Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పోలవరంపై పోరెత్తిన తెలంగాణ బంద్

-సంపూర్ణం.. ప్రశాంతం -కేసీఆర్ పిలుపుతో కదిలిన యావత్ తెలంగాణ -అక్రమ ఆర్డినెన్స్‌పై సర్వత్రా నిరసన -కేంద్రంపై వెల్లువెత్తిన ఆగ్రహం -నడువని బస్సులు, సాగని ఆఫీసులు -ధర్నాలతో హోరెత్తించిన సబ్బండ వర్ణాలు -ర్యాలీలతో కదంతొక్కిన గులాబీ శ్రేణులు -స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వాణిజ్య, వ్యాపార వర్గాలు -ఆర్డినెన్స్‌ను వెనుకకు తీసుకునేదాకా పోరు ఆగదు -ముక్తకంఠంతో హెచ్చరించిన తెలంగాణ ప్రజానీకం

-తెలంగాణవ్యాప్తంగా బంద్ సంపూర్ణం -ముంపును తెలంగాణలోనే ఉంచాలి: టీఆర్‌ఎస్ -కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై వెల్లువెత్తిన ప్రజాగ్రహం -మోడీ, వెంకయ్య, చంద్రబాబు దిష్టిబొమ్మల దహనం -స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసిన వ్యాపారులు -నల్లబ్యాడ్జీలతో సింగరేణి కార్మికులు, ఉద్యోగుల నిరసన -వాయిదాపడ్డ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు -బంద్‌లో పాల్గొన్న సీపీఐ, సీపీఎం, న్యూ డెమోక్రసీ

చేయి చేయి కలిసింది! పదం పదం కదిలింది! కుట్రల కత్తులకు ఎదురొడ్డి బంద్ జెండా ఎగిరింది! అక్రమ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఊరూవాడా నినదించింది! పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలిపేందుకు కేంద్ర సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని యావత్ తెలంగాణ జాతి ముక్తకంఠంతో నిలదీసింది! కుయుక్తులు సాగవంటూ గురువారం పదిజిల్లాల తెలంగాణ ప్రజలు బంద్ పాటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇచ్చిన పిలుపుమేరకు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. సబ్బండ వర్ణాలు తమ నిరసన గళం వినిపించాయి. ఆదిలాబాద్ మొదలు.. ఖమ్మం శివారు ప్రాంతాలవరకు అంతా బంద్! బస్సులు నడవలేదు! ఆటోలు నడవలేదు! ఆఫీసులు నడవలేదు! ఖార్ఖానాలు నడవలేదు! బడులూ నడవలేదు! ఎటుచూసినా బంద్!! అంతా సంపూర్ణం.. ప్రశాంతం!!

TRS Party band1 (1)ఖమ్మం జిల్లాలో పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన బంద్ పిలుపునకు యావత్ తెలంగాణ మద్దతు తెలిపింది. పది జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. టీఆర్‌ఎస్ నాయకులు తెల్లవారుజాము నుంచే తెలంగాణవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాలకు దిగారు. పది జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ కార్మికులే స్వచ్ఛందంగా బస్సులు బంద్ చేసి తమ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి చాటిచెప్పారు. వ్యాపార వాణిజ్య సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి.

ఉద్యోగులు విధులు బహిష్కరించి.. కార్యాలయాల ఎదుట నినాదాలు చేశారు. అత్యవసర సర్వీసులు మినహా అన్ని విభాగాల్లో బంద్ కొనసాగింది. ప్రజా, విద్యార్థి, న్యాయవాద, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కులసంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించడమే కాకుండా ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. సీమాంధ్రకు మేలు జరిగేలా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీకీ కాబోయే సీఎం చంద్రబాబు కుట్ర పన్నారని తెలంగాణవాదులు నిప్పులు చెరిగారు. ఆర్డినెన్స్‌ను వెనక్కితీసుకోవాలని.. అంతవరకు తమ పోరాటం ఆగదని వారు తేల్చిచెప్పారు.

TRS Party band1 (2)సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్టాండు ఎదుట టీఆర్‌ఎస్ నాయకులు ఈటెల రాజేందర్, కనకారెడ్డి ఆందోళన చేపట్టారు. పాతబస్తీలో కూడా బంద్ సంపూర్ణంగా జరిగింది. మెదక్ జిల్లా సంగారెడ్డి బస్సు డిపో ఎదుట సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కార్యకర్తలతో కలిసి ధర్నా చేపట్టారు. ఖమ్మం బస్సు డిపో ఎదుట టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. నిజామాబాద్‌లోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గణేశ్‌గుప్తా, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి మేలు చేసే పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలోని ఏడు ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రం ఆర్డినెన్స్‌ను జారీచేయడంపై తెలంగాణ భగ్గుమన్నది. సీమాంధ్ర ప్రయోజనాల కోసం తెలంగాణలోని గిరిజనులకు గూడు లేకుండా చేయడంపై ఆగ్రహం వ్యక్తమైంది. కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్‌ఎస్ అధినేత, కాబోయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణవ్యాప్తంగా గురువారం కనీవినీ ఎరగని రీతిలో బంద్ సంపూర్ణమైంది. పదిజిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

TRS Party band1 (3)ఆర్టీసీ కార్మికులే స్వచ్ఛందంగా బస్సులు బంద్ చేశారు. వ్యాపార వాణిజ్యసంస్థలు పూర్తిగా మూసివేశారు. ఇబ్బందులు ఎదురైనా అన్నివర్గాల ప్రజలు బంద్ లో పాల్గొని మద్దతు ప్రకటించారు. ఉద్యోగులు విధులు బహిష్కరించారు. సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అత్యవసర సర్వీసులు మినహా అన్ని విభాగాల్లో బంద్ కొనసాగింది.

