Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ప్రజాపోలీస్ వ్యవస్థకు ఇదే నాంది

-లండన్ తరహాలో క్రైమ్ కంట్రోల్ చేద్దాం -పోలీసులు ప్రజల పట్ల మర్యాదగా మెలగాలి -బంజారాహిల్స్‌లో వరల్డ్ కంట్రోల్ రూమ్ -15 రోజుల్లో క్లాస్ కమిషనరేట్‌కు పునాది -పేకాట క్లబ్బులు జిల్లాల్లోనూ ఉండటానికి వీల్లేదు -పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు ప్రారంభిస్తూ సీఎం కేసీఆర్

KCR-001 తెలంగాణలో హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ అని ప్రపంచవ్యాప్తంగా గుర్తుండేలా శ్రీకారం చుడదామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అందుకు ప్రస్తుత ఆధునిక పోలీసింగ్ వ్యవస్థ నాంది అని చెప్పారు. పోలీస్‌శాఖ ఎంత పటిష్టంగా ఉంటే ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి అంతబాగుంటాయని, ప్రజలు కూడా బాగుంటారని అన్నారు. ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్న టెక్నాలజీ, వ్యవస్థలను గురించి మాట్లాడుకోవడం కాకుండా మన రాష్ట్రంలో మన హైదరాబాద్‌లో అమలు చేసి చూపిద్దాం అంటూ పోలీసు శాఖలో సీఎం నూతనోత్తేజం నింపారు. వరల్డ్ క్లాస్ పోలీసింగ్, సేఫ్ అండ్ స్మార్ట్ సిటీలో భాగంగా అత్యాధునిక టెక్నాలజీ కల్గిన పెట్రోలింగ్ ఇన్నోవా కార్లు, హీరో బైక్‌ల ప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఇన్నోవా కార్లు, బైక్‌ల తాళం చెవులను కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, జితేందర్‌కు అందించారు. అనంతరం 100 ఇన్నోవా, 300 బైక్‌లకు సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం రెండు నెలల్లోనే తాను చెప్పిన విధంగా టెక్నాలజీ కల్గిన పెట్రోలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన డీజీపీ అనురాగ్‌శర్మను, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లను అభినందించారు. పోలీస్ శాఖకు కన్సల్టెన్సీగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు, బ్రాండింగ్ తదితర అన్ని విషయాల్లో తోడ్పడిన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ప్రతినిధులకు సీఎం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

ప్రజల సహకారంతోనే సాధ్యం.. లండన్, న్యూయార్క్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్టుగా టెక్నాలజీ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను రాష్ట్రంలో అమలు చేయాలంటే కచ్చితంగా ప్రజల సహకారం ఉండాల్సిందేనని సీఎం అన్నారు. పోలీసులు కూడా ప్రజలను ఈసడించుకోకుండా వారిని అర్థంచేసుకునే విధానంతో కలుపుకొనిపోతేనే సులభమైన, స్నేహపూర్వకమైన పోలీసింగ్ అమలు సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. ప్రజలు, పోలీసులు కలిసి పనిచేస్తేనే వరల్డ్ క్లాస్ పోలీసింగ్ విజయవంతమవుతుందని అన్నారు. పోలీస్‌శాఖకు ప్రభుత్వంనుంచి పూర్తిసహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

మూడు నెలల్లో కమాండ్ కంట్రోల్ లండన్, న్యూయార్క్ తరహాలో ప్రతీ రోడ్డు, ప్రతీ గల్లీ, ప్రతీ అపార్ట్‌మెంట్.. అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి, వాటిని కమాండ్ సెంటర్‌తో అనుసంధానం చేస్తామన్నారు. ప్రపంచదేశాల్లో ఉన్న టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరో మూడు నెలల్లో 3వేలకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటుకు రిలయన్స్‌తోపాటు అనేక కంపెనీలు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మకున్న పట్టుదలను మొత్తం పోలీసులందరూ కనబరిస్తే నేరస్తులంతా వణికిపోవాల్సిందేనని కేసీఆర్ ైస్థెర్యం నింపారు.

