-కేంద్రం యత్నాలను ప్రతిఘటించండి -గవర్నర్ పాలన యత్నాలను ఎండగట్టండి -చీకటి కుట్రలను బట్టబయలు చేయండి -పార్లమెంటు వేదికగా దేశవ్యాప్త చర్చ జరగాలి -ఎంపీల సమావేశంలో సీఎం కేసీఆర్

పోలవరం ఆర్డినెన్స్, హైదరాబాద్‌పై గవర్నర్ పాలన యత్నాలను పార్లమెంటు వేదికగా తీవ్రంగా ప్రతిఘటించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. పోలవరంపై ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. అలాగే తాజాగా హైదరాబాద్‌పై పరోక్ష పెత్తనానికి కేంద్రం తెర తీసిందని, దీనిని పార్లమెంటు వేదికగా ఎండగట్టాలని ఆయన సూచించారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభ టీఆర్‌ఎస్ పక్ష నేత జితేందర్‌రెడ్డి, ఉపనేత వినోద్, ఎంపీలు కడియం శ్రీహరి, కల్వకుంట్ల కవిత, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, నగేశ్, బూర నర్సయ్య, బాల్క సుమన్, సీతారాంనాయక్, బీబీపాటిల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో కేంద్రం నుంచి వచ్చిన సర్క్యులర్‌పై, సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో రానున్నపోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే బిల్లుపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించొద్దు.. రాష్ర్టాల అధికారాల్లోకి గవర్నర్లను చొప్పించడం ప్రజాస్వామ్య, రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్ధమని ఎంపీల సమావేశంలో కేసీఆర్ అన్నట్లు సమాచారం. దేశంలోని 28 రాష్ర్టాల్లో అమల్లో లేని వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో అమలుచేయాలనడం కేంద్రం కక్షకట్టినట్లే అవుతుందని అన్నట్లు సమాచారం. ఫెడరల్ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైన అంశాలతో కేంద్ర పంపిన ఆ సర్క్యులర్‌కు సమాధానం పంపిస్తామని, సర్క్యులర్‌లోని అంశాలను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం. శాంతిభద్రతల అంశం అన్ని రాష్ర్టాల్లోనూ రాష్ట్రప్రభుత్వాల పరిధిలో ఉండగా, కానీ కేంద్రం తెలంగాణలో గవర్నర్‌కు ఎందుకు అప్పగిస్తోంది? అన్న అంశాన్ని ప్రముఖంగా పేర్కొంటూ పార్లమెంట్‌లో చర్చకు తెరతీయాలని ఆయన సూచించారు. ఇది ఫెడరల్ స్ఫూర్తితో కొనసాగుతున్న రాష్ర్టాల హక్కులను హరించడమే అవుతుందనే విషయాన్ని పార్లమెంట్ వేదికగా వెల్లడి చేయాలని సూచించారు.
చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు కలిసి సీమాంధ్రులకు అనుకూలంగా చేస్తున్న కుట్రను నిండు సభలోనే బట్టబయలు చేయాలని సూచించినట్లు సమాచారం. ఈ అంశంపై ఇతర రాష్ర్టాల ఎంపీల మద్దతు కూడా కూడగట్టాలని, తెలంగాణలో అమలు చేసినట్లుగానే ఇతర రాష్ర్టాల్లోనూ కేంద్రం ఇదే అమలుచేసే అవకాశం ఉండవచ్చునని వారికి వివరించాలని మార్గదర్శనం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హక్కులను హరింపబడితే రాబోయే రోజుల్లో ఇతర రాష్ర్టాలకు అదే పరిస్థితి వస్తుందనే అంశాన్ని బలంగా తీసుకెళ్లాలన్నారు.
పోలీస్ సర్వీస్‌బోర్డు అంటే తెలంగాణ నెత్తిన పెద్ద కుంపటేనని, డీసీపీ, ఏసీపీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లపై కూడా తెలంగాణ ప్రభుత్వానికి అధికారం లేకుంటే పాలన ఎలా సాగుతుందని అన్నారు. ఫేర్‌షేర్ ప్రకారం జాయింట్ పోలీస్ ఫోర్స్ కొనసాగించాలనడం మళ్లీ ఆంధ్రోళ్లను తెచ్చి ఇక్కడ పెట్టుకోవడమేనని, తెలంగాణ సమాజానికి ఇది తీవ్ర వ్యతిరేక నిర్ణయమని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. పార్లమెంట్ సమావేశాల తొలిరోజే పోలవరం ముంపు మండలాలను ఆంధ్రకు కేటాయించే బిల్లును కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రవేశపెట్టనున్నారు. ఐటెం నెంబర్ 6గా ఈ బిల్లు వస్తున్నది. ఇప్పటికే ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని టీఆర్‌ఎస్ ఎంపీలు నోటీస్ ఇచ్చారు. అదే సమయంలో సోమవారం పోలవరం ఆర్డినెన్స్‌పై వాయిదా తీర్మానం కూడా ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఒడిషా, చత్తీస్‌గఢ్ ఎంపీలతో కలిసి పోలవరంపై పోరాడనున్నారు.
ఢిల్లీ వెళ్లిన టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్ ముందుకు పోలవరం ముంపు మండలాల బిల్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కబళించేందుకు కుట్ర జరుగుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఆదివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో సమావేశం ముగిసిన తరువాత ఎంపీలు వినోద్, కడియం శ్రీహరితో పాటు పలువురు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. మరికొందరు సోమవారం ఉదయం అక్కడికి చేరుకుంటారు.
కేంద్రాన్ని నిలదీస్తామన్న టీఆర్‌ఎస్ ఎంపీలు గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని దెబ్బతీయడమేనని టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. ఎంపీలతో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిని తగ్గించే యత్నాలను అంగీకరించబోమని, పార్లమెంట్‌లో దీనిపై కేంద్రాన్ని నిలదీస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌కు అధికారాలు ఇవ్వడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. పోలవరం ముంపు మండలాలను కాపాడుకుంటామని తెలిపారు.
లోక్‌సభాపక్ష ఉప నేత వినోద్ మాట్లాడుతూ పోలవరం ముంపు మండలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారు. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని ఇప్పటికే నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ రైల్వేబడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం కోసం కొట్లాడుతామన్నారు. పోలవరం ముంపు మండలాల బిల్లు ప్రవేశపెడితే గట్టిగా ప్రతిఘటించాలని సమావేశంలో నిర్ణయించామని అన్నారు. ఒక్కొక్క ఎంపీ ఇప్పటికే పలు అంశాలపై నోటీసులు ఇచ్చారని, అవకాశం రాగానే తమ సత్తా చూపిస్తామని అన్నారు. తెలంగాణకు ఎయిమ్స్‌తరహా ఆస్పత్రి కోసం ముఖ్యమంత్రే త్వరలో లేఖ రాయబోతున్నారని అన్నారు.