Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పెట్టుబడులతో తరలిరండి

భారత్‌లోనూ, తెలంగాణలోనూ పెట్టుబడులు పెట్టేందుకు తరలిరావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రపంచ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. చైనాలోని డాలియన్ నగరంలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశంలో బుధవారం ఉదయం ఎమర్జింగ్ మార్కెట్స్ ఎట్ క్రాస్‌రోడ్స్ అనే అంశంపై సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా భారతదేశంలోనూ, ప్రత్యేకంగా తెలంగాణలో, హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కేసీఆర్ విపులంగా వివరించారు. దేశంలో అతి పిన్న వయసు కలిగిన తమ రాష్ట్రంలో అత్యద్భుతమైన పారిశ్రామిక విధానం అమలుచేస్తున్నామని, కొద్దికాలంలోనే రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని తెలిపారు.

-ప్రపంచ పారిశ్రామికవేత్తలకు సీఎం కేసీఆర్ పిలుపు -ఎలాంటి గ్రిల్స్ లేని సింగిల్‌విండో విధానం మాది -ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రయోగం విఫలమైంది – కొత్త రాష్ట్రమైనా అభివృద్ధిలో ముందంజలో ఉన్నాం – భారత ఆర్థిక విధానాల్లో శషభిషలు లేవు -సంస్కరణ బాటలో వేగంగా వెళుతున్నాం – చైనా అభివృద్ధి అందరికీ ఆదర్శప్రాయం -వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో ఆకట్టుకున్న కేసీఆర్ ప్రసంగం

CM KCR in World economic forum  meeting at china

ప్రపంచంలో సింగిల్ విండోలు చాలా దేశాల్లో ఉండవచ్చు కానీ.. తెలంగాణ సింగిల్ విండోకు ఎలాంటి గ్రిల్స్ ఉండవని సీఎం ధీమాగా చెప్పారు. పారిశ్రామికవేత్తలు అనుమతులు పొందడాన్ని తమ రాష్ట్రం హక్కుగా గుర్తించిందని ప్రకటించారు. భారత ఆర్థికవ్యవస్థ ఎలాంటి క్రాస్‌రోడ్‌లో లేదని, ప్రధాని మోదీ నేతృత్వంలో సంస్కరణల మార్గంలో ఎపుడో అత్యంత వేగంగా ముందుకు వెళ్లిందని కేసీఆర్ చెప్పారు. చైనా ఆర్థిక పరిణామాలు తాత్కాలికమేనని అభిప్రాయపడ్డ కేసీఆర్.. అతి త్వరలోనే చైనా పుంజుకుంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రపంచ వ్యాపారవేత్తలకు, సంస్థలకు ఇదే మా ఆహ్వానం.. మా దేశానికి, మా తెలంగాణకు రండి. పెట్టుబడులు పెట్టండి.. కలిసి సాగుదాం.. పురోగమిద్దాం.. అభివృద్ధి పథంలో పయనిద్దాం అని పిలుపునిచ్చారు.

కొత్త రాష్ట్రం..అద్భుతమైన పారిశ్రామిక పాలసీ.. మాది కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రం. భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది. అయినా దేశంలోనే అద్భుతమైన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చాం. ఈ విధానానికి చట్టరూపం తీసుకొచ్చాం. కేవలం రెండు వారాల గడువులోగా పెట్టుబడిదారులు తమకు కావాల్సిన అనుమతి పొందడాన్ని మేము ఒక హక్కుగా గుర్తించాం. ఈ విధానంలో ఇప్పటివరకు 56 కంపెనీలకు అనుమతులిచ్చాం. సుమారు 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది భారత్‌పట్ల ప్రపంచ సానుకూల దృష్టిని స్పష్టం చేస్తున్నది. భారత వినియోగరంగం ఎగుమతుల రంగానికి సంబంధించి అతి పెద్ద మార్కెట్ కలిగిఉంది. అందువల్లనే మేము ఒడిదొడుకులు లేకుండా నిలకడగా ఉన్నాం.. కచ్చితంగా అభివృద్ధిని కొనసాగిస్తూనే ఉంటాం.

మాకు సంస్కరణల మార్గం చూపెట్టే మార్గదర్శి అయిన ప్రధానమంత్రి ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా గుజరాత్‌లో విజయం సాధించారు. అదే మాదిరిగా దేశాన్ని కూడా అభివృద్ధిపథంలో తీసుకెళ్ళేందుకు దృఢ సంకల్పంతో ముందుకు వెళుతున్నారు. అని సీఎం కేసీఆర్ చెప్పారు.

