-ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికే ప్రాధాన్యం -భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం -బడ్జెట్ సమావేశాల తర్వాత నగరాల్లో పర్యటిస్తా -తనను కలిసిన ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలను విస్తృతంగా అభివృద్ధిచేసే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాలపై దృష్టి సారిస్తామన్నారు. మంగళవారం సచివాలయంలో తనను కలిసిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో మాట్లాడారు. రేపటి తెలంగాణలో కీలకనగరాలుగా ఈ ఐదు ఉంటాయన్నారు. ఈ క్రమంలో నగరాల అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పారు.
హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని అసెంబ్లీ, రాజ్‌భవన్, సీఎం నివాసాలముందే చిన్న వర్షం వచ్చినా నీళ్లు నిలిచిపోతున్నాయని చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దడానికి రూ.10వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేసినట్లు తెలిపారు. ఖమ్మంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేదని చెప్పారు. కరీంనగర్, నిజామాబాద్ నగరాల్లో ఆ వ్యవస్థ సరిగ్గా లేదని అన్నారు. అందుకే ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిందన్నారు. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌కూడా సమగ్రాభివృద్ధి సాధించాలని కేసీఆర్ అభిలషించారు. ఖమ్మం పట్టణం నలువైపులా విస్తరిస్తుందని, దానికికూడా నగర స్వరూపం వస్తుందని అన్నారు.
రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, చింతకాని తదితర మండలాలకు ఖమ్మం పట్టణం విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నల్లగొండకుకూడా అదేస్థాయి ఉందన్నారు. అయితే మౌలికసదుపాయాల్లో వెనుకబడి ఉందని, దానిని అభివృద్ధిపథాన నడిపేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. నగరాల్లో ప్రతి మనిషికి రోజుకు 135 లీటర్ల వంతున మంచినీరు ఇవ్వాల్సి ఉందన్నారు. అలాగే రహదార్లు, డ్రైనేజీ వ్యవస్థలను పటిష్ఠం చేసుకోవాలని సూచించారు.
రామగుండం మాదిరిగానే కొత్తగూడెం కూడా అభివృద్ధి చెందుతుందని, అక్కడ 4 వేల మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ త్వరలోనే వస్తుందని సీఎం అన్నారు. దీనివల్ల 10 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని హామీ ఇచ్చారు. కొత్తగూడెంలో టౌన్‌షిప్ అభివృద్ధి చెందుతుందని, దానికి అవసరమైన సదుపాయాలను కల్పిస్తామన్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత తానే స్వయంగా ఈ నగరాల్లో పర్యటిస్తానన్నారు.
ఖమ్మం అభివృద్ధిపై సీఎం సానుకూలంగా స్పందించారు: పువ్వాడ అజయ్
ఖమ్మం జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తెలిపారు. సీఎంను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం పట్టణాన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును కలువగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రావాలని చెప్పినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకురాగా హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో ఉన్న మిగతా పట్టణాలను, కార్పొరేషన్లను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఖమ్మంజిల్లా అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని, త్వరలో జిల్లాలో పర్యటిస్తానని చెప్పినట్లు తెలిపారు.
సీఎంను కలిసిన 25 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
తెలంగాణ పునర్నిర్మాణంలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సూచనలు, సలహాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఇందుకోసం త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని అన్నారు. మంగళవారం సచివాలయంలో వివిధ పార్టీలకు చెందిన 25మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంను కలిశారు.
రాష్ట్ర అభివృద్ధికోసం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. వాటర్ గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ తదితర కార్యక్రమాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి వివరించి ఈ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని కోరారు. పెన్షన్ పెంచాలన్న వారివిజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. వారికి పూర్తి స్థాయి మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో గృహ వసతి కల్పించాలన్న విజ్ఞప్తికి కూడా సానుకూలంగా స్పందించారు.