-పింఛన్ల అమలుపై అధ్యయనం చేస్తున్నాం -రుణమాఫీపై ఆంధ్రామీడియా తప్పుడు ప్రచారం -ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ధ్వజం -కరీంనగర్ జిల్లాలో మంత్రికి ఘన స్వాగతం

అమరవీరుల ఆశయసాధనతో సంక్షేమమే ఎజెండాగా, బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి అధ్యక్షతన మంత్రికి సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మెచ్చే పద్ధతిలో కొత్త ఒరవడితో ప్రజా సంక్షేమమే ఎజెండాగా పాలన సాగిస్తామని తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి 365 రోజులు పనిచేస్తామని, కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వృద్ధులు, వింతంతులకు వికలాంగులకు రూ.1500 పింఛన్‌పై అధ్యయనం చేస్తున్నామని, రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని చెప్పారు. రూ.3 లక్షలకు ఇళ్ల నిర్మాణ పథకం అమలుచేసి చూపిస్తామన్నారు.
రుణమాఫీపై ఆంధ్రామీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నదని, నూటికి నూరుపాల్లు రైతుల కన్నీరు తూడుస్తామని, రుణమాఫీ అమలు చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ ఆది నుంచి అండగా నిలిచిందని, కేసీఆర్ ఉప ఎన్నికల్లో పోటీచేసినపుడు రెండు లక్షలపై మెజార్టీతో గెలిపించారని, అప్పటి సీఎం రూ.వందల కోట్లు కుమ్మరించినా ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటారని, వైఎస్ చెంప చెల్లుమనిపించారన్నారు. కేసీఆర్ ప్రజల రుణాన్ని తీర్చుకునేందుకు 1050 గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకం అమలుకు రూ.350 కోట్లు కేంద్రంనుంచి సాధిస్తే వైఎస్ అడ్డుకున్నారని గుర్తుచేశారు. సిద్దిపేట తరహాలో ఈ పథకాన్ని ఎంపీల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసేందుకు కృషి చేస్తుందన్నారు. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా తామంతా జీవితాన్ని రాష్ట్ర అభివృద్ధికే అంకితమిస్తామన్నారు. రాజకీయ అవినీతి లేకుండా చూస్తామన్నారు. ఉద్యమనేత ఈటెలకు, యువకిశోరం కేటీఆర్‌కు మంత్రి పదవులు కట్టబెట్టడం ద్వారా జిల్లా అభివృద్ధి దిశగా ముందకు సాగుతుందన్నారు.
సభలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కే విద్యాసాగర్‌రావు, సోమారపు సత్యనారాయణ, పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి, వొడితల సతీశ్‌కుమార్, బొడిగ శోభ, టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు సర్దార్ రవీందర్‌సింగ్, యువజన, విద్యార్థి విభాగం అధ్యక్షులు కట్ల సతీశ్, సిద్దం వేణులతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేతల రాక సందర్భంగా వాతావరణం చల్లబడటం, సభ ప్రారంభంలో వర్షం రావడంతో ఎంపీతోపాటు నేతలు ఇది శుభసూచకమని అభివర్ణించారు. అంతకు ముందు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈటెల రాజేందర్‌కు కరీంనగర్‌లో టీఆర్‌ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. బెజ్జంకి, తిమ్మాపూర్, అల్గునూర్, నగరంలో శ్రేణులు ఈటెలకు స్వాగతం పలికారు. ఎన్టీఆర్ చౌక్ వద్ద ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈటెలకు పుష్పగుచ్చం అందించారు. అనంతరం నగరంలో పటాకులు పేలుస్తూ తెలంగాణ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.