Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ప్రగతిబాటన పల్లె

-రాష్ట్రవ్యాప్తంగా రెండోవిడుత పల్లెప్రగతి ప్రారంభం
-వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
-సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల పాల్గొన్న మంత్రి కేటీఆర్‌
-జిల్లాల్లో ప్రగతి పనులను ప్రారంభించిన మంత్రులు, అధికారులు
-తొలిరోజున భారీగా విరాళాలు
-వర్ధన్నపేటలో రూ.22 కోట్లు ఇచ్చిన దాత
-పలు ప్రాంతాల్లో అభివృద్ధికి ముందుకు వస్తున్న ప్రముఖులు
-పంచాయతీ కార్యాలయాల ముందు కొత్త ట్రాక్టర్ల సందడి

రాష్ట్రంలో పల్లెప్రగతి రెండోవిడుత కార్యక్రమం గురువారం సందడిగా ఆరంభమైంది. తొలిరోజునే దాతల నుంచి విరాళాలు వెల్లువలా వచ్చాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో సీఎస్‌ఆర్‌ నిధుల కింద కేఎన్నార్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత జలంధర్‌రెడ్డి రూ.22 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఇదే గ్రామాన్ని విద్యాహబ్‌గా మార్చడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని.. ఇందుకోసం ఉచితంగా భూమిని ఇస్తామని ఎస్సార్‌ విద్యాసంస్థల అధినేత ప్రకటించారు. గ్రామాలకు పేరుతెచ్చే పనులను చేస్తామన్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ గ్రామంనుంచి రెండోవిడుత పల్లెప్రగతిని ప్రారంభించారు.

పలు గ్రామాల్లో మంత్రులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం ఉదయాన్నే గ్రామసభతో పల్లెప్రగతి మొదలైంది. గ్రామాల ప్రత్యేకాధికారులు.. పంచాయతీల పాలకవర్గంతో గ్రామసభను ఏర్పాటుచేసి.. పనులపై తీర్మానం చేశారు. ముఖ్యంగా అభివృద్ధి, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యమిచ్చారు. శ్రమదానాలుచేసే తేదీలను ఖరారుచేశారు. శ్రమదానాలకు గ్రామస్థులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలకు కొత్త ట్రాక్టర్లు రావడంతో పండుగ వాతావరణం నెలకొన్నది. ట్రాక్టర్లకు పూజలుచేసిన పాలకవర్గాలు.. తొలిరోజున గ్రామమంతటా తిప్పుతూ మొక్కలకు నీళ్లుపోశారు.

పల్లెప్రగతిలో పాల్గొన్న మంత్రులు
పల్లెప్రగతి రెండోవిడుత కార్యక్రమాన్ని ఆయాప్రాంతాల్లో మంత్రులు, అధికారులు ప్రారంభించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం మోహినికుంట, గంభీరావుపేట మండల కేంద్రంతోపాటు శ్రీగాధలో పల్లెప్రగతి కార్యక్రమాల్లో మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా గుండ్లపోట్లపల్లిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ప్రారంభించారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో మంత్రి హరీశ్‌రావు, నల్లగొండ జిల్లాలో వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌ నీతూకుమారి ప్రసాద్‌, నిర్మల్‌ జిల్లాలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వరంగల్‌ రూరల్‌ జిల్లా దమ్మన్నపేట, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వనపర్తి జిల్లాలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రణాళిక పనులను ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో రాష్ట్ర కార్మిక, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశాంక్‌గోయల్‌ పల్లెప్రగతి పనులను పరిశీలించారు.

విరాళాల వెల్లువ
ప్రణాళిక కార్యక్రమం నేపథ్యంలో గ్రామాలకు తరలిన అధికారులు, ప్రజాప్రతినిధులు విరాళాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామం నుంచి ఆర్థికంగా ఎదిగినవారు గ్రామాభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో దాతలు స్పందిస్తున్నారు. దీనిలో భాగంగా వరంగల్‌ రూరల్‌ జిల్లాలో పల్లె ప్రగతిని మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించిన దమ్మన్నపేటలో రూ.22 కోట్ల విరాళం వచ్చింది. అదేవిధంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రూపిరెడ్డిపల్లిలో బుచ్చిరెడ్డి కుటుంబ సభ్యులు రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరిలో హరితహారం ట్రీ గార్డుల ఏర్పాటుకుగాను పంచాయతీ కోఆప్షన్‌ సభ్యుడు కనకయ్యగౌడ్‌ రూ.54 వేలను విరాళంగా ఇచ్చారు.

అంతా పల్లెబాట
రెండో విడుత ప్రణాళికలో భాగంగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ, మండల పరిషత్‌ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు గ్రామాలకు తరిలారు. గ్రామస్థులతో కలిసి శ్రమదానాలు చేశారు. మండలస్థాయి అధికారులు మొదలుకొని.. రాష్ట్ర స్థాయి అధికారుల వరకు పల్లె ప్రగతిలో పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రణాళిక పరిశీలనకు నియమించిన ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రగతి కార్యక్రమాలను పరిశీలించారు. ఉన్నతాధికారులు ఆకస్మికంగా గ్రామాలను తనిఖీచేశారు. సంగారెడ్డి జిల్లాలో పల్లె ప్రగతిలో నిర్లక్ష్యం వహిస్తున్నారని 12 మంది అధికారులు, ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.