నరహంతక కాంగ్రెస్ వందల మంది బిడ్డలను పొట్టనబెట్టుకున్నది
ఇక్కడి కాంగ్రెస్, బీజేపోళ్లు రాహుల్‌గాంధీ, నరేంద్రమోదీ చేతిలో కీలుబొమ్మలు
ఢిల్లీ పార్టీలకు ఓటేస్తే సింగరేణి మింగేస్తరు
వారిని నమ్మి ఓటేస్తే హైదరాబాద్ ఆగమే
తెలంగాణకు ఉన్న ఒకే గొంతు కేసీఆర్..
ఎంతమంది వచ్చినా మాకు భయం లేదు
సుడిగాలి పర్యటనలో మంత్రి కేటీఆర్
లెవ్వమంటే లేస్తరు, కూసోమంటే కూసుంటరు.. ఉస్కో అంటే ఉస్కో.. డిస్కో అంటే డిస్కో.. వీళ్లకు అంతకంటే సినిమా ఉన్నదా? ఈ కాంగ్రెస్, బీజేపీ దరిద్రులు రాహుల్‌గాంధీ, నరేంద్రమోదీ చేతిలో కీలుబొమ్మలు. మళ్లొక్కసారి ఢిల్లీ చేతికి మన జుట్టు ఇచ్చి, తెలంగాణకు ఉన్న ఒక్క గొంతు కేసీఆర్‌ను వదులుకుంటే నాశనం అయ్యేది, నష్టపోయేది తెలంగాణ సమాజమే.
1956లో ఉన్న తెలంగాణను ఊడకొట్టిందే కాంగ్రెస్. తెలంగాణకు ఆంధ్రకు ఇష్టం లేని లగ్గం చేసిందే ఈ ఢిల్లీ దొర రాహుల్ ముత్తాత నెహ్రూ. 1968లో 370 మంది పిల్లలను పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీయే. 1971లో తెలంగాణ ప్రజలు 11మంది ఎంపీలను గెలిపిస్తే.. వాళ్లందరినీ గొర్రెల్లా గుంజుకుపోయి కాంగ్రెస్‌లో కలిపి ప్రజల ఆశలను తుంగలో తొక్కింది ఇందిరమ్మ.
-మంత్రి కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో/ మంచిర్యాల, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉద్యమంలో వందల మంది మన బిడ్డలను పొట్టనబెట్టుకున్న హంతక, నరహంతక కాంగ్రెస్‌ను క్షమిద్దామా? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు ప్రశ్నించారు. 1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని, తెలంగాణకు, ఆంధ్రకు ఇష్టం లేని లగ్గం చేసింది ఢిల్లీ దొర రాహుల్‌ముత్తాత నెహ్రూ అని విమర్శించారు. 14 ఏండ్లు కొట్లాడి, రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ మనదైతే.. 58 ఏండ్లు చావకొట్టింది కాంగ్రెస్ అని విరుచుకుపడ్డారు. ఆ దిక్కుమాలిన దరిద్రం కాంగ్రెస్‌ను మళ్లా తెచ్చుకుందామా? దరిద్రానికి నేస్తమైన హస్తాన్ని నెత్తిన పెట్టుకుందామా? ఆలోచించాలని పిలుపునిచ్చారు. మేమే వందల మంది తెలంగాణ పొలగాండ్లను చంపినమని కాంగ్రెస్ నేత చిదంబరం ఇప్పుడు సారీ చెప్తున్నడని, ఈ దిక్కుమాలిన పార్టీని క్షమిద్దామా? ఆలోచించాలని కోరారు. శుక్రవారం జూబ్లీహిల్స్,ఖైరతాబాద్, మంచిర్యాల నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, దివాకర్‌రావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలు, ఖానాపూర్ నియోజకవర్గం జన్నారంలో అభ్యర్థి జాన్సన్‌నాయక్‌కు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెసోళ్లకు, బీజేపోళ్లకు టికెట్లు ఏడిస్తరు? బీఫామ్‌లు ఏడిస్తరు? వాళ్లకు పంచాయితీలైతే ఏడికిపోవాలే? రేపు ఏదైనా కొత్తవిధానం తీసుకురావాలంటే ఏడికిపోవాలే? బాత్‌రూమ్‌కు పోవాలంటే ఎవర్ని అడగాలే? ప్రశ్నిస్తే.. ఢిల్లీకి పోవాలే, ఢిల్లీ పెద్దలను అడగాలనే సమాధానా లు జనం నుంచి వచ్చాయి. దీనికి కేటీఆర్ మరి గిసొం టి సన్నాసులు మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచన చేయాలె. రేపు సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని కాంగ్రెసోళ్లు, బీజేపోళ్లు అనుకుంటే ఆపడం ఇక్కడున్న సిపాయిలతో అవుతుందా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ కమిట్‌మెంట్ రాహుల్, మోదీకి ఉంటదా?
చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు ఉండే కమిట్‌మెంట్ రాహుల్, మోదీకి ఎందుకు ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రియల్ ఎస్టే ట్ బ్రోకర్ల చేతుల్లో, ఓటుకు నోటు కేసులో దొంగల చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ఆగం కాకుండా ఉంటుం దా? అని ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ కావా ల్నా.. కాంగ్రెస్ కావాల్నా? ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. మనందరం శివరాత్రికే జాగారం చేస్తాం కానీ, కాంగ్రెస్ హయాంలో రైతులు ప్రతి రాత్రీ జాగారమే చేసేటోళ్లు అని గుర్తుచేశారు. ఇవాళ రేవంత్.. తెలంగాణలో ఉండే బీద, బిక్క రైతుల ముఖాలకు 24 గంటల కరెంట్ ఎందుకు? 3 గంటలు చాలు.. 10 హెచ్‌పీ మోటర్ పెడితే 3 ఎకరాలు పారుతది అని చెప్తున్నడని, ఇవి వ్యవసాయం మీద సోయి ఉన్నోడు మాట్లాడే మాటలేనా? ఆలోచించాలని కోరారు. అందుకే నేను ఒక్కటే అడుగుతున్నా.. కరెంట్ కావాల్నా.. కాంగ్రెస్ కావాల్నా.. ఆలోచించుకోవాలని సూచించారు.
కరెంట్ గురించి మాట్లాడేందుకు కాంగ్రెసోళ్లకు సిగ్గు ఉండాలి. సీఎం కేసీఆర్ 24 గంటలు ఇస్తుంటే రేవంత్ కనపడత లేదంటా. నాకు తెల్వక అడుగుతా.. ఎక్కడన్న కరెంట్ కనపడతదా? రేవంత్ మంచిర్యాల లేదా ఖానాపూర్‌లో ఏ గల్లీకైన పోయి వైర్లను పట్టుకుంటే కరెంట్ ఉందో లేదో తెలిసిపోవడంతోపాటు రాష్ట్రానికి దరిద్రం కూడా పోతది.
– మంత్రి కేటీఆర్
కులం కుంపటి లేదు.. మతం మంటలు లేవు..
కేసీఆర్ ప్రభుత్వ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో కులం కుంపట్లు, మతం మంటలు లేవని.. ప్రాంతం పేరుతో పంచాయతీ పెట్టలేదని, హైదరాబాద్ నగరం చాలా ప్రశాంతంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ఉన్నోళ్లంతా మా వారే, మా బిడ్డలే అని చూసుకున్నామని స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్ పాలనలో కరెంట్ కష్టాలు లేవని, కంపెనీలు వచ్చి సంపద పెరుగుతున్నదని, ఉపాధి దొరుకుతుందని స్పష్టంచేశారు. దేశంలోని లక్షల మందికి అమ్మలా అన్నం పెడుతున్న హైదరాబాద్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అంటేనే కల్లొలం అని, ఒక్క సీఎంను దించడానికి పాతబస్తీలో మతకల్లొలాలు లేపి 400 మంది ప్రాణాలు తీసుకున్న చరిత్ర ఆ పార్టీది అని ధ్వజమెత్తారు. వారికి ప్రజలపై ఆరాటం ఉండదని, కుర్చీల కోసం ఒకరి కాలు ఒకరూ లాక్కునేందుకు సమయం సరిపోతుందని చెప్పారు. 11 సార్లు అవకాశం ఇస్తే ఏం చేయని కాంగ్రెసోళ్లు.. ఇప్పుడు ఒక్క ఛాన్స్ అంటూ వస్తున్నారని? అన్నారు. పొరపాటున తప్పు చేస్తే ఆ పాత చీకటి రోజులు తిరిగి వస్తాయని, మళ్లీ కరెంట్ కోతలు, కంపెనీల మూతలు, ఛార్జీల మోతలు తయారైతది కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ వస్తే హైదరాబాద్ ప్రగతి కుక్కలు చింపిన విస్తరే అవుతుందని అన్నారు. కాంగ్రెస్ వస్తే అస్థిర పాలన వస్తోందని, పెట్టుబడులు ఆగిపోతాయన్నారు.
