– పీహెచ్‌సీల్లో డాక్టర్ల పనితీరులో మార్పుతెస్తాం – ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం – డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య

ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని, పీహెచ్‌సీల్లో డాక్టర్ల పనితీరులో మార్పు తెస్తున్నామని డిప్యూటీ సీఎం డాక్టర్ టీ రాజయ్య తెలిపారు. గురువారం వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌ఫూర్ మండలం తాటికొండలో రూ.70 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చాలనే ధ్యేయంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. పీహెచ్‌సీలను 40 పడకల దవాఖానలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల దవాఖానలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
ప్రతి ఆపరేషన్ నియోజకవర్గస్థాయి దవాఖానల్లో జరిగేలా సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానకు పీఎంఎస్‌ఎస్‌వై పథకం కింద రూ.151 కోట్లు మంజూరు చేశామని, రూ.23 కోట్ల తో పిల్లల బ్లాక్‌ను ప్రారంభించామన్నారు. ఇకపై ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని, డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పాముకాటు, తేలుకాటుకు మందులను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. దవాఖానల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు ఉండాలని ఆదేశించారు. గతంలో రెండు రోజులకు మందులు ఇచ్చేవారని, ప్రస్తుతం వారం రోజుల వరకు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రసూతి జరిగిన మహిళలకు వెంటనే ప్రభుత్వం రూ.వెయ్యి పారితోషికాన్ని ఇస్తున్నదన్నారు.
దసరా నుంచి వృద్ధులు, వింతంతువులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్ అందించనున్నట్లు తెలిపారు. రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తున్నామని, దళితులకు మూడెకరాల భూమిని ఇస్తున్నామన్నారు. సర్పంచ్ సంధ్య అధ్యక్షత నిర్వహించిన సభలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఆరోగ్య శాఖ డైరక్టర్ డాక్టర్ సాంబశివరావు, జిల్లా అదనపు జేసీ కృష్ణారెడ్డి, ఆర్డీవో వెంకటమాధవరావు, ఎంపీపీ జగన్మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ భూక్యా స్వామినాయక్, తహసీల్దార్ రామ్మూర్తి, ఎంపీడీవో సంపత్‌రావు, వైద్యశాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్‌రావు, ఇన్‌చార్జి జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరాం పాల్గొన్నారు.