Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పెట్టుబడుల స్వర్గధామం

-జేఅండ్‌జేకు సీఎం శంకుస్థాపన -పీఅండ్‌జీ, కోజెంట్ యూనిట్ల ప్రారంభం -తొలిదశలో 1500 కోట్ల పెట్టుబడులు -మలిదశలో మరో 6900 కోట్ల పెట్టుబడులు -6000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశం

KCR in inaugration of P&G Company తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతున్నది. గురువారం ఒకేరోజు రెండు ప్రఖ్యాత బహుళజాతి కంపెనీల భారీ కర్మాగారాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభోత్సవాలు చేశారు. మరో కంపెనీకి శంకుస్థాపనచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల వద్ద బహుళజాతి కంపెనీ, వినిమయ వస్తువుల ఉత్పత్తిలో రారాజు ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, ప్రఖ్యాత అద్దాల తయారీ కంపెనీ కోజెంట్ గ్లాస్ ఇండస్ట్రీ యూనిట్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. జాన్సన్ అండ్ జాన్సన్ అతిపెద్ద యూనిట్‌కు శంకుస్థాపన చేశారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సింగిల్ విండో పారిశ్రామిక విధానం, ప్రభుత్వ మైత్రీపూర్వక దృక్పథం పెద్ద ఎత్తున కొత్త పరిశ్రమలను ఆకర్షించడానికి దోహదం చేస్తున్నది. హైదరాబాద్ పరిసరాల్లో పరిశ్రమలకు అనువైన అన్ని వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం, సమస్యలు లేని అనుమతుల విధానం ప్రవేశపెట్టడం పారిశ్రామికవేత్తలకు అనువుగా మారింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ప్రదీప్‌చంద్ర చొరవతో పరిశ్రమల అనుమతుల ప్రక్రియ వేగంగా జరుగుతున్నదని అధికారవర్గాలు తెలిపాయి.

మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ మూడు పరిశ్రమలూ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే సుమారు ఆరువేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పెంజర్లలో ముఖ్య మంత్రి శంకుస్థాపన చేసిన జాన్సన్ అండ్ జాన్సన్ యూనిట్ దేశంలోనే అతిపెద్దది. జాన్సన్ అండ్ జాన్సన్ తక్షణం రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టింది. 47 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పరిశ్రమలో అదనంగా మరో రూ.4వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి, అవసరమైతే మరో 50 ఎకరాల భూమిని సేకరించడానికి కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది.

ఇక్కడ పర్సనల్ హైజీన్, స్కిన్ కేర్ ఉత్పత్తులు తయారవుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా వెయ్యిమందికి ప్రత్యక్షంగా, 2500 మందికి పరోక్షంగా ఉపాధి అందుతుందని కంపెనీ తెలిపింది. మెగా ప్రాజెక్టుకింద దీనికి కూడా పీఅండ్‌జీకి కల్పించిన అన్ని రాయితీలను ఇవ్వనున్నారు. త్వరలోనే రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్లతో తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. దక్షిణాది రాష్ర్టాలకు హబ్‌గా నిలువాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసింది.

4వేల కోట్ల పెట్టుబడులకు పీఅండ్‌జీ సంసిద్ధత రూ.900 కోట్లతో 170 ఎకరాల్లో నిర్మించిన ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ పరిశ్రమ యూనిట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కంపెనీ త్వరలో మరో 4000 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. దక్షిణ భారత దేశంలో ఉత్పత్తులను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.

ఫ్యాబ్రిక్, హోం కేర్, బ్యూటీ కేర్, ఓరల్ కేర్, ఫిమినైన్ కేర్ యూనిట్లను నెలకొల్పారు. దాంతోపాటు ప్యాంటీన్, రీజైస్, హెడ్ అండ్ షోల్డర్ వంటి షాంపూలు, టైడ్ డిటర్జెంట్లు తదితర అనేక ఉత్పత్తులను ఇక్కడ చేపట్టనున్నారు. రూ.900 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించనున్నారు. కనీసం ఉపాధిలో తెలంగాణకు చెందిన వారికి కనీసం 80 శాతం ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఐదేళ్ల వరకు వ్యాట్‌లో 50 శాతం రాయితీ ఇస్తోంది. స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ వంటివి మినహాయించారు. విద్యుచ్ఛక్తి వినియోగంలోనూ యూనిట్‌కు రూ.0.70 రాయితీని ప్రకటించింది. ఇంకా అనేక సబ్సిడీలను కంపెనీకి కల్పించింది.

అడ్డాకుల మండలంలో కోజెంట్ గ్లాస్ ఇండస్ట్రీ మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం వేముల గ్రామంలో కోజెంట్ గ్లాస్ ఇండస్ట్రీని 37 ఎకరాల్లో రూ.200 కోట్ల అంచనాతో నెలకొల్పారు. ఈ కంపెనీ అత్యంత అధునాతన టెక్నాలజీతో అతి సున్నితమైన సూది వాయిల్స్‌తో పాటు దుర్భేద్యమైన గ్లాసులను కూడా తయారు చేస్తుంది. ఆర్ట్ గ్లాస్ ఉత్పత్తులను తయారు చేయనుంది. జర్మనీ, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్ తదితర దేశాల నుంచి తీసుకొచ్చిన ఆధునిక యంత్రాల ద్వారా ఉత్పత్తులు చేస్తారు. కోజెంట్ ముందుగా రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టింది. అదనంగా మరో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ కంపెనీ 500 మందికి ప్రత్యక్షంగా, వెయ్యిమందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది.

పరిశ్రమలకు ఎర్రతివాచీ పారిశ్రామిక అవసరాలకు లాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం, భూముల కేటాయింపును సరళతరం చేయడం, రైట్ టు సింగిల్ విండో సర్వీసెస్ చట్టాన్ని తీసుకువచ్చి సింగపూర్ తరహాలో అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టడడం, ఒకే ఒక సిట్టింగ్‌తో అనుమతులన్నీ అందజేయడం, రాయితీలు, ప్రోత్సాహకాలను ముందుగానే ప్రకటించడంవంటి విధానాలతో తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు ఎర్రతివాచీ పరుస్తున్నది. ఫలితంగానే పెద్ద పెద్ద బహుళజాతికంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.