15 రోజుల్లో ఇంటిగ్రేటెడ్ కమిషనరేట్‌కు పునాది రాబోయే 15 రోజుల్లో ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా, అత్యంత పటిష్ఠమైన టెక్నాలజీ కల్గిన ఇంటిగ్రేటెడ్ పోలీస్ హెడ్‌క్వార్టర్‌ను బంజారాహిల్స్‌లో నిర్మించేందుకు శంకుస్థాపన చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. బంజారాహిల్స్‌లో ఉన్న ఎనిమిదెకరాల్లో అన్ని హంగులతో కమిషనరేట్, ట్రాఫిక్, కమాండ్ కంట్రోల్‌సెంటర్.. ఇలా ప్రతీ వ్యవస్థ అందుబాటులో ఉండేలా భవనం నిర్మాణం ఉంటుందని తెలిపారు. మొత్తం సిటీని ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే వాచ్ చేసేలా ఉంటుందని చెప్పారు. ఇటీవల ఓ లండన్ మాజీ పోలీస్ అధికారి ఇచ్చిన ప్రజెంటేషన్ ఆశ్చర్యపరిందన్నారు. భద్రతపరంగా సీసీ కెమెరాల ఏర్పాటుపై అక్కడి ప్రజలే స్వచ్ఛదంగా ముందుకు వచ్చారని, భద్రత విషయంలో పోలీసులకన్నా ప్రజలే ముందున్నారని, వారి భద్రతే వారి రక్ష అని సదరు మాజీ అధికారి చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానన్నారు.

ఆ విషయం కలిచి వేసింది.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఓ ప్రముఖ కంపెనీ ప్రతినిధులు నన్ను కలిశారు. రానున్నకొద్ది రోజుల్లో సిటీలో తమ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయలనుకుంటున్నామని తెలిపారు. ధర్నాలు, బంద్‌ల వల్ల కాస్త ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తున్నదని చెప్పారు. అయితే తెలంగాణ వస్తే ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవని, పారిశ్రామికరంగానికి మంచి ప్రోత్సాహం ఉంటుందని వారికి చెప్పాను. అయితే ఆ సమావేశం తర్వాత కొద్ది రోజుల్లోనే దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లు జరిగి ఆ కంపెనీకి వెనక్కి వెళ్లిపోయింది. ఈ విషయం నన్ను కలిచివేసింది అని కేసీఆర్ చెప్పారు. ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకునే పోలీస్ శాఖను, లా అండ్ ఆర్డర్‌ను పటిష్టం చేస్తేనే ప్రజలు, పారిశ్రామికరంగం, కంపెనీలు అన్ని అభివృద్ధిలోకి వస్తాయన్నారు. నివ్వెర పోతున్న దేశవిదేశీ దిగ్గజాలు రాష్ట్రంలో పోలీస్‌శాఖకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యంపై పారిశ్రామికరంగాలు, దేశవిదేశీ దిగ్గజాలు నివ్వెరపోతున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. పోలీస్‌శాఖపై ఇంత మక్కువ, ఇంత దృష్టి ఏ రాష్ట్రంలో చూడలేదని దాదాపు 50మందికి పైగా ప్రతినిధులు తనతో అన్నారని తెలిపారు. ప్రజలకు అభివృద్ధి జరగాలంటే పోలీసులకు సహకరించాలని, కొన్ని కఠిన నిర్ణయాలు స్వాగతించాలని ఆయన కోరారు.

ఆడపడుచుల కళ్లలో ఆనందం చూడాలి రాష్టంలోని ఆడపడచుల కండ్లల్లో ఆనందం చూడాలని సీఎం కేసీఆర్ ఆకాక్షించారు. అందుకోసమే రాకాసి పేకాట క్లబ్బులను మూసేయాలని పోలీసులను ఆదేశించానన్నారు. తన ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించిన ఇరువురు కమిషనర్లను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. కేవలం హైదరాబాద్, సైబరాబాద్‌లోనే క్లబ్బులు మూసేయడంతో జిల్లాల్లో పేకాట జోరందుకుందని కొంత మంది ఆడపడుచులు తనకు ఫోన్ చేసి చెప్పారని కేసీఆర్ తెలిపారు. మిగతా జిల్లాల్లో కూడా పేకాట క్లబ్బులపై ఉక్కుపాదం మోపాల్సిందిగా డీజీపీ అనురాగ్ శర్మను ఆయన ఆదేశించారు. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ప్రమాదాలు జరగకుండా బస్టాప్‌లో పద్ధతి పాటించేలా చూసేందుకు త్వరలోనే ముంబైకి రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బృందం వెళుతుందని సీఎం తెలిపారు. బస్సు ప్రమాదాలను నివారించేందుకు క్యూ పద్ధతిలోనే బస్సు ఎక్కేలా అద్భుతమైన విధానాన్ని ముంబైలో అమలు చేశారన్నారు. వీటన్నింటిపై త్వరలోనే మంత్రి, అధికారులు వెళ్లి అధ్యయనం చేస్తారని తెలిపారు.

