-ప్రచారంలో గ్రాండ్ సక్సెస్ -ఆకర్ష్ మంత్రంతో ప్రతిపక్షాలు బెంబేలు
మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడం వెనుక మంత్రి హరీశ్‌రావు కృషి ఎంతో ఉన్నది. ఉపఎన్నిక బాధ్యతలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అప్పగించిన మరుక్షణమే రంగంలోకి దిగిన హరీశ్.. ప్రచారం మొదలుకుని, పార్లమెంట్ పరిధిలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి ఏ మంత్రిని ఇన్‌చార్జ్‌గా నియమిస్తే బాగుంటుందో పక్కా ప్రణాళికలు రచించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, నాయకులకు బాధ్యతలు అప్పగించారు. మంత్రులు నియోజకవర్గాలపై కేంద్రీకరిస్తే.. హరీశ్ నియోజకవర్గాలన్నింటినీ కవర్‌చేస్తూ విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన ఆకర్ష్ మంత్రం కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
పోలింగ్‌కు పదిరోజుల ముందే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు చెందిన ముఖ్య నాయకులంతా వరుసకట్టి టీఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో ఆ పార్టీల నేతలు బెంబేలెత్తారు. మాజీ మంత్రి ఫరీదుద్దీన్, బీజేపీ నేత చాగండ్ల నరేంద్రనాథ్, సిద్దిపేటకు చెందిన సీనియర్ కాంగ్రెస్‌నేత స్వామిచరణ్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పానాగేష్‌యాదవ్‌లతోపాటు సంగారెడ్డిలో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి ప్రధాన అనుచురులైన మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్లు, ఎంపీపీలు, ఇతర నేతలు హరీశ్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి ప్రధాన అనుచరులైన కాంగ్రెస్‌నేత జిన్నారం బాల్‌రెడ్డి, ఎంపీపీ రవీందర్‌రెడ్డితోపాటు పార్టీశ్రేణులు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. గజ్వేల్, మెదక్ నియోజకవర్గాల్లో కూడా ఆయా పార్టీల ముఖ్య నాయకులు గులాబీ నీడకు వచ్చారు. ఈ చేరికలతోనే ఆ పార్టీల నేతలు ఓటమిని ధ్రువీకరించుకున్న ఆ పార్టీ నేతలు కనీసం రెండోస్థానాన్ని దక్కించుకోవడంకోసం పడరానిపాట్లు పడ్డారు. ఓటర్లను ప్రలోభపెట్టే పెట్టే చర్యలకూ దిగారు. వీటన్నింటినీ తిప్పికొడుతూ హరీశ్ సారథ్యంలో టీఆర్‌ఎస్ నేతలు ప్రచారంలో దూసుకుపోయారు.
డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, రాజయ్య, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటెల రాజేందర్, కేటీఆర్, జోగురామన్న, మహేందర్‌రెడ్డి, పద్మారావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు బాల్క సుమన్, బీబీ పాటిల్, వినోద్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నర్సాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభ గణనీయ ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. ఈ సభకు భారీగా జన సమీకరణ చేయడంలో హరీశ్ ప్రత్యేకంగా కృషి చేశారు. టీఆర్‌ఎస్ సభలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరాగా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు నిర్వహించిన సభలన్నీ వెలవెలబోయాయి. ప్రధానంగా హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో నిర్వహించిన ఆ రెండు పార్టీల సభలకు జనం రాకపోవడంతో నేతలు షాక్ తిన్నారు కూడా. కేసీఆర్ గత సార్వత్రిక ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ స్థానంనుంచి పోటీ చేసినప్పుడు కూడా హరీశ్‌కే గజ్వేల్ బాధ్యత అప్పగించారు. అక్కడే మకాం వేసిన హరీశ్ తక్కువ సమయంలో గజ్వేల్‌లో టీఆర్‌ఎస్‌ను తిరుగులేని శక్తిగా మార్చారు. అదే క్రమంలో ప్రస్తుతం మెదక్ ఉప ఎన్నిక ఫలితంపైనా హరీశ్ ముద్ర సుస్పష్టంగా కనిపిస్తున్నది.