-బీఏసీలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌పై నిర్ణయం
-14 వరకు సమావేశాలు.. గురు,శుక్రవారాల్లో సాయంత్రం వరకు
-13న గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం కేసీఆర్
-కనీసం 60రోజులైనా సభ నిర్వహించాలన్న ప్రతిపక్షాలు
-60 కాదు 70 రోజులకైనా సిద్ధమన్న సీఎం
-నేడు చర్చ ప్రారంభించనున్న కొండా
-డిప్యూటీ స్పీకర్‌గా పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నిక లాంఛనమే

తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరువాత బుధవారం మొట్టమొదటిసారిగా శాసనసభావ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ)సమావేశం జరిగింది. స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి నేతత్వంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుతో పాటు అధికార పార్టీ నుంచి డిప్యూటీ ముఖ్యమంత్రి రాజయ్య, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, చిన్నారెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంఐఎం నుంచి పాషాఖాద్రి, బీజేపీ నుంచి లక్ష్మణ్‌లు బీఏసీ సభ్యులుగా హాజరయ్యారు.
వైఎస్‌ఆర్‌సీపీ నుంచి తాటి వెంకటేశ్వర్లు, సీపీఐ నుంచి రవీంద్రనాయక్, సీపీఎం నుంచి సున్నం రాజయ్య ఇకపై బీఏసీలో ప్రత్యేక ఆహ్వానితులగా ఉండనున్నారు. సమావేశం ప్రారంభం కాగానే బీఏసీ సభ్యులుగా వచ్చిన వారికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ పరిచయం చేసుకున్న తరువాత తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన మరో సభ్యుడు రేవంత్‌రెడ్డి తమ పార్టీ నుంచి మరొక్కరికి అవకాశం ఇవ్వాలని కోరారు. 21మంది సభ్యులున్న కాంగ్రెస్‌నుంచి ఇద్దరు, ఏడుగురు సభ్యులున్న ఎంఐఎంకు ఒక్కరు ఉన్నపుడు, 15 మంది సభ్యులున్న తమకు కూడా ఒక్కరికే అవకాశం ఇవ్వడం సరైందికాదని అన్నారు. దీనిపై ఎంఐఎం, మంత్రులు వ్యతిరేకత వ్యక్తంచేయడంతో వివాదం వద్దన్నరీతితో ముఖ్యమంత్రి కేసీఆర్ కలగజేసుకుని గడ్లేం పాడయింది.
టీడీపీ నుంచి ఇంకొక్కర్ని స్పెషల్ ఇన్‌వైటీగా రాసుకోండి అని చెప్పడంతో వివాదం చల్లబడింది. సభ కనీసం ఆరురోజులైనా జరగాలని ప్రతిపక్షసభ్యులు సూచించడంతో ఆరు రోజులేం డిస్కస్ చేస్తామని సీఎం అన్నారు. దీంతో ప్రతిపక్షాలు కనీసం గురువారమైనా వర్కింగ్‌లంచ్ పెట్టి ఉదయంనుంచి సాయంత్రం వరకు డిస్కస్ చేస్తే బాగుంటుందని సూచించాయి. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. బుధవారంవరకు సభ ఉదయం 11గంటలకు ప్రారంభం అవుతుంటే గురువారంనుంచి మాత్రం సభ 10గంటలకే ప్రారంభం కానుంది. మధ్యాహ్నాం 1.30-2.00వరకు లంచ్ సమయం కేటాయించారు. తిరిగి సాయంత్రం వరకు సభ సాగుతుంది.
ఇదీ షెడ్యూల్
12వ తేదీన డిప్యూటీ స్పీకర్ ఎన్నికను స్పీకర్ మధుసూధనాచారి ప్రకటిస్తారు. డిప్యూటీ స్పీకర్‌గా ఇప్పటి వరకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాత్రమే నామినేషన్‌వేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఎన్నిక ఏకగ్రీవం కానుంది. పద్మాదేవేందర్‌రెడ్డిని డిప్యూటీ స్పీకర్‌గా ప్రకటించిన తరువాత సభ వాయిదాపడనుంది. అనంతరం బుధవారం అసెంబ్లీ, శాసనమండలి ఉభయసభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం అధికార పార్టీ ఎమ్మెల్యే కొండా సురేఖ ముందుగా చర్చను ప్రారంభిస్తారు. ఆ తరువాత సోమారపు సత్యనారాయణ ధన్యవాదాల తీర్మానంపై చర్చిస్తారు.
13వ తేదీన సభాసమయంలో సగభాగం వరకు అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు మాట్లాడుతారు. అనంతరం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు మాట్లాడుతారు. మధ్యలో సభ్యుల అభ్యంతరాలకు కూడా సీఎం సమాధానాలిస్తారు. 14వ తేదీన తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరులైన విద్యారి,్థయువకుల బలిదానాలపై చర్చ జరగనుంది. ఆ తరువాత హిమాచల్‌ప్రదేశ్ ఘటనపై చర్చ జరుగుతుంది. అనంతరం పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే తీర్మానంపై చర్చ జరుగుతుంది. తెలంగాణను నిండా ముంచే ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలంటూ ఈ తీర్మానంపై చర్చ జరుగనుంది. తెలంగాణలో ఉన్న ఏడు మండలాలను ఆంధ్రలో కలపొద్దు అనేదానిపై కూడా చర్చ జరుగుతుంది. చర్చ అనంతరం పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయనున్నారు. ఈ మూడు తీర్మానాలపై చర్చ అనంతరం ముఖ్యమంత్రి మరోసారి ప్రసంగిస్తారు.