-బైక్‌కు ఒకవైపు బాక్స్, మరోవైపు కిట్ బ్యాగ్ ఉండాలి -స్వల్పమార్పులు సూచించిన సీఎం కేసీఆర్ -క్యాంప్ కార్యాలయంలో వాహనాల పరిశీలన
అత్యాధునిక పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పరిశీలించారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ విభాగాల పెట్రోలింగ్ ఇన్నోవా కార్లు, ఒక మోటార్ బైక్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలన నిమిత్తం డీజీపీ అనురాగ్ శర్మ ఆదివారం క్యాంప్ కార్యాలయానికి తీసుకువచ్చారు. వాహనాలను పరిశీలించిన సీఎం పలు మార్పులు సూచించారు. బ్రాండింగ్, లోగో వేసే ప్రాంతం, సైజ్, అక్షరాలపై మార్పులు చేయాలన్నారు. లోగో, పోలీస్ అక్షరాల సైజ్ పెంచాలని సూచించారు.
దూరం నుంచి కూడా పోలీస్ అనే పదం కనిపించేలా ఉండాలన్నారు. మోటార్ బైక్‌కు లోగో అమర్చిన స్థానంలో కిట్ బ్యాగ్ ఏర్పాటుచేసేలా చూడాలన్నారు. అంటే ఒకవైపు బాక్స్, మరో వైపు కిట్ బ్యాగ్ ఉంటే బాగుంటుందని సీఎం సూచించారు. ఈ సందర్భంగా వాహనాలకు బ్రాండింగ్, డిజైనింగ్ చేసిన పలు కంపెనీ ప్రతినిధులను సీఎం కేసీఆర్ అభినందించారు. వాహనాలను పరిశీలించిన వారిలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, పీఅండ్‌ఎల్ ఐజీ నవీన్‌చంద్, ఇంటెలిజెన్స్ ఎస్పీ రమేష్ ఉన్నారు.