ప్రజా, విద్యార్థి, న్యాయవాద, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కులసంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించడమే కాకుండా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. బంద్‌కు సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ మద్దతు ప్రకటించడంతోపాటు బంద్‌లో పాల్గొన్నాయి. సీమాంధ్రకు మేలు చేసేలా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీకీ కాబోయే సీఎం చంద్రబాబునాయుడు కుట్ర పన్నారని తెలంగాణవాదులు మండిపడ్డారు. ఇద్దరునాయుళ్లు, ప్రధాని మోడీ, కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, ఆగ్రహం, ఆవేదన కేంద్రానికి తెలిసేలా బంద్ కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్డినెన్స్ వెనక్కితీసుకోవాలని..అప్పటి వరకు పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.

కరీంనగర్‌లో కదం తొక్కిన టీఆర్‌ఎస్ నేతలు: కరీంనగర్ జిల్లాలో 11 డిపోల పరిధిలో బస్సు పయ్య కదల్లేదు. కరీంనగర్ బస్టాండ్ ఎదుట ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. కోరుట్ల, మంథని, చొప్పదండి ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, పుట్ట మధు, బొడిగ శోభలు తమ నియోజకవర్గాల్లో బంద్‌లో పాల్గొన్నారు.పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌ర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పార్టీ నగర అధ్యక్షుడు సర్దార్ రవీందర్‌సింగ్‌తోపాటు కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, పార్టీ నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. గోదావరిఖనిలో సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. టీఆర్‌ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రూప్‌సింగ్ ఆధ్వర్యంలో బంద్ చేయించారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, సీపీఐ, సీపీఎం కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. మెట్‌పల్లి బంద్‌లో కోరుట్ల ఎమ్మెల్యే కే విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. మంథని బంద్‌లో ఎమ్మెల్యే పుట్టమధు పాల్గొన్నారు.

TRS Party band1 (4)వరంగల్‌లో బంద్ సంపూర్ణం: హన్మకొండ అదాలత్ సెంటర్‌లోని అమరవీరుల స్తూపం వద్ద కేంద్రం దిష్టిబొమ్మను తుడుందెబ్బ ఆధ్వర్యంలో దహనం చేశారు. వరంగల్‌లో ఎంపీ కడియం శ్రీహరి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండాసురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు ఆధ్వర్యంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్, మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేయూలో ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ, పీజీసెట్ ఎంట్రెన్స్ పరీక్షలను వాయిదా వేశారు.

కోల్‌బెల్ట్‌లో నల్లజెండాలతో నిరసన: ఆదిలాబాద్ జిల్లాలో జనజీవనం స్తంభించింది. జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదులు నిరసనలతో హోరెత్తించారు. 680 బస్సులు డిపోలకే పరిమితమవగా, సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్ బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే జోగురామన్న పాల్గొన్నారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. టీపీఎఫ్ ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తాలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. కాగజ్‌నగర్ పట్టణంలో బీఎస్పీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది.

మెదక్‌లో హోరెత్తిన నిరసన : మెదక్ జిల్లాలో బంద్‌కు జేఏసీ, సీపీఐ, సీపీఎం, టీఎన్జీవో, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా పాల్గొని బంద్‌ను జయప్రదం చేయించారు. జిల్లాలో ఏడు డిపోలకు చెందిన 554 ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. 3 వేల మంది ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. జిల్లావాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు నిర్వహించి ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు, వెంకయ్యనాయుడుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. పటాన్‌చెరు, సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్ ప్రాంతాల్లోని అన్ని రకాల పరిశ్రమలు కూడా బంద్ పాటించాయి.

కదం తొక్కిన ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని 645 ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. అన్నివర్గాల ప్రజలు బంద్‌కు మద్దతు పలకటంతో జిల్లాలో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. టీఆర్‌ఎస్, న్యూడెమోక్రసీ, సీపీఎం, సీపీఐ శ్రేణులు తెల్లవారుజామునే రోడ్డెక్కాయి. నియోజకవర్గాల కేంద్రాల్లో రాజకీయ పార్టీలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు భారీ ప్రదర్శనలు నిర్వహించాయి. జిల్లాకేంద్రం ఖమ్మంలో టీజీవో, టీఎన్జీవో, ఇతర శాఖల్లోని తెలంగాణ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట భారీ మానవహారం చేపట్టారు. ప్రధాని మోడీ, చంద్రబాబు, వెంకయ్యనాయుడుల దిష్టిబొమ్మలు దహనం చేశారు.

