-గతంలో కంటే ఎక్కువ గెలిచాం.. ఫలితాలు సంతృప్తికరం -పరిషత్, సాధారణ ఎన్నికల్లో విజయం మాదే
-పొన్నాలను చూసి జనగామలో కాంగ్రెస్‌కు ఓట్లేయలేదు
-టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్: మున్సిపల్ ఎన్నికలు చూసి సంబురాలు చేసుకుంటున్న పొన్నాల లక్ష్మయ్యకు పరిషత్, సాధారణ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు కర్రుకాల్చి వాతలు పెడతారని టీఆర్‌ఎస్‌ఎల్‌పీ మాజీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సాధారణ ఎన్నికల్లో 100శాతం ఫలితాలు టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉంటాయని తెలిపారు. జనగాం మున్సిపాలిటీ ఫలితాలను చూసి పొన్నాల చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడని, సాధారణ ఎన్నికల్లో ఆయనకు ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టబోతున్నారని తెలిపారు. సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఆయనేం మాట్లాడతారో చూద్దామని తెలిపారు.
సోమవారం తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఫలితాలు తాము ఊహించినవేనని, గతంతో పోల్చితే తాము మెరుగైన ఫలితాలు సాధించామని తెలిపారు. రాజకీయనాయకులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు టీఆర్‌ఎస్ పక్షాన నిలిచారని, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. సాధారణ ఎన్నికల ఫలితాల తరువాత టీఆర్‌ఎస్ పార్టీనే తెలంగాణను పాలిస్తుందని తెలిపారు. ఇంకా వెకిలిమాటలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. గజ్వేల్ మున్సిపాలిటీని టీఆర్‌ఎస్ చేజిక్కించుకుంటుందని, ఈ ఫలితానికి, కేసీఆర్ పోటీని కలిపిచూడడమంటే బోడి గుండుకు, మోకాలికి ముడిపెట్టినట్లే అవుతుందన్నారరు.
పొన్నాల 2009లోనే ఓడిపోయాడని, ఇప్పుడుకూడా ప్రజలు పొన్నాలను చూసి జనగామలో ఓట్లువేయలేదని చెప్పారు. తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో తెలంగాణవాదం బలంగా ఉందని, అయితే తెలంగాణవాదానికి, స్థానిక సమస్యలకు ముడి పెట్టొద్దని అన్నారు. గతంలో టీఆర్‌ఎస్ పార్టీకి ఇన్ని స్థానాలు కూడా లేవని, అదే సమయంలో పార్టీ తరపున ఎవరూ ప్రచారం కూడా చేయలేదని చెప్పారు. కేసీఆర్ కూడా స్థానిక ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకోలేదని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు వాస్తవానికి క్యాంపులు నిర్వహించాల్సిన కర్మ లేదని, టీడీపీ, కాంగ్రెస్ నేతల ప్రలోభాల నుంచి తమవారిని రక్షించుకోవాల్సి ఉందన్నారు.
తాము 40 సీట్లు గెలిచినా టీఆర్‌ఎస్ నుంచి 20 మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారని ఇటీవల పొన్నాల చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. తెలంగాణలోని ఎక్కువ మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితి ఉందని, వీటిల్లో ఎక్కువ చైర్మన్ పదవులను తామే గెలుస్తామని తెలిపారు. మున్సిపాల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ రెండో స్థానంలో ఉంటుందని, పరిషత్, సాధారణ ఎన్నికల్లో తమదే విజయమని అన్నారు.