పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామమని, దేశంలోనే ఆకర్షణీయ పారిశ్రామిక పాలసీ తెచ్చిన ఘనత తమదేనని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో ద్వారా అన్ని రకాల అనుమతులిచ్చే విధానాలను అమలుచేస్తున్నామని తెలిపారు. స్వల్ప కాలంలోనే అమెజాన్ డాట్ కామ్, గూగుల్‌లాంటి 50 సంస్థలు తమ రాష్ట్రంలో కొత్త యూనిట్లను ప్రారంభించాయని తెలిపారు.

-దేశంలోకెల్లా ఆకర్షణీయమైన పారిశ్రామిక పాలసీని తెచ్చాం -రాష్ట్రంలో విద్యుత్ కొరతను సమర్థంగా ఎదుర్కొన్నాం.. -హస్తకళలకు ఆన్‌లైన్ మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నాం -ఫార్చూన్ 500 నెక్ట్స్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఫార్చూన్ పత్రిక ఢిల్లీలో సోమవారం నిర్వహించిన ఫార్చూన్ 500 నెక్ట్స్ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న 500 కంపెనీల్లో హైదారాబాద్ కేంద్రంగా ఉన్నవి కూడా గణనీయంగా ఉన్నాయని అన్నారు. ఆ జాబితాలో రాష్ర్టానికి చెందిన మరిన్ని కంపెనీలు స్థానం సంపాదించుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అనుకూల ప్రాంతమని, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నెక్ట్స్ 500 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి పది అభివృద్ధి చెందుతున్న కంపెనీలకు కేటీఆర్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ.. కొత్త కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. దేశంలోని పారిశ్రామిక ఆదాయంలో 45% చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుంచే వస్తున్నాయని, ఈ తరహా కంపెనీలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యుత్తమ పారిశ్రామిక పాలసీని రూపొందించారని తెలిపారు.
విద్యుత్ కొరతను అధిగమించాం.. ఉమ్మడి రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా విద్యుత్ కొరతతో పరిశ్రమలు, వ్యవసాయం, గృహరంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేసవిలో సైతం నిమిషం కూడా విద్యుత్ కొరత లేని పరిస్థితిని కల్పించాం. పరిశ్రమలకు ఇది ఎంతో ఊతమిస్తుందని కేటీఆర్ అన్నారు. విద్యుత్, వ్యవసాయం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సేవారంగం తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణలో చాలా అవకాశాలు ఉన్నాయని అన్నారు. విద్యుత్ రంగంలో ఏటా 2500 మెగావాట్ల విద్యుత్ సంప్రదాయేతర రంగంలో ఉత్పత్తి అవుతూ ఉన్నదని, దేశంలోనే అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని, ఇక్కడ ఒక్కో యూనిట్ కేవలం రూ. 5.17లకే ఉత్పత్తి అవుతున్నదని పేర్కొన్నారు.
ఇన్నోవేట్.. ఇన్‌క్యుబేట్.. ఇన్‌కార్పొరేట్ హైదరాబాద్‌లో అతిపెద్ద ఇన్‌క్యుబేషన్ కేంద్రాన్ని నెలకొల్పుతున్నామని, ఇన్నోవేట్.. ఇన్‌క్యుబేట్.. ఇన్‌కార్పొరేట్ నినాదాలతో ఈ రంగంలో నూతన కంపెనీలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఇటీవలనే అమెజాన్ డాట్ కామ్ ఆన్‌లైన్ పోర్టల్‌తో ఇప్పటివరకు మార్కెటింగ్ అవకాశాలు లేని హస్తకళలు, పోచంపల్లి నేత ఉత్పత్తులు, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పెయింటింగ్స్… ఇలా అనేక ఉత్పత్తులకు అవకాశాలను కల్పించామని, తాజాగా ఫేస్‌బుక్ ద్వారా కూడా ఇలాంటి అవకాశాలను విస్తృతం చేయనున్నామని తెలిపారు.
