రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు జరుగనున్న ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్ ప్రచారం జోరందుకుంది. నామినేషన్ల గడువు ముగియడంతో మూడు రోజులుగా గులాబీ పార్టీ అభ్యర్థులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఈనెల 3 నుంచి కళాశాలలు, 5వ తేదీ నుంచి పాదయాత్రలు, ఇతరత్రా సమావేశాల రూపంలో మరింత విస్తృత ప్రచారం చేపట్టనున్నారు. ఈ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి, పట్టభద్రులను స్వయంగా కలుస్తున్నారు.

-ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార రంగంలోకి దిగిన మంత్రులు, ప్రజాప్రతినిధులు -విస్తృతంగా పర్యటిస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు దేవీప్రసాద్, పల్లా ఆయా జిల్లాల్లోని వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో తెలంగాణ ట్రెజరీ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డం జంగయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్ హాజరయ్యారు. మరోవైపు వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా ఉధృతంగా ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావుతోపాటు ఆ జిల్లా ఎమ్మెల్యేలు మదన్‌లాల్, కోరం కనకయ్యతో కలిసి జిల్లా కేంద్రం, ఇల్లెందు, వైరాల్లో ప్రచారాన్ని ముగించారు.
ఆదివారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన వరంగల్‌లో అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రి చందూలాల్, జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అధ్యక్షతన నల్లగొండ జిల్లా ఆలేరులో కూడా సమావేశాన్ని నిర్వహించారు.
మూడు జిల్లాల నేతలతో కేటీఆర్ భేటీ హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలతో పర్యాటకశాఖకు చెందిన హరిత ప్లాజా హోటల్‌లో ఆదివారం రాష్ట్ర మంత్రి కే తారకరామారావు సమావేశం నిర్వహించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ప్రచార సరళి ఎలా ఉండాలనే విషయంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధితో ముడిపడి ఉన్న ఎన్నికలైనందున భారీ విజయాన్ని నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కృషి చేస్తున్న అంశాన్ని గ్రేటర్‌లోని పట్టభద్రుల ముందుంచాలని నిర్ణయించారు. మెదక్ ఉప ఎన్నిక, కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలతో ఉన్న అనుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేతలకు మంత్రి సూచించారు.
కళా బృందాల హోరు… టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారంలో కళా బృందాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చుకోవాలంటే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు వెన్నుదన్నుగా నిలవాలని.. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ప్రచారంలో వివరిస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున టీఎన్జీవో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం ప్రత్యేకంగా కళా బృందాలను ఏర్పాటు చేసి, ప్రచారాన్ని నిర్వహించనున్నారు. అభ్యర్థుల ఉద్యమ నేపథ్యాన్ని వివరిస్తూ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రుల్లోకి తీసుకువెళ్లనున్నారు.