్థితి లేకుండా చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాం. ఇందుకు అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయిస్తాం.

రోడ్ల నిర్మాణం: గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు సక్రమంగా లేవు. ప్రజలు పట్టణాలకు రావాలన్నా, గ్రామాలకు వెళ్లలన్నా ఎన్నో ఇబ్బందులు. అందుకే నగరాలనుంచి గూడేలదాకా అంతటా రోడ్ల కనెక్టివిటీ మెరుగుపర్చడం ఓ చాలెంజ్‌గా తీసుకున్నాం. ఇందుకు అవసరమైన నిధులు ఇస్తున్నాం.

చెరువుల పునరుద్ధరణ: రాష్ట్రంలో ప్రధాన నీటి ఆధారం చెరువులే. బోరు బావులు, చెరువులు పరస్పర ఆధారితాలు. చెరువుల్లో నీరు ఉంటే భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం పండుగలా మారుతుంది. అందుకే చెరువుల పురుద్ధరణ మా ప్రథమ ప్రాధాన్యం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.