రాష్ర్టాలదే కీలక పాత్ర.. మా దేశాభివృద్ధిలో రాష్ర్టాలకు కీలక పాత్ర ఉంది. ఇది గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు మరిన్ని విధులు, నిధులు ఇచ్చింది. గతంలో ఉన్న ప్లానింగ్ కమిషన్ ఇపుడు లేదు. దాని స్థానంలో అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే సంస్థ నీతి ఆయోగ్ ఏర్పాటు అయింది. దీనికి ప్రధాన మంత్రి చైర్మన్‌గా ఉంటారు. దీనిని మేం టీం ఇండియా అని పిలుస్తున్నాం. ప్రధానమంత్రి సారథ్యంలో సభ్యులమంతా కలిసి సమిష్టిగా దేశాభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలు తయారుచేయడంతోపాటు ప్రత్యేకంగా రాష్ర్టాల అభివృద్ధిపైనా దృష్టి పెడుతున్నాం. సమాఖ్య విధానంలో రాష్ర్టాలుగా మా పాత్ర ఎంతో కీలకమైంది అని ముఖ్యమంత్రి వివరించారు.

చైనా మళ్లీ పుంజుకుంటుంది.. ఒడిదుడుకులనేవి వస్తూనే ఉంటాయి.. చూస్తూనే ఉంటాము. ఈ మధ్య ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా తిరిగి నిలదొక్కుకునే శక్తి చైనాకు ఉంది. 30 సంవత్సరాల క్రితం ఉన్న చైనాకు.. ఇప్పటి చైనాకు ఎంతో తేడా ఉంది. ఇవాళ ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందిన చైనాను చూస్తున్నది. చైనానుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. అసలు చైనానుంచి నేర్చుకోకుండా ఉండాల్సిందంటూ ఏదీ లేదు. అన్నీ నేర్చుకునే అవకాశం ఉంది. నేర్చుకోవాలి. ఇవాళ భారత్‌కు పరిస్థితులు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. భారత్ అతి పెద్ద చమురు దిగుమతిదారు. ఇవాళ చమురు ధరలు బాగా తగ్గాయి. ఇది మాకు సంతోషదాయకం. మేం ఈ పరిస్థితిని సానుకూలంగా మలుచుకుంటాం. అభివృద్ధిలో మరింత ముందుకు వెళతాం. అని చెప్పారు.

ఎలాంటి శషభిషలు లేవు.. బహుశా ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలేమైనా క్రాస్‌రోడ్స్‌వంటి అయోమయస్థితిలో ఉంటే ఉండి ఉండవచ్చు. కానీ కచ్చితంగా ఇండియా మాత్రం అలాంటి క్రాస్‌రోడ్స్‌లో లేదని నేను స్పష్టంగా చెప్పగలను. భారతప్రభుత్వం సంస్కరణల మార్గంలో ఉంది. మేము ఇప్పటికే అత్యంత వేగంగా ముందుకు వెళుతున్నాం. చమురు ధరల తగ్గింపువల్ల భారీగా ఆదా చేసుకోగలుగుతున్నాం. దీన్ని సానుకూలంగా మలుచుకుని పేదలకు మౌలిక సౌకర్యాలు కల్పించుకునే అవకాశం ఉంది. మా దేశం అన్ని రంగాల్లో వృద్ధి చెందే దిశగా పయనిస్తున్నది.

సమాజం, దేశం సమగ్ర అభివృద్ధి చెందడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. మాకు దానిపై నమ్మకం ఉంది. నిరుపేద మరింత నిరుపేదగా, ధనవంతులు మరింత ధనవంతులుగా కొనసాగితే.. వ్యవస్థలో పెను మార్పులు సంభవిస్తాయి. అది అభిలషణీయం కాదు. పేదలను ఉన్నతస్థాయికి తీసుకురావడానికి సమాన అవకాశాలు కల్పిస్తూ.. వారి గౌరవాన్ని పెంచుతాం అని తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విఫలమైంది.. మా రాష్ట్రం తెలంగాణ కొత్తగా ఆవిర్భవించింది. సుదీర్ఘ పోరాటం చేసి ప్రజలు తెలంగాణను సాధించుకున్నారు. మాది వేర్పాటువాదం కాదు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రయోగం విఫలమైంది. అతి పిన్న వయసుకలిగిన రాష్ట్రమే అయినా ఇప్పటివరకు పట్టించుకోని నిరుపేదల కోసం మేం రెండు పడకగదుల ఇండ్లను నిర్మించే పథకాన్ని ప్రారంభించాం. ప్రజల తాగునీటి పథకానికి ఎంతో భారీగా ఖర్చుపెడుతున్నాం. అలాగే హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పనలపై దృష్టి సారించాం. ఎంతో అద్భుతమైన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి, అమలు చేస్తున్నాం. మా దేశానికి రండి. మా దేశం.. ప్రత్యేకంగా తెలంగాణ.. హైదరాబాద్ పెట్టుబడులకు ఎంతో సానుకూలం. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు కావాల్సినంత ల్యాండ్‌బ్యాంక్ ఉంది. ప్రపంచంలో మరెక్కడా లేని పారిశ్రామిక విధానం ఉంది.