పారిశ్రామిక పాలసీ గురించి వివరిస్తూ.. కొత్తగా యూనిట్లను నెలకొల్పాలనుకునే సంస్థలకు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వమే స్వాగతం పలుకుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం చొరవ తీసుకుని నిర్వహిస్తున్న ఇన్వెస్ట్‌మెంట్ సెల్‌లో ఒక్క దరఖాస్తుతో పదిహేను రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టిందని కేటీఆర్ తెలిపారు. సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం తరహాలో పెట్టుబడుల హక్కు చట్టం తీరులో ఈ విధానాన్ని రూపొందించామని స్పష్టం చేశారు. 15 రోజుల్లో అనుమతులు రాకపోతే 16వ రోజున రాష్ట్ర ప్రభుత్వంపై లీగల్ చర్యలు తీసుకునే వెసులుబాటును కూడా కల్పించినట్లు వివరించారు. ఇంత స్పష్టంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది కాబట్టే.. గూగుల్, అమెజాన్ లాంటి సంస్థలు కొత్త యూనిట్లను ప్రారంభించాయని తెలిపారు.
పారిశ్రామిక పాలసీపై సర్వత్రా హర్షం రాష్ట్రంలో అమలుచేస్తున్న పారిశ్రామిక పాలసీపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీకి విమానంలో వస్తున్నప్పుడు కేంద్రంలో పని చేస్తున్న ఒక ఉన్నతాధికారి పక్కనే కూర్చున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన నూతన పారిశ్రామిక పాలసీ గురించి చర్చించారు. దీనిపై ఆయన స్వయంగా ప్రశంసించడంతోపాటు చాలామంది పెట్టుబడిదారులు ఈ పాలసీని అభినందిస్తున్నట్లు తెలిపారు. పాలసీ ప్రతిని పంపాల్సిందిగా కోరడంతోపాటు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్ఫూర్తితో ఒక పాలసీని రూపొందించడానికి ఉపయోగపడుతుందన్నారు. అనేక పరిశ్రమలు తెలంగాణవైపు చూస్తున్నట్లు స్వయంగా ఆ అధికారి అభిప్రాయపడ్డారని వెల్లడించారు.
కేసీఆర్‌పై పీయూష్ గోయల్ ప్రశంసలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నంత వరకు తీవ్రమైన విద్యుత్ కొరతను అనుభవించిన తెలంగాణ.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అతి తక్కువ రోజుల్లోనే వేసవిలో సైతం విద్యుత్ కోతలు లేని పరిస్థితిని సృష్టించిన సీఎం కేసీఆర్‌ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పటికీ పరిశ్రమలు, గృహరంగం, వ్యవసాయానికి ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోత లేకుండా ప్రణాళిక రచించడం, అమలు చేయడం మామూలు విషయం కాదని కేటీఆర్‌తో వ్యాఖ్యానించారు.
దూరదృష్టితో ఆలోచించి ఇంతటి ఉత్తమ ఫలితాలు సాధించడంపై ప్రశంసలు గుప్పించారు. అంతకుముందు పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి పీయూష్ గోయల్ మాట్లాడుతూ విద్యుత్ ఉత్పత్తి రంగంలో అనేక కార్పొరేట్, ప్రైవేటు సంస్థలకు దేశంలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు.
చట్టం ఎవ్వరికీ చుట్టం కాదు: కేటీఆర్ ఏపీ రాష్ట్ర సీఐడీ పోలీసులు ఇటీవల తన కారు డ్రైవర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవ్వరికీ చుట్టం కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. తన కారు డ్రైవర్ తప్పు చేసినా, తాను తప్పు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందుకు ఎవ్వరూ మినహాయింపు కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయా న్ని ప్రస్తావిస్తూ, సీఐడీ పోలీసులు వారి పనిని వారు చేసుకుపోనివ్వం డి. తప్పు చేసినట్లు రుజువైతే దానికి తగిన విధంగా శిక్ష పడుతుంది. అందరి విషయంలోనూ అదే విధంగా ఉంటుందన్నారు.