-ఉత్త భీషణలొద్దు.. చిత్తశుద్ధి చూపండి -అయినా అందరి రంగూ బయటపెడతాం -సభలో మాకున్నది ఒక్క సభ్యుడే -ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్

ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే బిల్లును బీజేపీ తన మందబలంతో లోక్‌సభలో ఆమోదింపజేసినా, దానిని రాజ్యసభలో అడ్డుకోవాల్సింది కాంగ్రెస్సేనని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. రాజ్యసభలో ఎన్డీఏకన్నా కాంగ్రెస్‌కే మెజారిటీ ఉందని, పోలవరం బిల్లును వ్యతిరేకిస్తూ ప్రకటనలు గుప్పిస్తున్న ఆ పార్టీ నేతలు సభలో దానిని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ జైపాల్‌రెడ్డి, డీఎస్, పొన్నాల, జానారెడ్డి ఢిల్లీ వెళ్లి పోలవరం బిల్లును అడ్డుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఒత్తిడి తేవాలని సూచించారు. పోలవరం బిల్లుతో బీజేపీకి తెలంగాణ ప్రజల పట్ల ఉన్న వ్యతిరేకత బయటపడింది. బిల్లు రాజ్యసభకు వెళ్తుంది. ఇప్పుడు ముంపు మండలాల ప్రజలతో పాటు భద్రాద్రి రాముడు కూడా రాజ్యసభ వైపు చూస్తున్నాడు.
లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందగానే అన్యాయం, నిరంకుశం అని స్టేట్‌మెంట్లు ఇచ్చి జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, డీఎస్, పొన్నాల అరివీర భయంకరంగా మాట్లాడారు. మీ మాటల్లోని చిత్తశుద్ధిని చేతల్లో చూపాలి. గల్లీల్లో రంకెలు వేయడం కాదు.. ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీ ఇంటి ముందు కూర్చోండి. ఏ విధంగా ఒప్పిస్తారో ఒప్పించండి అని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజల వైపు ఉంటారో ఆంధ్ర కాంగ్రెస్ నేతలకు దాసోహమవుతారో తేల్చుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్‌కు రాజ్యసభలో కే కేశవరావు ఒక్కరే సభ్యుడున్నా తెలంగాణ ప్రజల గొంతుకను ఎలుగెత్తి చాటుతారని, ఓటింగ్‌కు పట్టుబట్టి అందరి రంగును బయటపెడతామని అన్నారు.
ముగ్గురు ఎంపీలున్న టీడీపీ ఏమి చేస్తున్నది ? రాజ్యసభలో టీడీపీకి ఆరుగురు సభ్యులుంటే దేవేందర్‌గౌడ్, గుండు సుధారాణి, గరికపాటి మోహన్‌రావులు తెలంగాణ నుంచి ఉన్నారని, వారు తెలంగాణ ప్రజల వైపు ఉంటారా..? లేక బాబు తొత్తులుగా ఉంటారో తేల్చుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సభలో కలిసివచ్చి బిల్లును అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.పోలవరం ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదని, ప్రాజెక్టు డిజైన్‌కే వ్యతిరేకమని మా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రాంత ఇంజినీరు హన్మంతరావుతో సహా పలువురు ఇంజినీర్లు ముంపు తగ్గేవిధంగా సూచనలు చేశారు.
నీళ్లు వెళ్లడానికి మేం వ్యతిరేకం కాదు. న్యాయబద్ధంగా వచ్చే వాటిని తీసుకోండి. గిరిజనులను ముంచుతూ మూడో పంటకు నీరిస్తామంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పడు కూడా పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించాం. మా ప్రత్యర్థులు కూడా మా నిబద్ధతపై సర్టిఫికెట్లు ఇచ్చారు. టీఆర్‌ఎస్ కేవలం వీధిపోరాటాలే కాదు న్యాయపోరాటాలు కూడా చేసింది. అధికారంలో ఉన్నప్పడు ఒకమాట, లేనప్పుడు ఒక మాట మాట్లాడేవాళ్లం కాదు. అన్నారు.
తెలంగాణ బీజేపీని ఆంధ్ర శాఖలో కలిపేయండి తెలంగాణకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం రాకపోయినా, బడ్జెట్‌లో రాష్ర్టానికి పైసా రాకపోయినా తెలంగాణ బీజేపీ నేతలు నోరు మెదపలేదని, ఇప్పుడు పోలవరం బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని మాత్రం తప్పుబడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఆంధ్ర నాయకులు వారి ప్రయోజనాల కోసం ఎలాగైతే కలిసి పని చేస్తున్నారో మనప్రాంత నాయకులు కూడా అలాగే కలిసిరావాలి. టీఆర్‌ఎస్ పోరాటానికి మద్దతు పలకండి. ఇకనైనా క్రియాశీలకంగా వ్యవహరించండి. ఒక్క ఆంధ్ర నాయకుడు పట్టుబడితే లక్షల మంది ప్రజల ఆత్మగౌరవంపై దాడిచేయొచ్చు.. కానీ ఎవరో కొంతమంది పోయి వారి పార్టీ కార్యాలయం ముందు నిరసన తెలిపితే అది దాడి అయితదా..? అసలు తెలంగాణలో బీజేపీ ఎందుకు? ఆంధ్రప్రదేశ్ శాఖలో కలిపేయండి అని మండిపడ్డారు.
ప్రభుత్వపరంగా న్యాయపోరాటం: గతంలో పోలవరంపై టీఆర్‌ఎస్ తరఫున న్యాయపోరాటం చేశామని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పోరాడుతుందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నారు కాబట్టి రాష్ట్రం ఏర్పడిందని, ఖమ్మం జిల్లాలోని ప్రజలు ఆంధ్రలో కలవాలనుకుంటున్నారో.. తెలంగాణలో ఉండాలనుకుంటున్నారో రెఫరెండం పెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జనార్ధన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, రాములునాయక్, పొలిట్‌బ్యూరో సభ్యుడు రాజయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.