లోగో, బ్రాండింగ్ డిజైనర్లకు సత్కారం తెలంగాణ పోలీస్‌లోగో డిజైన్ చేసిన ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్‌కు పోలీస్ శాఖ తరుపున సీఎం కేసీఆర్ మెమెంటో అందజేశారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ వాహనాల బ్రాండింగ్ డిజైన్ చేసిన గోపి ఫకీరా, మోహిత్ భక్షాలకు, ఆస్కీ ప్రతినిధులు శ్రీనివాస్‌చారి, సుబ్రహ్మణ్యంకు మెమెంటో అందించారు.

ఇదీ పోలీస్ స్పిరిట్ అంటే… ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేసిన వాహనాల ప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగా సికింద్రాబాద్ వైపు నుంచి అంబులెన్స్ ఒకటి పోలీస్ వాహనాలను దాటుకొని వచ్చింది. ప్రసంగం చేస్తున్న సీఎం అంబులెన్స్‌కు దారివ్వండి అని పోలీసులకు చెప్పడంతో అందరూ పక్కకు తప్పుకున్నారు. అంబులెన్స్ వెళ్లిన వెంటనే పోలీస్ స్పిరిట్ అంటే ఇలా ఉండాలి అంటూ అభినందించారు. అందరూ ఇలా బాధ్యతతో వ్యవహరిస్తే ఎలాంటి సవాళ్లనైనా సులువుగా ఎదుర్కొంటామని కేసీఆర్ పోలీసులకు సూచించారు.

వాహనాల కాన్వాయ్‌లో స్పల్పప్రమాదం.. పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన అనంతరం వరుసగా ఇన్నోవా కార్లన్నీ సెకట్రేరియేట్ వైపుగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ జీహెఎంసీ సిగ్నల్ వద్ద రెండు ఇన్నోవా కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో స్వల్పప్రమాదం జరిగింది. రెండు ఇన్నోవా కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. పోలీస్ సిబ్బంది ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పోలీస్ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

నేర నిరోధక సిటీని కానుకగా ఇస్తా: నాయిని జూన్ 2న ప్రమాణస్వీకారం అనంతరం పరేడ్‌లో ప్రకటించిన విధంగా సీఎం కేసీఆర్ పోలీస్ శాఖపై ప్రధానంగా దృష్టి సారించారని, సేఫ్ సిటీ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపుపై ఆయన ఆశయాన్ని నేరవేరుస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. ముందుగా ప్రజలకు పోలీసుల మీద ఉన్న భయంపోవాలి. నిర్భయంగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సమస్యలు చెప్పుకోవాలి. పోలీసులు ఇక నుంచి ప్రజలతో మర్యాదపూర్వకంగా ఉండాలి అని చెప్పారు. ప్రజల మెప్పు, నమ్మకం పొందితేనే ఫ్రెండ్లీపోలీసింగ్ సాధ్యమవుతుందని హోంమంత్రి సూచించారు. నేర నిరోధక సిటీగా హైదరాబాద్‌ను చూపిస్తానని, అదే కేసీఆర్‌కు తానిచ్చే కానుకని హోంమంత్రి ప్రకటించారు.

ఇది సీఎం కేసీఆర్ విజన్: డీజీపీ అనురాగ్‌శర్మ ఏ రాష్ట్రంలో కూడా పోలీస్ శాఖకు ఇవ్వని ప్రాధాన్యాన్ని సీఎం కేసీఆర్ ఇచ్చారని డీజీపీ అనురాగ్‌శర్మ చెప్పారు. హైదరాబాద్‌ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలన్న సీఎం ఆశయాన్ని నేరవేరుస్తామని అన్నారు. తెలంగాణకు చెందిన వ్యక్తులు, తెలంగాణ కంపెనీలతోనే తాము లోగో, బ్రాండింగ్ డిజైన్ చేయించామని, స్వరాష్ట్రానికి చెందిన వారితోనే ఈ కార్యక్రమాలు నిర్వహించామని డీజీపీ ఈ సందర్భంగా తెలిపారు. పెట్రోలింగ్ వాహనాల ప్రారంభోత్సవానికి మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, నగర మేయర్ మాజీద్ హుస్సేన్, హైదరాబాద్ కలెక్టర్ ఎంకే మీనా, కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సలీమ్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, తీగల కృష్ణారెడ్డి, రాష్ట్ర సీనియర్ ఐపీఎస్ అధికారులు, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.