ప్రపంచంలో సింగిల్ విండోలు చాలా ఉండవచ్చు కానీ తెలంగాణ సింగిల్ విండోకు ఎలాంటి గ్రిల్స్ లేవు. నేను మరోసారి చెబుతున్నా.. ఎలాంటి అడ్డంకులు, అవాంతరాలు, అవరోధాలు ఉండవు. కావాల్సిన అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం జరిగితే.. అందుకు కారణమైన అధికారిపై కఠినమైన చర్యలు ఉంటాయి. పెట్టుబడుదారులు నిర్ధిష్ట సమయంలో అన్నిరకాల అనుమతులు పొందడమనేది వారి హక్కుగా తీర్చిదిద్దాం. నిర్దిష్ట సమయంలోగా వారికి అనుమతులు రాకపోతే.. అన్నిరకాల అనుమతులు వచ్చినట్టుగానే భావించి సదరు కంపెనీ ముందుకు వెళ్ళేలా పాలసీ రూపొందించాం.

ప్రపంచ పారిశ్రామికవేత్తలకు ఇదే మా ఆహ్వానం. ఇండియాకు రండి, ఇండియాలో పెట్టుబడులు పెట్టండి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. సమిష్టిగా.. కలిసికట్టుగా ముందుకుసాగుదాం అని కేసీఆర్ పిలుపునిచ్చారు. దక్షిణాఫ్రికాకు చెందిన సీఎన్‌బీసీ ఆఫ్రికా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రౌన్‌విన్ నీల్సన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ చర్చలో కేసీఆర్‌తోపాటు ఐక్యరాజ్యసమితి పారిశ్రామికాభివృద్ధి సంస్థ ప్రచారకర్త హెలెన్‌హై, బ్రెజిల్ పారిశ్రామిక, వాణిజ్యాభివృద్ధిశాఖ కార్యదర్శి మార్కోస్ వినిసియస్ డిసౌజా, మలావీ అధ్యక్షుడు ఆర్థర్ పీటర్ ముతారికా, సింగపూర్‌కు చెందిన పార్టనర్స్ గ్రూప్ సీఈవో కెవిన్‌లూ పాల్గొన్నారు. సదస్సులో సీఎం కేసీఆర్ ప్రసంగం సభికులను విశేషంగా ఆకర్షించింది. ఆ తర్వాత పట్టణాభివృద్ధిలో సవాళ్లు అనే అంశంపై జరిగిన సమావేశంలో కూడా కేసీఆర్ ప్రసంగించారు.

హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం చేస్తున్న కృషిని వివరించారు. తన ఆలోచనలు, అభిప్రాయాలను చైనాలోని గ్వాంగ్‌ఝౌ, యూవీ తదితర నగరాల మేయర్లు, డిప్యూటీ మేయర్లతో పంచుకున్నారు. ఈ సందర్భంగా వారి అనుభవాన్ని, నగరాభివృద్ధిలో వారి నైపుణ్యాన్ని తెలంగాణ అభివృద్ధికి అందివ్వాలని కోరారు.

చైనా పర్యటనకు మరికొందరు చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు సహకరించేందుకు నగరంలోని ముగ్గురు ప్రధాన విభాగాల ఉన్నతాధికారులు బుధవారం బయలుదేరారు.

రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో సాగుతున్న ఈ పర్యటనలో భాగంగా వీరు ఆయా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతారు. చైనా వెళ్లిన వారిలో జీహెచ్‌ఎంసీ ప్రత్యేక అధికారి, కమిషనర్ సోమేశ్‌కుమార్, హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలినీ మిశ్రా, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎంజీ గోపాల్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.