తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ఐటీ, పంచాయత్‌రాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వేధింపులకు ఆస్కారంలేని పారదర్శక, అవినీతిరహిత పారిశ్రామిక విధానాన్ని తెచ్చామని ఆయన వివరించారు. మా రాష్ట్రంలో అవినీతిరహిత పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నాం. ఎలాంటి వేధింపులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. పెట్టుబడులకు రెడ్‌కార్పెట్ వేస్తున్నాం.. ప్రభుత్వపరంగా అన్ని విధాలా తోడ్పాటునందిస్తాం అని తారకరామారావు హామీ ఇచ్చారు.

-అన్ని విధాలా సహకరిస్తాం -మాది అవినీతిరహిత పారిశ్రామిక విధానం -సింగిల్‌విండోలో అనుమతులు.. అతి పెద్ద ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేశాంl -సింగిల్‌విండోలో అనుమతులు -దుబాయి ఇన్వెస్టర్స్ మీట్‌లో మంత్రి కే తారకరామారావు -ఇన్వెస్టర్లను ఆకర్షించిన తెలంగాణ పారిశ్రామిక విధానం ఆదివారం దుబాయిలో ఫిక్కి, ఇండియన్ బిజినెస్ ప్రొఫెషనల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ.. షోకేసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ అపార్చునిటీస్ ఇన్ పొటెన్షియల్ సెక్టర్స్ అనే అంశంపై నిర్వహించిన ఇన్వెస్టర్ మీట్‌లో మంత్రి ప్రసంగించారు. తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ విశిష్టతను వివరిస్తూ తాము సెల్ఫ్ డిక్లరేషన్స్‌తోనే పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే వ్యవస్థను రూపొందించామని, దీని కోసం వెబ్ ఆధారిత ఈ-హెల్ప్‌లైన్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని చెప్పారు.
పారదర్శకంగా పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు. పరిశ్రమల శాఖ, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌లు అన్ని సేవలకు నిర్ధిష్ట కాలం వ్యవధితో సిటిజన్ చార్టర్‌ను అమలు చేస్తున్నాయని వివరించారు. సింగిల్‌విండో సిస్టం ద్వారా అనుమతులు ఇచ్చే వ్యవస్థలో రైట్ టు ఇన్‌ఫర్మేషన్ విధానాన్ని కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం(టీఎస్- ఐ పాస్), తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ అడ్వాన్స్‌మెంట్ (టీ-ఐడియా), తెలంగాణ స్టేట్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఆర్టిజన్స్ రివైవల్ విత్ టెక్నాలజి(టీ-హార్ట్), తెలంగాణ స్టేట్ యాక్సిలరేటెడ్ ఎస్‌ఎస్‌ఐ స్కిల్స్ ట్రైనింగ్(టీ- అసిస్ట్) తదితర పథకాల గురించి సమావేశంలో మంత్రి కేటీఆర్ వివరించారు.
హైదరాబాద్- వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్- నాగపూర్ కారిడార్, హైదరాబాద్- బెంగుళూరు కారిడార్ల అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను తెలిపారు. తెలంగాణలో 14 రంగాలకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా లైఫ్‌సైన్సెస్ (బల్క్ డ్రగ్స్, ఫార్ములేషన్స్, వాక్సిన్స్, న్యూట్రాస్యూటికల్స్, బయోలాజికల్స్), ఐటీ హార్డ్‌వేర్(బయో మెడికల్ డివైసెస్, ఎలక్ట్రానిక్స్, సెల్యూలార్ కమ్యూనికేషన్స్, ఫ్యాబ్), ఇంజినీరింగ్(ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్), ఫుడ్‌ప్రాసెసింగ్, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్(డెయిరీ, పౌల్ట్రీ, మీట్, ఫిషరీస్), ఆటోమొబైల్స్ అండ్ హెవీ ఇంజినీరింగ్) వీటిలో ఉన్నాయన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత ల్యాండ్‌బ్యాంక్‌ను పరిశ్రమల స్థాపనకు సిద్ధం చేసినట్లు వివరించారు. ఇండస్ట్రియల్ పాలసీలోని అన్ని అంశాలను వారికి తెలిపారు.
ఆకట్టుకున్న పాలసీ.. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఇండస్ట్రియల్ పాలసీ దుబాయి ఇన్వెస్టర్లను ఆకట్టుకుందని, ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు వారిని ఆశ్చర్యచకితులను చేశాయని పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర తెలిపారు. ఆదివారం దుబాయి నుంచి ఆయన టీ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ చూసి కొందరు ఇన్వెస్టర్లు అప్పటికప్పుడు తాము టెక్స్‌టైల్, ఫుడ్‌ప్రాసెసింగ్, మినరల్ ఆధారిత పరిశ్రమలు, బయో టెక్నాలజి, జనరల్ ఇంజినీరింగ్ రంగాల్లో పెట్టుబడులు పెడుతామని ప్రకటించారని చెప్పారు.
మరికొందరు ఇండస్ట్రియల్ పార్కులు, ఇండస్ట్రియల్ టౌన్‌షిప్పుల్లో మౌలిక సదుపాయాల కల్పన రంగాలను చేపతామని ముందుకొచ్చారని వివరించారు. తెలంగాణ పారిశ్రామిక విధానానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారాన్ని కల్పించేందుకు ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమం విజయవంతమైందని టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్‌రంజన్ కూడా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం రూపొందించిన సింగిల్‌విండో, సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం వంటివి ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకున్నాయన్నారు.
అధికార బృందంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫిక్కి ప్రతినిధి అఖిలేష్ టీ మీడియాతో మాట్లాడుతూ అనేక మంది ఇన్వెస్టర్లు సానుకూలంగా స్పందించారని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని చెప్పారు. కార్యక్రమంలో ఐటీపీసీ అధ్యక్షుడు పారాస్ శహదాద్‌పూరి, ఇండియన్ కాన్సులేట్ కాన్సూల్ కామర్స్ అనితా నందిని, ఫిక్కి ప్రతినిధి అఖిలేష్, వందకు పైగా ఇన్వెస్టర్లు ఇన్వెస్టర్ మీట్‌లో పాల్గొన్నారు.
స్మార్ట్‌సిటీని సందర్శించిన కేటీఆర్ బృందం.. దుబాయిలోని స్మార్ట్ సిటీని రాష్ట్ర ఐటీ మంత్రి కే తారకరామారావు, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కే ప్రదీప్‌చంద్ర, టీఎస్‌ఐఐసీ ఎండీ జయేష్‌రంజన్‌లు సందర్శించారు. అక్కడి ప్లానింగ్‌పై అధ్యయనం చేశారు. స్మార్ట్ సిటీ సీఈఓ అబ్దుల్‌లతీఫ్ అల్‌ముల్లాతో ప్రత్యేకంగా సమావేశమై స్మార్ట్ సిటీకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.