రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించటమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు శుక్రవారం సిలికాన్‌వ్యాలీలో వివిధ రంగాల్లో ప్రపంచంలోనే పేరెన్నికగన్న సంస్థలతో సమావేశమయ్యారు. ఎలక్ట్రానిక్‌రంగంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఐప్లెడ్ మెటీరియల్స్, ప్రపంచంలోనే అతిపెద్ద వెంచర్ క్యాపిటల్ సంస్థ న్యూ ఎంటర్‌ప్రైజ్ సంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఎన్నారైలతో ఇష్టాగోష్ఠిలో పాల్గొన్న మంత్రి, ఫిక్కీ నిర్వహించిన పెట్టుబడిదారుల సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులకుగల అవకాశాలను వివరించారు.

-అమెరికా కంపెనీలకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు -న్యూ ఎంటర్‌ప్రైజ్ అసోసియేట్స్, ఐప్లెడ్ మెటీరియల్స్ సంస్థల అధికారులతో సిలికాన్‌వ్యాలీలో చర్చలు -ఎన్నారైలతో ఇష్టాగోష్ఠి.. ఫిక్కీ సదస్సులో ప్రసంగం -అమెరికా నుంచే రాష్ట్ర అధికారులతో ఐటీశాఖపై సమీక్ష ఐప్లెడ్ మెటీరియల్స్ యాజమాన్యంతో భేటీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ అప్లైడ్ మెటీరియల్స్ సీనియర్ అధికారులతో సమావేశమైన మంత్రి కేటీఆర్, తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. కంపెనీ కార్యాలయంలో చీఫ్ టెక్నాలజీ అఫీసర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న తెలంగాణ వాసి ఓంకారం నల్లమాసును మంత్రి కలిశారు. సెమీ కండక్టర్లు, సోలార్ ప్యానళ్ల ఉత్పత్తిలో పేరెన్నికగన్న 25 బిలియన్ల డాలర్ల విలువైన ఐప్లెడ్ మెటీరియల్స్ కంపెనీకి తెలంగాణ బిడ్డ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉండటం గర్వకారణమని అన్నారు. ఐప్లెడ్ మెటీరియల్స్ కంపెనీ తన పరిశోధనల్లో రాష్ట్రంలోని ట్రిపుల్‌ఐటీ, వరంగల్‌లోని ఎన్‌ఐటీని భాగస్వాములుగా చేసుకోవాలని కోరారు.
ఫిక్కీ సదస్సులో ప్రసంగం సిలికాన్‌వ్యాలీలోని బే ప్రాంతంలోగల శాంటాక్లారా కన్వెన్షన్ సెంటర్‌లో ఫిక్కీ నిర్వహించిన పెట్టుబడిదారుల సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యకమాలను వివరించారు. తమ ప్రభుత్వం అభివృద్ధి బాటన పయనిస్తున్నదన్న మంత్రి, మొదటిసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు విద్యుత్ కోతలపై చర్చ లేకుండా జరిగాయని గుర్తుచేశారు. అది తాము అతితక్కువ కాలంలో సాధించిన ఘన విజయమని అభివర్ణించారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో అసలు విద్యుత్ కొరత అన్నదే ఉండదని తెలిపారు. పెట్టుబడులతో రాష్ర్టానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు సాదర స్వాగతం పలికేందుకు సీఎం కార్యాలయంలోనే ఒక ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందం పనిచేస్తున్నదని చెప్పారు.

న్యూ ఎంటర్‌ప్రైజ్ అసోసియేట్స్‌తో సమావేశం: 17 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ప్రపంచంలోనే అతిపెద్ద వెంచర్ క్యాపిటల్‌గా పేరున్న న్యూ ఎంటర్‌ప్రైజ్ అసోసియేట్స్ యాజమాన్యంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. సంస్థలో భాగస్వామిగా ఉన్న మెదక్ జిల్లాకు చెందిన కిట్టూ కొల్లూరితో చర్చలు జరిపారు. తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు. సిలికాన్‌వ్యాలీ నుంచి టీ హబ్‌కు ఔత్సాహికులను తీసుకొచ్చే అంశంపై కిట్టూ కొల్లూరితో చర్చించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యసాయాన్ని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని మంత్రికి కిట్టూ కొల్లూరి సూచించారు. ఈ అధ్యయనంతో వ్యవసాయానికి పూర్తిస్థాయిలో సాంకేతిక సహకారం అందించవచ్చని, దాంతో ఉత్పత్తి భారీగా పెరిగే అవకాశముంటుందని తెలిపారు. న్యూ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేట్స్ సంస్థ భారత్‌లోని వివిధ సంస్థల్లో 300 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నదని, ఇందులో ప్రతి మూడు కంపెనీల్లో రెండు హైదరాబాద్ నగరానివేనని చెప్పారు. హైదరాబాద్ గేమ్‌సిటీలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అవకాశాలపై కూడా వారు చర్చించారు.
ఎన్నారైలతో ఇష్టాగోష్ఠి బే ప్రాంతంలో ఎన్నారైలతో ఇష్టాగోష్ఠిలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సిలికాన్‌వ్యాలీ నుంచి భారీఎత్తున తరలివచ్చిన ఎన్నారైలకు తెలంగాణ పునర్నిర్మాణం, ప్రభుత్వ అభివృద్ధి విధానాలను వివరించారు. ఎన్నారైలు తెలంగాణ అభివృద్ధి కోసం అనేక సలహాలు, సూచనలు ఇచ్చారని, వాటన్నింటిని సానుకూలంగా పరిశీలిస్తామని సమావేశం తర్వాత మంత్రి తెలిపారు. వరుస సమావేశాలతో ఉదయం నుంచి రాత్రి పదిన్నర వరకు బిజీగా గడిపిన మంత్రి రాత్రి 11 గంటల సమయంలో (స్థానిక కాలమానం) తెలంగాణలోని అధికారులతో శాఖాపరమైన సమీక్ష నిర్వహించారు.
జీఈ గ్రూప్ మాజీ చైర్మన్‌తో.. మంత్రి కేటీఆర్.. జీఈ గ్రూప్ మాజీ చైర్మన్ జాక్ వెల్చ్‌తో కూడా సమావేశమయ్యారు. రాష్ట్ర పారిశ్రామిక పాలసీ, రాష్ట్రంలో వివిధ మౌలిక సదుపాయాల గురించి ఆయనకు వివరించారు. అనంతరం క్లౌడ్ ఎరా సీఈవో టామ్ రిలితో భేటీ అయ్యారు. బిగ్ డాటా, హైదరాబాద్‌లోని అవకాశాలపై వివరించారు. హైదరాబాద్‌లో ఐటీ సంస్థల స్థాపనకు ఇచ్చే ప్రోత్సాహకాలను తనను కలిసిన ఎన్నారైలకు మంత్రి కేటీఆర్ తెలిపారు.