కాంగ్రెస్‌లో 11 మంది సీఎంలు
కాంగ్రెస్‌లో ఏ ఒక్క నాయకుడికైనా సీఎం కేసీఆర్ లాంటి విజన్ ఉన్నదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ పార్టీలో ఇప్పుడే 11 మంది సీఎంలు ఉన్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ కలకత్తాకు వెళ్లి మమతబెనర్జీ బీజేపీకి బీటీం అని, ఢిల్లీకి వచ్చి కేజ్రివాల్ బీజేపీకి బీటీం, తెలంగాణకు వచ్చి బీఆర్‌ఎస్ బీటీం అం టున్నారని.. బీఆర్‌ఎస్ ప్రజలకు మాత్రమే బీటీం అ ని స్పష్టంచేశారు. బీజేపీకి ఇక్కడ డిపాజిట్ కూడా రా దని అన్నారు. కేసులతో బెదిరిస్తే భయపడేది లేదని, ఢిల్లీ వాళ్లకు మెడలు వంచేది లేదని, భవిష్యత్తులో ప్రజల ఆశీర్వాదం ఉంటే ఢిల్లీలో కూడా గులాబీ జెం డా ఎగురవేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు ఒరిగేదేమి లేదని, వారిని ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలనలో 1,250 కోట్లను మైనార్టీల అభ్యున్నతికి ఖర్చు చేశామని స్పష్టంచేశారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ను చూసి ప్రముఖులు మురిసిపోతున్నారని, ఇక్కడి దరిద్రులకు నచ్చడం లేదని అన్నారు. అధికారంలోకి వ స్తే ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న మో దీ.. ఇప్పుడు ఆ ముచ్చటే మరిచిపోయారన్నారు.
ఇవాళ ఒక్క కేసీఆర్‌ను కొట్టేందుకు దేశంలోని సిపాయిలందరూ దిగుతున్నారు. మోదీ, అమిత్‌షా, యోగీ ఆయన వెనుకో బోగీ.. అందులో ఓ 15 మంది ముఖ్యమంత్రులు, 15 మంది కేంద్ర మంత్రులు ఇలా చాలా మంది గొప్పగొప్పోళ్లు ఒక దిక్కు దిగుతున్నారు. ఇంకో దిక్కు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, డీకే శివకుమార్ ఇంకా పెద్దపెద్ద షేర్లు, శంషేర్లు, బబ్బర్‌ఖాన్‌లు, తీస్మార్‌ఖాన్‌లు దిగుతున్నారు. సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుందని, కేసీఆర్ సింహంలాంటోడు కాబట్టే సింగిల్‌గానే వస్తున్నడు. గుంపులుగా ఏం వస్తాయో మీకే తెలుసు.
– మంత్రి కేటీఆర్
వచ్చే టర్మ్‌లో 24 గంటల తాగునీరు
హైదరాబాద్‌లో వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, వచ్చే టర్మ్‌లో 24 గంటల తాగునీరిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. డ్రైనేజీ, చెరువులను బాగుపర్చుకుందామని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క మహిళకు సౌభాగ్య లక్ష్మి పేరిట ప్రతి నెల రూ.3 వేలు, ఆసరా పెన్షన్లు పెరుగుతాయని, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అన్నపూర్ణ పథకం ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా.. ఇంటింటికి ధీమా కార్యక్రమం ద్వారా రూ. 5లక్షల జీవితబీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. మోదీ పాలనలో రూ.400 సిలిండర్ రూ.1,200కు చేరిందని.. డిసెంబర్ 3 తర్వాత పెంచిన రూ.800లను కేసీఆర్ ప్రభుత్వమే భరించి ఆడబిడ్డలకు రూ.400లకే సిలిండర్లు అందజేస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ విశ్వనగరం కావాలన్నా, మరిన్ని వసతులు కల్పించాలన్నా స్థిరమైన ప్రభుత్వం, దృఢమైన నాయకత్వాన్ని ప్రోత్సహించాలని కోరారు. అలకలు, అసంతృప్తులు ఎక్కడైనా ఉంటాయనీ, అలిగిన, గులిగిన ఓటు గుద్దుడు మాత్రం బీఆర్‌ఎస్‌కే ఉండాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, మంచిర్యాల, ఖానాపూర్, చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థులు దివాకర్‌రావు, జాన్సన్‌నాయక్, బాల్క సుమన్, జూబ్లీహిల్స్ ఎన్నికల ఇంఛార్జి కట్టెల శ్రీనివాస్‌యాదవ్, బీఆర్‌ఎస్ నేత పీ విష్ణువర్ధన్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎన్నికల ఇన్‌చార్జి కోలేటి దామోదర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.