-యాదవుల అభివృద్ధికి పెద్దపీట.. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్

పాడిపరిశ్రమతోపాటు వ్యవసాయానుబంధ రంగాలను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. సోమవారం కరీంనగర్ జిల్లా గంగాధరలో రాష్ట్ర ప్రభుత్వం, పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గొర్రెల్లో నట్టలనివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ రాష్ట్రంలో కరీంనగర్ పాడిపరిశ్రమను బలోపేతం చేసేందుకు అధికారుల తో చర్చిస్తుండగా, మంత్రివర్గ ఆలోచనతో పదిజిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి చెందిన తరహాలోనే శాస్త్రీయవిజ్ఞానంతో పాడిపరిశ్రమను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర రాజధానికి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎక్కువ సంఖ్యలో గొర్రెలు, మేకలు దిగుమతవుతున్నాయని వెల్లడించారు. యాదవులకు ఉపాధి కల్పించి గొర్రెలు, మేకల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గొర్రెలు,మేకల జీవనోపాధి కోసం యాదవులకు వివిధ రకాల పథకాలను అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు.
ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ పరిసరాల్లో పచ్చని ప్రాంతాలను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారన్నారు. దీంతో వర్షాలు కురవక కరువు దాపురించిందని వాపోయారు. ప్రతి ఇంట్లో ఐదు మొక్కలునాటి పచ్చదాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. జనాభా పెరుగుదలకు అనుగునంగా ఆహారఉత్పత్తులు పెరగాలన్నారు. కొత్తగా పురుడుపోసుకున్న తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం నుంచి అధిక సంఖ్యలో నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసామ్తన్నారు. పాడిపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు యాదవులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తోడ్పాటు అందించాలని మంత్రి ఈటెల రాజేందర్‌ను ఎమ్మెల్యే బొడిగె శోభ కోరారు.