నిజామాబాద్‌లో వెల్లువెత్తిన నిరసన: నిజామాబాద్ జిల్లాలో బస్సులు బయటకు రాలేదు. వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.నిజామాబాద్ బస్టాండ్ ఎదుట ఆందోళనలో ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్‌గుప్తా, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఈగగంగారెడ్డి పాల్గొన్నారు. సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. కామారెడ్డిలో ఎమ్మెల్యే గంపగోవర్ధన్ ఆధ్వర్యంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు.

నల్లగొండలో స్వచ్ఛందంగా బంద్: నల్లగొండ జిల్లాలో 724 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. జిల్లాకేంద్రంలో ఆర్టీసీ డిపోఎదుట ధర్నాలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, చకిలం అనిల్‌కుమార్‌తోపాటు చాడ కిషన్‌రెడ్డి, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు నంద్యాల నర్సింహారెడ్డి, మల్లేపల్లి ఆదిరెడ్డి పాల్గొన్నారు. భువనగిరిలో బంద్‌లో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. గుట్టలో ఎమ్మెల్యే గొంగిడి సునీత బంద్‌లో పాల్గొని నిరసన తెలిపారు.

పోలరణంకు పాలమూరు మద్దతు: మహబూబ్‌నగర్ జిలార్ల ఎనిమిది డిపోల్లో ఒక్కబస్సు రోడ్డెక్కలేదు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపోఎదుట బైఠాయించి బైక్‌ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి జాతీయ రహదారిపై బైఠాయించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ నిరసనలోపాల్గొన్నారు. కొల్లాపూర్ కల్వకుర్తి, మక్తల్, గద్వాల నియోజకవర్గంలో నిరసనలు కొనసాగాయి.

రాజధాని, రంగారెడ్డిలో బోసిపోయిన రహదారులు: తెలంగాణవాదుల నిరసనలతో హైదరాబాద్ నగరం హోరెత్తింది.తెల్లారకముందే తెలంగాణవాదులు రోడ్డెక్కి బస్సులను డిపోల నుంచి కదలనివ్వలేదు. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందగా మూసివేశారు.

ఓయూ, జేఎన్‌టీయూ, అంబేద్కర్ ఓపెన్‌యూనివర్శిటీల్లో పరీక్షలు వాయిదాపడ్డాయి. ఆటోలు, బస్సులు లేక రోడ్లు బోసిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని భోజన సమయంలో నిరసన చేపట్టారు. గ్రేటర్ పరిధిలోని 26 డిపోలకు చెందిన 3800 బస్సులు రోడ్డెక్కలేదు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, ఎనుగు రవీందర్‌రెడ్డి, చింతల కనకారెడ్డి, రసమయి బాలకిషన్, పోలిట్‌బ్యూరో సభ్యులు ఎర్రోళ్ళ శ్రీనివాస్, తదితరులు జూబ్లీ బస్టాండ్ ఎదుట బైఠాయించి బస్సులను బయటికి రానివ్వలేదు.ఎంజీబీఎస్, బస్‌భవన్ వద్ద మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వీ శ్రీనివాస్‌గౌడ్, టీఎంయూ ప్రధాన కార్యదర్శి ఆశ్వత్థామరెడ్డి, గౌరవాధ్యక్షుడు థామస్‌రెడ్డిల ఆధ్వర్యంలో బస్సులను అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ స్వామిగౌడ్, టీఆర్‌ఎస్ కార్యకర్తలు రాజేందర్‌నగర్ డిపోకు తాళం వేశారు.

నాయుళ్ల కనుసన్నల్లో మోడీ..మండిపడ్డ ఎంపీలు సీమాంధ్ర పక్షపాతులైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుల కనుసన్నల్లో దేశప్రధాని నరేంద్రమోడీ పనిచేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎంపీలు శ్రీహరి, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. పోలవరంపై కేంద్రం ఆర్డినెన్స్‌ను వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. బంద్‌లో భాగంగా గురువారం వరంగల్, భువనగిరి, నార్సింగిలో ఎంపీలు పాల్గొన్నారు. కేంద్రం సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తోందన్నారు. రెండు రాష్ర్టాలతో చర్చించకుండానే చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఒత్తిడికి తలొగ్గిన ప్రధాని మోడీ ఏకపక్షంగా ఆర్డినెన్స్‌ను జారీ చేయడం అన్యాయం, అప్రజాస్వామికమన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని ఇంత నిరంకుశంగా మరో ప్రాంతానికి బదిలీచేయడం రాజ్యాంగవిరుద్ధమని, సమాఖ్యస్ఫూర్తికి భంగకరమన్నారు. చంద్రబాబు తెలంగాణపై ఇంకా కుట్రలు పన్నుతున్నాడని, ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెడతామనడం అహంకారానికి నిదర్శనమన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంటు సమావేశానికి నల్లబ్యాడ్జీలతోనే వెళ్తారని ఎమ్మెల్సీ కే స్వామిగౌడ్ చెప్పారు. ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.